జనం

చూస్తూ చూస్తూ జనంలోకి పడిపోవాలి
జీవితం తెలిసిపోతుంది
ఇప్పుడన్నీ జనాలే చేసేస్తూంటారు
పైనుంచి ఆకాశాన్ని బద్దలుచేసి కిందనుంచి భయపడతారు
సమూహాలుగా కలిసి కొమ్మల్లో ఆకులై
విడిగా బ్రతికేస్తుంటారు
ఒకరిలాగా అరుస్తారు ఏదో జరిగినట్టు
దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళే చూస్తూ వూరుకుంటారు
కదులుతారు సమూహాలుగా
చెట్లమధ్యలోంచి ఎగిరే గుంపుల పక్షుల్లా
బాధలు మేఘాల్లా తేలుతూంటే
కన్నీళ్ళై కురుస్తుంటారు
దగ్ధమైపోవడం
ఘటనలు బద్దలైతే అటువైపో ఇటువైపో విసరబడటం
సంఘటనల కిందపడి పేలిపోవడం
ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటారేమీ తోచక
విషాదం గురించి చర్చిస్తూ ఇదికూడా
విషాదమేనని తేల్చేస్తారు
ఆవేశంతో ఆక్రోశంతో ఆవేదనతో
జనం జనంలాగా విస్తరిస్తారు
ప్రమాదాల గురించో
ప్రయోజనాల గురించో
సంధర్భ అసంధర్భ విషయాల గురించో బయటపెట్టి
వాళ్లలోనే ముద్దాయి ఉన్నాడనీ దాన్నొదిలేస్తారు
జనం నీటిలోని గవ్వలు
జనం గవ్వలోని నిశ్శబ్ద సంగీతంలా అరుస్తారు
జనం అంటే సముద్రం
జనం అంటే ప్రకృతి
జనం అంటే విశ్వం
 
సత్యగోపి Blog Design by Ipietoon