అతడొకడే

చెట్ల కొమ్మలనిండా పిట్టల కేరింతలతో
అలుముకున్నట్టు
చెవినిండా మాటలు ఘల్‌ఘల్ మని 
అల్లరి చేస్తున్నాయి
ఎవరో తోసేస్తే తిరగబడ్డ పురుగులా
అటుఇటు అక్కడక్కడేనో,
లోలోపల
చీకట్లలోనో తిరుగుతున్నాడతను
నడుస్తుంటే కిందనుంచి అతడి పాదాలపై
ఇంకొకరి చిన్నిపాదాలు ఆన్చిన పిచ్చి భావోద్వేగానికి
కళ్లు మూస్తే చిట్టిచిట్టి చేతుల్తో
ఇంకొకరు కళ్లు మూసిన తడి తన్మయత్వానికి
అల తాకిన ఒడ్డులా 
అతడిలోకి అతడే కరిగిపోతున్నాడు వింతగా
గదిలో విసిరేసిన వస్తువులా 
చప్పుడు చేయకుండా అతడొకడే
శూన్యంలోకి చూస్తున్నట్టుగా తలపైకెత్తి 
కాగితాలపై కన్నీళ్లతో
సంతోషాన్ని నింపుతున్నాడు
ఓ పాప తన చుట్టూ ఆడుకున్న అల్లరిని
ఓ పాప అతడి చేతుల్ని పట్టుకుని తన చిన్ని ప్రపంచాన్ని
చూపించిన ఆనందాన్ని
ఓ పాప సృష్టించిన పూల వంతెనల సంతోషాన్ని
హద్దుల్లేకుండా అరమరికలు లేకుండా
లోకాల్ని దాటి సముద్రమంత ఉధృతంగా 
చుట్టూ ప్రవహించేందుకు తోడొచ్చిన ఓ పాప జ్ఞాపకాన్ని
కన్నీళ్లతో కప్పేస్తున్నాడతడు
పాపను విడిచుండలేని తన పసితనాన్ని
అద్దం ముందు దోషిలా నిలబెట్టి 
వికృతంగా వెక్కిరిస్తూ అతడినతడే దూషించుకుంటున్నాడు
నీటి అడుగుల కింద నలుగుతున్న
గులకరాయిలా
ఆ గది గోడలకింద వూరకనే పడున్నాడతడు 
వూరికే అంటే వూరకనే అని కాదుగానీ
కొన్నికొన్ని సార్లు పనిచేస్తాడు
చాలాసార్లు పుస్తకాల్లోకెళ్ళి తలబాదుకొని
చరిత్ర దారులనిండా శిథిలాలను కదిలించో పడదోసేసో
వర్తమాన వీధులవెంట వెర్రికేకలను విసిరేస్తూనో
మళ్లీ వొచ్చి కూలబడతాడు

మౌనంగా

ఆకాశంపై నల్లమేఘాల్లా
అమాంతం కురుస్తారు పిల్లలు గెంతుకుంటూ
వరండా అంతటా
అల్లరల్లరిగా శబ్దాలను జల్లేసిపోగలరు
మౌనంగా వుండిపోతే
పక్షుల్లా నీ చుట్టే కేరింతల రెక్కలిప్పుతూ
నిన్నో నీటిపాయగా కదిలిస్తూ
ఆలోచనలను జ్ఞాపకాలను
అన్నిటినీ ముక్కలు ముక్కలుగా విరిచేస్తారు
అలాగే మౌనంగా వుండిపోతే
నువ్వు చూస్తుండగానే
నీ గుండెలోంచి నవ్వుని తీసినట్టు
మట్టిని తవ్వి ఏదో దాచిపెట్టి
గాల్లో ఎగురుతూ నిశ్శబ్దంగా వెళ్లిపోతారు
చీకటిని హత్యచేసిన వెలుతురు హంతకుడు
ఉదయాన్నే నీ భుజం తట్టి
వరిధాన్యంలాంటి సూరీడిని చూపెడతాడు
అంతే మౌనంగా కూర్చొని
ఒక్కటంటే ఒక్క కాఫీ గుక్క చప్పరించాక
అన్ని మొక్కల మధ్యలోంచి పువ్వొకటి
నిన్నావరిస్తుంది
మౌనంగానే వుండిపోతావిక
ఎప్పటికీ మాట్లాడనివ్వని
పరిమళం నిన్నామాంతం మింగేస్తుంది

బదులుగా

వాలుగా గోడకాఁని చేతులు కట్టుకుని 
దారినపొయే వారందర్నీ చూస్తుండిపో
ఎండను కప్పుకుని పోయేవారు
మట్టిని పూసుకుని పోయేవారు
చుట్టూ పరిసరాల్ని గుప్పిట్లో నింపుకొని పోయేవారు
తలపైకెత్తుకునో
తలొంచుకునో 
కాళ్లీడుస్తూనో, కాలాన్నీడుస్తూనో 
బ్రతికినంతగా బ్రతుకునిండా ఖాళీల్నీ నింపుకునేవారో 
కాసేపుండి
మౌనంగా తిరిగొచ్చేయ్ 
దారినిండా పగుళ్లమయమైన చీకటి పుప్పొడి 
రాత్రికి వర్షమై 
ఎవ్వరూ లేని ఆ రాత్రిలో 
నదిలానో ఏరులానో
ఒగరుస్తూ 
విహ్వలమవుతూ
జీవశక్తిని నింపుకుంటోందేమో ఎవడు చూడొచ్చాడు
నువ్వు చూడాల్సింది 
మూకుమ్మడిగా కదుల్తున్నట్టున్న
అర్ధాలంకారమయమైన లోకాన్ని...
అంతటిని ఒకే రూపంగా 
అపారమైన శూన్యదృక్కులతో చూడాలంతే
నువ్వే అనంతమైన రూపాల్లో తిరుగుతుంటావు
పలుకులు పలుకులుగా విడదీసి
కాలందారంతో కుట్టేసి ఎగరెయ్ 
బదులుగా పక్షిలా 
ప్రపంచమూ రివ్వున ఎగరగలదేమో

యుద్ధం గురించి

ఒక యుద్ధం గురించి మొదలుపెడదాం
ఎప్పట్లా కాకుండా యుద్ధం మధ్యలో నిలబడి
దాని శబ్దాన్ని వినగలిగి
యుద్ధం గుండెలో మార్మోగుతున్న నిశ్శబ్దాన్ని తాకగలిగి
ఆ నిశ్శబ్దం చేతిలోని గాలికి పెనుగులాడుతూ
నిశ్శబ్దవీరుడిలా
యుద్ధానికి మాత్రమే తెలిసిన సైనికుడిలా మరణించొకసారి
అప్పుడు యుద్ధం చస్తుంది
ఆ యుద్ధం చచ్చే శబ్దం విను
నీలోంచి
నీమీదనుంచి ఒక మనిషి నడిచెళ్లిన పెనుభారం దిగిపోతుంది
గోధూళిని పూసుకున్న రాత్రిలా
చల్లగా నీలం కారుతున్న ఆకాశం
నీ కాళ్లను తాకిన చోట ఒక యుద్ధం ముగిసిందని
నిశ్శబ్దమొకటి రెక్కలు కొట్టుకుంటూ
ఇంకో యుద్ధం జరిగే శబ్దంలో
పక్షి వాలినంత మృదువుగా కాళ్లను ఆన్చి ఆవరిస్తుంది
నువ్వూ ఇక బయళ్దేరు
నీ మీదనుంచి
నీలోంచి నీ చుట్టూ నువ్వొక నిశ్శబ్దమై గాలిలా పరుచుకుని
యుద్ధమొకటి మొదలుపెట్టు
యుద్ధమొక నిరాడంబర మనిషి
యుద్ధమొక నిర్వ్యాజమైన మనిషి
యుద్ధం మనిషికి పర్యాయపదం
ఊర్లను నగరాల్ని దాటుకుంటూ
నీలోనే మళ్లీ నువ్వొక యుద్ధమై పక్షిలా వాలిపో
ఇక యుద్ధం నీలోంచి అనంతంగా పరివ్యాప్తమవుతుంది
ఇంకొక మనిషితో ఎప్పుడూ యుద్ధం చేయకు
అది అస్సలు యుద్ధం అవ్వదు
నిన్ను నువ్వు ఖడ్గంతో ఖండించుకోవడమే ఇపుడు జరగాల్సింది
నీలోంచే నువ్వు రక్తం పూసుకుని
నీ కండలనే రెక్కలు చేసుకుని ఒక శూన్యంలోకి ఎగిరెళ్ళిపోవడమే
ఉత్కృష్టమైన గెలుపు
అక్కడినుంచి మళ్లీ మరణం కోసం ఎదురుచూడు
మరణానికి ముందొక యుద్ధం
మరణం తర్వాతొక యుద్ధం
యుద్ధం అవిశ్రాంత పెనుభూతం
యుద్ధం పరమప్రశాంత అనుభూతం

ఎప్పట్లాంటి

సాయంత్రం వాకిలిని తెరుచుకుని అతడి కంట్లోకి వచ్చేస్తుందామె గుండెను తడిమి తడిమి చీకటికి నవ్వునద్ది దేహాన్నంతా వెన్నెలగా వెలిగిస్తూ కలియతిరుగుతుంది అతడి నవ్వుల్ని సరస్సులా నిశ్శబ్దంగా కదిలే కన్నీళ్లనీ గవ్వల్లా ఏరి కొంగున బిగించి హృదయంలోకి పడవనొకదాన్ని వేసుకుని విహరిస్తుంది వెళ్తున్న కొద్దీ పావురమై ఇంద్రధనస్సు రంగుల్లోకి మారుతూంటుందామె ఇందాక వస్తూ ఓరగా తెరిచుంచిన ఎప్పట్లాంటి తలుపుని తోసుకుని పక్షిలా ఆమెలోకి ఎగిరెళ్ళిపోతాడతను
 
సత్యగోపి Blog Design by Ipietoon