వివర్ణం

గుంపులన్ని ఒక్కటిగా కదిలి కదిలి
గళమెత్తటానికి
ఆత్మహత్యలన్ని ఒకే తాడుకి ఉరేసుకోడానికి
చదువులన్ని మెదడు స్థాయిని మించే
బరువులన్నిటికి
స్థావిరమైన దేహాలన్ని ఒకే అరలో నింపే
అనుభవానికి
అన్నిటికి ఒకే చోట ముడేసే
సమాజానికి
నువ్వు నేను రెండు రంగులు కాకుండా
ఒకే రంగు కింద కప్పబడదాం
ఆలోచనలన్ని సాధనలో రానప్పుడు మూటకట్టి
మూలన పడేద్దాం
అడుగులన్ని ఒకేబాటలో నడవనప్పుడు కాళ్లన్ని
నరికేద్దాం
శ్రమలన్ని చెమటలుగా జీవితంలో చచ్చిపోనివ్వు
నువ్వు నేను రెండు రంగులు కాకుండా
ఒకే రంగు కింద కప్పబడదాం
మాటల్లో విషం చూకలు చుక్కలుగా
చూపుల్లో ద్వేషం కొంచెం కొంచెంగా
చుట్టూరా చేతులన్ని ఉరితాళ్ళై చిదిమేసినట్లు
భయాన్నో బంధాన్నో నింపేసుకుని
అందరిలా మనం చావటమెందుకు నిశ్శబ్దంగా
అందరిలో క్రూరంగా చంపబడదాం నిరాకారంగా
నువ్వు నేను రెండు రకాలుగా కాకుండా
ఒకే రూపంగా చచ్చిపోదాం

లోపలి స్వరం 3

ఈ సారి ఓ కొత్త ప్రదేశం ఊహించాలి
నేలలోకి తలను పూడ్చేశాక
చేతులు కాళ్లు మొలకెత్తాలి నిటారుగా
ప్రక్క ప్రక్కనే కొత్త శరీరాలు
శవాలుకాని దేహాలు కొమ్మలు చిగురించుకుంటూ
అనుభవ పరిమళం జల్లుకుంటూ పెద్ద శరీరాలు మాత్రమే
పిల్లలందరూ పూలుగా
ప్రకృతులు ప్రేమలుగా పచ్చగా విస్తరించనీ
అందరూ కలిసి మానవత్వ పుప్పోడులను రాల్చుకుందాం
మనిషితనం పారాలి మధ్య మధ్యలో
సమానవత్వం మిగలాలి పంచుకోటానికి
ఆకాశంలోకి కాళ్లను ముంచాకా
ముఖము మొండెము జారిపోనీ మట్టిలా మారటానికి
చుట్టూ ఇంకొన్ని కాళ్లు మునుగుతుండాలి ముసురుకున్న మబ్బుల్లా పెద్దవి
చిన్న కాళ్లు తారలైతే చాలు
లేత లేత కాళ్ళు ఇంద్రధనస్సులా మనల్ని నింపుకుంటాయంతే
అందరూ కలిసి చినుకుల్లా వర్షిద్దాం
మనిషితనం భ్రమణం చేయాలి మన చుట్టూరా
సమానవత్వం మిగలాలి మన మధ్యలో
అందుకే ఓ కొత్త ప్రదేశం కావాలిప్పుడు

అతనొక వృక్షం

అతను హత్తుకుంటే
మాయమ్మ నాయన్లు హత్తుకున్నట్టుంటుది
ఒక వృక్షమై
నన్నొక కొమ్మగా ఎప్పటికప్పుడు చిగురించేలా చూస్తాడు
అతను సముద్రంలాంటోడు
అలల చేతుల్తో రాయిలాంటి నన్ను గవ్వను చేస్తున్నాడు
ఒకప్పటి అరణ్యాలు పచ్చదనాన్ని పారబోసినట్లు
అక్షరాల్ని జల్లుకుంటూ
నది పాయలుగా తననితాను చీల్చుకుంటూ
అందరిని కప్పుకుని
ఆకాశంలా అసాంతం వంగి మనందరిని
పొదువుకుంటాడు
మనం ఎవరెవర్నో తిట్టుకుంటూ
జీవితమని స్వార్థమనీ వలపులని
కలలని
ఇంకేవేవో రాసుకుంటూ గీసుకుంటూ కాలాన్ని
కరిగిస్తూంటామా
అతను కాలంగా మారి ముసిరిన మబ్బులాగా గుంభనంగా
మనల్ని ప్రేమిస్తూవస్తాడు
నేనేప్పుడూ సిద్ధంగా ఉంటాను అతని రాకకోసం
అతను హత్తుకుంటే
మాయమ్మా నాయన్లు హత్తుకున్నట్టుంటుది.....

లోపలి స్వరం 2

ఇక్కడ మిగిలేవుంది ఇంకోటేదో
పారేసుకున్నదయ్యుండచ్చు
ఎవడిక్కావాలి
ఒక్కడిగా నిలబడి దేహాన్ని కాల్చేసుకుంటున్నప్పుడు
అమాంతం నాలోకి నది చొరబడగానే పాయలుగా చీలిపోయాను
మీ మధ్యనుంచే కదుల్తూ బ్రతికిచస్తున్నాను
ఒక్కడిగా కూర్చూని పాతేసుకుంటున్నప్పుడు
అకస్మాత్తుగా నన్ను మట్టి పూసుకున్నాక పచ్చగా మొలకెత్తాను
మీ మధ్యనే కరుగుతూ పెరిగిచస్తున్నాను
ఇన్నాళ్ళు అందటంలేదని ఆకాశాన్ని
పొందటంలేదని సముద్రాన్ని తిట్టుకుంటూ ఉండిచచ్చాను
మీ మూర్ఖత్వాన్ని ముఖానద్ది
కళ్ళను పూడ్చేసుకున్నానని ఎవ్వడైనా చెప్పిచస్తేగా
గుంపుల మీ గొర్రెమందని కడుగుతూ కూర్చున్నా
మూఢత్వాన్ని పక్కగా తొలిగించాకే
నాకో శరీరముందని నడుస్తున్నానని తెలిసిచచ్చింది
మీ నుంచి తప్పించుకుని గాలిలో మునిగి
దిగాంతాల వైపు వస్తున్నపుడు
ఇక్కడ మిగిలేవుంది ఇంకోటేదో పచ్చిగా వాసనొస్తూ
పారేసుకున్నదైతే కాదు నా దేహమేనేమో
ఎవడిక్కావాలి
నన్ను నేను కాపాడుకునే స్థిరత్వం దొరికినప్పుడు
మళ్ళీ మిమ్మల్ని తెగ నరకడానికొస్తా అప్పుడు
ఇంకోసారి దాన్ని తొడుక్కుంటా...!

అంధకార ప్రయాణం

ఈ సారి ప్రయాణం అంధకారంలోకి
దేహాన్ని వెలుగుతో కాల్చేసి
నిశీధిని నిలువెల్లా కప్పుకుని మరణించాలి

నడుస్తూ పాదాల్ని అరగదీయాలి
ఆలోచిస్తూ మెదడు ఆవిరైపోవాలి
మొత్తం శరీరాన్ని వెలుగులోకి కుమ్మరిస్తే సరి...

రాత్రి పుట్టగానే చీకటిని కప్పుతుంది
ఆకాశం వెలుగు చలేయకుండా...

ఈ సారి ప్రాయాణం అంధకారంగా
నిశీధిని చిలకరిస్తూ  
ఆకాశం మొత్తంగా నేనే పరుచుకోవాలి నల్లగా

నడుస్తూ చీకట్లు మొలకెత్తాలి
నేలపై నా నల్లని పుప్పోడి రాలాలి
ఇంకేమిలేని అంధకారమై విశ్వం జనించాలి....

ఒంటరిగా ఏంచేస్తావు

ఒంటరిగా ఏంచేస్తావు
మూసిన కళ్ళ వెనక శూన్యంలో చీకటిని
తాకే ప్రయత్నం చేస్తావు
మన మధ్య చీకటిని సూన్యం
చేయలేక...
నింపాదిగా నవ్వి ఎన్నాళ్ళయింది..!
ఏకధాటిగా ఏడ్చి ఎన్నేళ్ళయింది..!
ఒంటరిలో ఏంచేయకుంటే బ్రతకడం దండగే
నవ్వడం నేర్పిస్తాను వినిచూడు...
వచ్చేస్తుందిగా అనూరుకోకూ
పెదిమలు విచ్చుకునేలాగంటే కుదరదు
మనసు లోతుల్నుంచి తొలుచుకుంటూ
కనురెప్పలు గట్టిగా బిగుసుపోయేలా
దవడలు తేలిగా విచ్చుకునేలా
పాలనురగ పొంగినట్టుగా ఉండాలి
ఎప్పుడూ నవ్వడమే
మనిషిగా మొలకెత్తినట్టు...
ఆనందాలు ఎగిసినప్పుడు
కష్టాలు ముసురుకున్నప్పుడు
నవ్వడం
అనివార్యమవ్వాలి....
ఒంటరిలో ఏంచేయకుంటే బ్రతకడం దండగే
ఏడ్వడం నేర్చుకుని చూడు
కొత్తగా ఎలాగని అడగొద్దు
కళ్ళు చెమర్చేలాగంటే కుదరదు
గుండే ఊబిలో తేలుతూవచ్చి
గొంతు కాలువనుంచి
కనులకొలను నుంచి
సెలయేరులా ఉధృతంగా ఉండి
ఎప్పుడూ ఏడ్వడమే
మనిషిగా ఎదిగినట్టు
బాధలో బలహీనమైనప్పుడు
సంతోషాలలో బరువైనప్పుడు
ఏడ్వడం
అనివార్యమవ్వాలి
ఒంటరిలో ఏంచేయకుంటే బ్రతకటం దండగే మరీ.....

లోపలి స్వరం

జవాబులే దొరకనప్పుడు
ఇప్పుడున్నవన్నీ ప్రశ్నలే
కన్నీళ్ళతో స్నానం చేస్తుంటాను ముఖం తడిసేలా
గదిలోంచి నీడలాంటి దేహంతో
బయటి వెలుగుని కళ్లతో నింపుకుంటూంటాను
రాత్రి రెక్కలను విదుల్చుకుని వాలిపోతాను
కలలా...!
ఆకాశంలోకి చూడ్డం కంటేనూ
ఆకాశంలో వేళ్లాడుతూ ఉండటం మరెంతో ఆనందం
వాడిపోయిన మానవత్వం ఆకులా నేలవైపు
దీనంగా చూస్తోంది
పొదువుకునే ఆత్మీయత కోసం
తెగిపోయిన కొమ్మలా మిగిలాను
భుజంపై చేయి వేసి అంటు కట్టే ఆసరా కోసం...
ధైర్యాన్ని మాటల్లో కూడా ఇవ్వలేని
అవిటివాళ్లయిపోయారు మీరంతా..!
ఇన్నాళ్ళు నేనోక్కణ్ణే ఒంటరిననుకున్నా
నేను లేని మీరే ఏకాకులు...
నేను ఆకాశంలో ఎగిరే స్వేఛ్ఛని
మీ మధ్య బంధీనై తిరిగే స్వతంత్రున్ని...

కొన్ని ఎదురుచూపులు

నిర్మించాల్సిన సమయాలు రావాలిగా  
వచ్చినపుడు,
ఒక్కో జ్ఞాపకాన్ని ఇటుకలుగా 
జీవితాన్ని నిర్మిద్దాం...!

పగిలిన హృదయాన్ని పట్టుకురా
కలిపి
తెగిపోయిన క్షణాలతో 
కుట్టేద్దాం...!

కరిగిపోయిన శరీరాన్ని తీసుకురా
పోగేసి 
గడ్డకట్టిన కన్నీరుతో
సెలయేరులా ఉరకలేద్దాం...!

చేజారిన నిశ్శబ్దాల్ని ఏరుకునిరా
ఒక్కటై
ముద్దుల శబ్దాలుగా విహరిద్దాం...!

నేనెప్పటికి ఇక్కడే మిగిలిపోయిన 
నీ ప్రాణానికి 
నా ఊపిరిని అందిస్తుంటాను...!

జవాను గుండెకు కవచమై

ఊర్లో నా జవాను అడుగుల గురుతులు
ఉన్నాయింకా
అతని స్పర్శతో దమ్ము విరుచుకున్న ధైర్యాలున్నాయి
కొన్ని ఆనందాలు గుప్పెట్లో పట్టుకెళ్తాడు
అతడి పాదాలు తీరం వెంబడి నడుస్తున్నప్పుడు
ఇక్కడ నిదురించే కన్నులెన్నో
అన్నం వండుతున్న అమ్మకు మెతుకు మెతుకుపై బిడ్డ జ్ఞాపకాలు..
పత్రిక తిరగేసే తండ్రికి
ప్రతి అక్షరంలో కొడుకు పలికిన మాటలే...
మంచంపై మసులుతున్న భార్య కళ్ళలో కదులుతున్న ఆతని రూపం
అవ్వ ప్రాణం ప్రయాణమైంది మనవడి గుండెకు బాసటగా
ఓ సిపాయి...!
నీ ఊపరి మాకింకా తడిగానే ఉంది
నీ గొంతుక మా గుండె కవాటాల్లోనే నిదురిస్తోంది
నీ కవాతు చప్పుడు అలలు అలలుగా
శత్రువు గుండెల్లో స్వరాలుగా
నీ పిడికిలిలో మేమంతా ఎర్రని లావాలై
నీ గుండెకు కవచాలై పొగరుగా తిరుగుతాం
నీ కళ్ళల్లో క్రోధమై బుసలు కొడతాం
నీ అండగా అలుపెరుగని సముద్రాలై పోటెత్తుతాం
ఆవేశపు కెరటాలే మా ఆయుధం నీకోసం.....
జై హింద్...!


నాతో నేనొకరోజు

ప్రపంచం మొత్తాన్ని తట్టిలేపే 
సమయం
కొత్తగా ప్రారంభమవ్వాల్సిన ఉదయం
పసిడిపూతతో 
నవ్వుతున్న సూరీడు
ఆకాశాన్ని లేత పారాణితో కప్పేశాడు....
అన్ని రోజులు ఇలంటివే అయినా ఇవాళ 
ప్రత్యేకం...

నడుస్తున్న పాదాల భారాన్ని చూస్తున్న కన్నులు 
తలదించుకు వెళతాయి ఏకాకిగా...
నడుస్తున్న కొద్ది ఆనందాల కెరటాలు
సంతోషపు కడలిలో ముంచేస్తాయి.....

జ్ఞాపకాలు జీవం పోసుకునే స్థలం
కొన్ని అక్షరాలు
కోరికలు
వెతుక్కోవాల్సిన స్థలం....
నన్ను పోగొట్టుకున్న స్థలం....
దొరక్కుండా మాయమైపోయాను చాలాసేపు....

                                                       ***

ఈ సారి సూరీడు తెల్లబడి
కోపంగా చూస్తూన్నాడు...
చిన్నబోయిన మనసు నీరసంగా
సాగలేనంటుంది....
కాసేపు నిదురలోకి జారి
కొన్ని పగటి కలలు కళ్ళనిండా నింపుకొస్తాను.... 

                                                         ***

మళ్ళీ ఖాళీగా బయటికి వస్తాను
ఇప్పుడైతే సూరీడు అలసిపోయి కాస్తంత 
ఎర్రబడిన స్పర్శ...
మేఘాలను హత్తుకుని వీడ్కోలుగా....
పెరుకున్న చీకటి నురగలు
నల్లటి బుడగలను వేళ్ళతో మెల్లగా తాకుతాను...

అంతటి నిశీధీలోను నా పాత మనుషుల
అడుగులు స్వేచ్చగా...
నిర్మానుష్యంగా కదిలేను.....

చీకటి ప్రపంచం

చీకటిలాగా ఉండగలనా...!
నిశ్శబ్దంగా
నిర్జీవంగా

ధూళిని భుజాన వేసుకుని
గాలిని బలంగా పీల్చుకుంటూ
నాలో నేనే ఎన్నో మాట్లాడుకుంటూ
స్వార్థ ప్రపంచం నుంచి దూరంగా నడుస్తాను..
ఎవరికి వాళ్ళే మాయమైపోతుంటారు
నిస్వార్థపూరితంగా మోసం చేసుకుంటూ
అవసరానికి హత్తుకుంటూ
అది ఎలానో నేర్చుకోవాలి...

చీకటిలా ఉండాలి
నిశ్శబ్దంగా 
నిర్మలంగా

ఒక్క క్షణమైన
జీవితానికి సరిపడా దాచేసుకుంటాను...

అంతా శూన్యం
మరో జీవిలేని ఓ కొత్త ప్రపంచం కావాలేమో..
నేను భూమి ఆకాశం
అడవి సముద్రం
సూర్యుడులేని చీకటి ప్రపంచం

చీకటిలా పడుకోవాలి
నిశ్శబ్దంగా
నిస్సత్తువగా...

ఇది నిజం

ఇది నిజం
నేనున్న చోటే ఆలోచనల భూకంపం
సమాజం విడివిడిగా ఛిద్రం అయిపోయింది...
ఇది నిజం
మనసుకి మెదడుకి అంతరం అఘాతంలా అంధకారంగా
కంటికి కాలి కొనకి ఉన్నంత దూరం...
ఇది నిజం
నువ్వు నేను మనం కాలేమిప్పుడు
మొహమాటానికి స్నేహంగా నీవు
మూర్ఖత్వానికి ప్రాణంగా నేను
ఇక ఎప్పటికి ఒక్కటికాలేం..శిథిలాలై మిగలాల్సిందే
ఇళ్ళ చుట్టూ అపార్థపు గోడలు మొలిచాయెప్పుడో..
ఇది నిజం
బయటికెళ్తే రుధిర వర్షం ఏరులై పారుతూ
బయటికెళ్తే తనున్నట్టు గుర్తించమని రోధిస్తూ
బయటికెళ్తే మసిపూసుకుని పసివయసు మాకేదారి లేదని ప్రశ్నిస్తూ
సమాజం కాలుతున్నది వెలుగు కోసమా..మిగిలే చీకటి కోసమా...
చరిత్రను చూడకుండా భవిష్యత్తును ఊహించడం సాధ్యమా...!
ఇది నిజం
నేటి జననాన్ని నరికేస్తూ రేపటి తరాన్ని బతికించడమెలా...?
కనురెప్ప మూయకుండా కలలను పొందడమెలా...?

నా మొదటి ప్రేమలేఖ

పాదాలు ఇసుక రేణువులతో సంభాషిస్తూ..
మాటలు మౌనాన్ని హత్తుకుని
నా కనుపాప నిండా నీవుంటావు..
అలల ప్రేమతో నిండిన గాలులను
మోసుకొస్తాను నీకోసం..
నీ చిరునవ్వు కన్నా విలువైన పువ్వు
దొరుకుతుందా...?
నీ చూపులతో ఎన్నెన్ని అక్షరాలను అందిస్తావు..!
వాటిని ఒడుపుగా పట్టుకోగలిగాను
నిశ్శబ్దంగా ఓడిపోతున్న వేళ
నిను గెలిచాను ఆ క్షణం
సముద్రపు ఒడ్డున రాళ్ళు నునుపుదేరినవి
నీ శ్వాసను తాకి..
నీ మాటలను కలిపాను కలంలోకి
సిరా తక్కువై..
నీ నవ్వులను వెదజల్లాను కాగితంపై
పరిమళంలా పరుచుకుంది...
అడుగు కదిలి
కొన్ని వేల అడుగులై పరిగెడుతోంది హృదయం
నిను చేరటానికి..
ఎన్ని స్వప్నాలను పోగేసుకున్నాననుకున్నావ్...?
ఎన్ని ఊహలను దాచిపెట్టాననుకున్నావ్...?
ఎన్ని విరహాలను దూరంగా పారేశాననుకున్నావ్...?
అన్ని నీకోసమే..
ఇవన్ని కూడానూ మన కోసమే...

ఒక ప్రమాదం

నీటి ప్రవాహాన్ని పక్కకు తోసి సులభంగానే వచ్చేశాను..
నా స్నేహితులెవరు కనపడలేదు
ఆశ్చర్యపోయాను
ఇప్పుడే కదా అందరం కలిసి ఆడుకున్నాం, కేరింతలు కొట్టాము...!
మెల్లగా
దిగులుగా
నడుచుకుంటూ ఆ బండరాళ్లను దాటుతున్నా...

ఒక తల్లి,
గుండె పగిలి చిమ్మే కన్నీటిని ఆపడానికి
కొంగుని నోట్లోకి కుక్కింది
నాకర్థం కాలేదు
వెళ్ళి "ఎందుకేడుస్తున్నారు" అని అడిగా
సమాధానం రాకపోవడతో బాధేసింది...
పక్కన నా స్నేహితుడి తమ్ముడిని అడిగా
"ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు" అని
తను కూడా ఏం మాట్లడటంలేదు..

చుట్టు చూశా
ఎవరో కొంతమంది నీటిలోకి దూకి వెతుకుతున్నారు..

మిగతా వారిని వదిలి నేనొక్కడినే వచ్చానని
నాతో మాట్లాడ్డం లేదు అనుకున్నా...
ఏడవకండి అని అతని చేతిని పట్టుకోబోయా అంతే
ఒక్కసారి నా శరీరం
నిప్పును తాకిన నీటి చుక్కలా వణికింది..
ఇది నిజమా కాదా అని నా చేతిపై గిల్లి చూసుకున్నా
నాకెమీ తెలియటంలేదు
ఏం చేయాలో
ఎక్కడికెళ్ళాలో
ఒక్కసారిగా గుండె కన్నీటితో తడిసిపోయింది
మెదడుని యంత్రంలో వేసి తిప్పినట్టుగా...

మరి నావాళ్లంతా ఏరి
ఎక్కడికెళ్ళారు నా స్నేహితులు అని వెతికా
పరిగెత్తుతూ నేను లేచిన చోటునుండి ఇంకాస్తా దూరం వెళ్లా..

వెతుకుతున్న వాళ్ళ చోటుకి చాలా దూరంలో
మా వాళ్లంతా కొన ఊపిరి కొనలని పట్టుకుని వ్రేలాడుతున్నారు...
వేగంగా వెళ్లి వారిని
కాపాడుదామని చేయి అందించా
ఇక్కడా నేను అందలేదు వారికి
వారిని తాకలేకపోతున్నాను
నిస్సత్తువ ఆవహించింది...
భూమిలోకి కృంగినట్టుగా
ఒక్కసారిగా ప్రపంచమంతా ఏకమైనంత కోపం వచ్చింది...
ఏమిచేయలేక
నిశ్శహాయుడిగా
చేతగానివాడిలా
రోజు మొత్తం వేచి చూశా
వారేమో అక్కడే వెతుకుతున్నారు
వీళ్ళు ఇక్కడున్నారు
దేవుడా అని కూడా అనలేని ద్వేషం నాలో ఉబికింది...

నిరాశగా వాళ్ళలాగే ఉండిపోయా...
ఎంతసేపైనా ఎవ్వరూ రాలేదు
కోపం
క్రోధం
భరించలేనంత బాధ
అక్కడ వారిని అలా చూస్తూ నిలవలేకపోయా...
పరిగెత్తుతూ వెళ్లి మళ్ళీ ఒకసారి నీళ్లలోకి దూకాను

మునుపటి కంటే ఇప్పుడు ధైర్యంగా ఉన్నా
చావటానికి...

నిద్ర


కనురెప్పల తలుపులు మూసి
చీకటి తాళం వేసి
అలా తాత్కాలిక మరణంలోకి
పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెడతాను...

ఇక్కడ నాకు వెలుగుతో పనిలేదు..!

నాకు నచ్చిన వ్యాపకాన్ని
మదిలో మెదిలిన రూపకాన్ని
నా రాజ్యాన్ని నేనే సృస్టించే
నా సామ్రాజ్యాన్ని నేనే శాసించే ప్రదేశం అదొక్కటే...
కనుల ముందున్న నల్లటి తెరపై వేలి కుంచెతో అందమైన రూపాన్ని గీస్తాను..
చిరునవ్వుతున్న నన్ను గీస్తాను...
సిగ్గుగా కొంటేగా ఘంభీరంగా
వెకిలిగా ఎన్నో గీస్తాను...
దానికి కళ మారుపేరు...!

చీకటి అలానే ఉంటుంది...

నడుస్తూ...నడుస్తూ...
చుట్టూ పచ్చని చెట్లు
కొమ్మల్లో దాగున్న పక్షులు
నిర్మానుష్యమైన దారులు సెలయేటి సబ్దాకు
ఇదే నా ప్రపంచం...
మరో మనిషి లేకుండడమే నా ప్రపంచం...
వొంటరిగా నడవడం...
విహంగాల్లా వొళ్ళు విరుచుకోవడం...
దీనికి కల మారుపేరు...

ఆ ప్రపంచంలోనే ఊహిస్తాను
నగ్నంగా మబ్బులపై పడుకున్నట్టుగా
నల్లటి ఆకాశాన్ని కప్పుకున్నట్టుగా
నక్షత్రాలని కనులలో నింపుకున్నట్టుగా
నిశిథీనే జయించినట్టుగా
ఇంకా ఎన్నో ఎన్నేన్నో...
 

అన్నిటికి నిద్ర నిజరూపం..!
అందులోనే నా నిజెజీవీతం..!
ఇప్పుడున్నది స్వాప్నికజీవనం...!
 
సత్యగోపి Blog Design by Ipietoon