సంఘర్షణలు

సంఘర్షణలంటే
సంఘటనల చివరల వేలాడుతుంటుంది
నిశ్శబ్ద వాతవరణాల గందరగోళంలో
గాఢమైన చీకటిలో
సంచరిస్తున్న భయం నుంచి
గదిలో ఒంటరి ఆలోచనలనుంచి ఉద్భవస్తుంది...
లోపలి వైపు ఎక్కడో ఒప్పుకోలేని భావాలనుంచి రావచ్చేమో
ఓర్పు గుర్తుపట్టలేనంతగా నశించాక
సమూహాల్లో సంచరిస్తుందని తెలుసుండాలి
ఒక్కోవ్యక్తిఆవేశంపై నుంచి ఎగురుతుండటం చూసుండాలి
రాత్రి చనిపోయాక ఉదయాలన్నిటికి ఆరోజంతా సంఘర్షణే
కాలానికి వర్తమానానికి సాక్షిగా మనిషుండటం సంఘర్షణే
అలాంటపుడు
జీవితం మొత్తం సంఘర్షణల మూటేనేమో
బాధలు
దు:ఖాల తేలికలు బయటకు దూకితే సంఘర్షణ చనిపోయిందనుకుంటాం...
ఒక వైపునుంచో
ఒక నిస్సత్తువలోనో
అసహనాల కుప్పలమీదో
భారంగా కృంగదీసే సమయాల లక్ష్యంగానో
ఇంకోసారి మొదలవ్వదనీ మాటివ్వలేం కదా..
మాటలు కూడా
అటు ఇటుగా పడున్న అక్షరాల ఏకాంత సంఘర్షణలోంచే పుడతాయని కనిపెట్టాలి

ఇప్పటికిపుడు

ఇప్పటికిపుడు ఊహించాల్సొస్తే
గుండ్రంగా కాకుండా పైకి కిందకి ఊగే భూమిని
పచ్చని ప్రకృతి నీలంగా నడిచే దృశ్యాన్ని
మృదువుగా వెన్నెలజల్లే సూర్యుడిని
భగభగమండే చంద్రుడిని
పెద్దవాళ్ళంతా ఆకాశాల్లా మారి విస్తరించడాన్ని
మేఘాలన్ని పిల్లల్లా నవ్వులు వర్షించడాన్ని
వీటన్నిటిని
శూన్యం ఒడిలో ఊయలూపి
ప్రాణవాయువు జోలపాడే ఆడవాళ్లనూహిస్తాను
ఊహించడానికి అడ్డుగోడలేముంటాయి
రక్తం నదిలా పారడాన్ని
శరీరంలో నది పాయలుపాయలుగా ఈదడాన్ని
ఆకాశాన్ని కత్తిరించి భూమికి చొక్కా కుట్టడాన్ని
మీ అనుమతి లేకుండా మిమ్మల్నందర్నీ
పక్షుల్ని చేసి
నేనో పేద్ద వేటగాడినవడాన్నూహిస్తాను...
నాపై పిడిగుద్దుల్లా కురుస్తారేమో
నన్నేమైనా చేయగల భీకర శక్తులుంటాయి మీకు
చేతుల్ని వెనక్కి విరిచి
కాళ్లను కొలిమిలో కాల్చేస్తారని తెలుసు
తలను నుజ్జు నుజ్జు చేయండి
నేనూహించడం మాత్రం ఆపలేరు
అందుకే కాబోలు
మనిషితనం నిండిన మనిషిని ఊహించడం సాధ్యపడడంలేదు నాకు...!
ఇప్పటికిపుడు ఊహించాల్సొస్తే
విశ్వమంతా నిశ్శబ్దావరణాన్నూహిస్తాను...

మనిషి

నేను చెప్పదల్చుకున్నది స్తబ్దంగానున్న
ఒక గుంపుని కాకపోవచ్చు
వ్యక్తిత్వమో
అవ్యక్తమో
మనిషిలోని ఇంకో మనిషి సంగతో గుర్తొస్తుంది
కట్టే విరిగి పెలుసు ఎగిరినంత స్వేచ్ఛగా
సమస్యల్ని
విషాదాల్ని
వెనక్కో ముందుకో తోసే ప్రయత్నాల గురించో...
ఎన్ని భ్రమలున్నా
గాయాలు గెలిచి రక్తం ఎర్రగా ఏడ్వడాన్ని
సమస్యలు చిట్లి కన్నీరొలికేదాన్ని గురించో...
చెప్పాలనుకుంటే
ఆనందంలో వణికే మనసు గురించో
భయంలో బెదిరే శరీరం గురించో
చెప్పడానికి మాటలన్ని మూటలా దూకేయవచ్చు...
అన్నట్టు దూకడం గురించైతే
మనిషి మనిషిలోకి దూకాలి
ఆకాశంలా మారి మబ్బులా చర్మం కప్పుకుని
నిశ్శబ్దంగానో
శూన్యంగానో
హరివిల్లులా పెదవుల్ని విప్పార్చి
నీలంగా నవ్వడమొకటే చేయమంటాను
ఏదైతేనేం
మనిషి మనిషిలోకి ఎగరాలంటాను....

అక్షరాలు

నా హృదయానికి బొమిక తొడుగు
అక్షరాలు
నా ప్రాణానికి చర్మపు కంబళాలు
అక్షరాలు
నా దేహానికి రుధిరవర్ణాలు
అక్షరాలు
నా మాటకు శబ్దస్వరాలు
అక్షరాలు
వేదన సంవేదనల ఊటలు
వాదన సంవాదనల మూటలు
అక్షరాలు...అక్షరాలు..!
జనుల మూఢత్వ చేతనము
సమాజ జడత్వ నిర్మూలనము
అక్షరాలు...అక్షరాలు..!
అఖిల భావాల సంభృతాలు
దృశ్యశ్రవణ సంశమాకృతులు
అక్షరాలు...అక్షరాలు..!
 
సత్యగోపి Blog Design by Ipietoon