పక్షిరెక్కల చప్పుడు

ఊగుతున్న ఊయలలో
అటు ఇటు నా శరీరం ఒక లోలకం
మట్టికి మేఘానికి
చాటు మాటు ప్రణయ లేఖలు చినుకులన్ని
మట్టిలోంచి నా దేహంలోకి
మోయలేని కన్నీళ్లన్నీ ఇంకిపోతుంటాయి...
సున్నితమైన వాటి గురించి చెప్పడమంటే
నాలాగా ఏడుస్తున్న
ఒకే ఒక ఆకాశంలాంటిదొకటుంటుందేమో
బాధలన్ని నీలంగా బరువయినవనీ
మేఘాలన్ని జ్ఞాపకాలుగా
పొడిపొడిగా రాలిపడటమనీ
కెరటాల ఉప్పెనకి
తీరమై స్పందించడమనీ
పక్షి రెక్కల చప్పుడుకి పసిపిల్లాడినై ఊగుతాను
నేనొక జ్ఞాపకం
నిశ్శబ్ద నిఘంటువునై
మరణం చేతిలో ప్రత్యర్థినవుతే
రాలిపడే చూపులన్నిటికి దృశ్యాన్నవుతే
మృదువైన రాత్రిలోకి మాటలుగా
అస్పష్టమవుతాను
చీకటిగది మౌనంగా మాట్లాడుతుంది నాలాగా
నిర్మానుష్యంగా
నిర్లక్ష్యంగా
ఆవరించివున్న ఆకాశంలా
మిగిలిపోవడం ఒక నేర్పు అచ్చంగా నాలా...!!

సావేరి

ఒక నిశ్శబ్దం ప్రవేశించినపుడు
అటు ఇటు వెతుకులాట మొదలవుతుంది
నీలోను నాలోను
చుట్టూ ఖాళీతనమేర్పడి
కనురెప్పలు పెదాలై అక్షరాలు గుసగుసగా
మౌనం వంతెనగా టపటపమని
యదసవ్వడి గాలిని చీలుస్తూ
అలల నురగలు మేఘాల్లా చుట్టేస్తే
చినుకులమై ఆకాశంలోకి రాలిపడదాం
కోమల తీగలు అలుముకున్నపుడు
హరితమై వికసిద్దాం
ఇద్దరి మధ్య దూరం ఎదిగినపుడు
ఒక మెలుకువ
మరణిస్తుంది కలల ఆవరణంలో
ఒకానొక
సున్నితమైన భావోద్వేగంలోంచి మొలకెత్తడమంటే
గొంగళిపురుగు రంగుల రెక్కలు చాచడం
భారమైన చలనంలోంచి ప్రకటితమవడమంటే
చినుకులు బుగ్గలపై మృదువుగా
జారిపడటమనే ఉద్వేగం
ఎప్పటికి అంతరాల్లోని శాసనమొక్కటే
నేనొక పదం
నువ్వొక పద్యం

ఈ రాత్రిలో

శూన్యంలో ఎగురుతున్న
పక్షి వెన్నెల
రెక్కలాడిస్తూ నేలపై 
నేనింకో పక్షి
ఆశలరెక్కలతో ఎగిరి శూన్యంలోకి
ఆ పక్షిని పట్టుకోబోతే నా ఊహల
గోరు తగిలి
తనపై ఓ మచ్చ మిగిలిపోతుంది

రెక్కలు విప్పి తన భుజాలపై నుంచోబెట్టాలని
ఆ పక్షి మబ్బులరెక్కలతో
నన్నందుకోబోతే..!
శ్వాసల నిచ్చెన కూలి నేను పడిపోతాను...

రాత్రికిరువైపులా తీరాలు తెగిపోయి
ఎర్రని కాంతికిరణ తూటాలకు
బలవుతూ ఓ పక్షి..!
జీవనాగ్నిగోళంపై నడుస్తూ
బూడిదవుతూ ఇంకో పక్షి..!

కాలం కొమ్మపై ప్రణయానికి మళ్ళీ
ఒక రాత్రి పుష్పించేదాక
పక్షులు రెండు
కొన ఊపిరితో విలవిల్లాడుతూ...
 
సత్యగోపి Blog Design by Ipietoon