ఖడ్గం

ఐదు వేళ్ళు
ముడుచుకున్నపుడు
ఒక పిడికిలి 
ఒక శక్తి
కొన్ని సమూహాలు
కదులుతున్నపుడు
ఒక యుద్ధం
ఒక శక్తి
కొన్ని గుట్టల సమాహారం
పచ్చబడినపుడు
ఒక అడవి
ఒక శక్తి
ఒక భూభాగం
ఉమ్మడిగా జీవించడం
ఒక దేశం
ఒక శక్తి
ఒక దేశం ఆక్రోశం
ఒక దేశం ఆవేశం
ఒక దేశం ఆవేదన
ఈ భావోద్వేగాల స్థానచలనమే
అసహనమై వ్యాపిస్తుంది.
పదాలను, భావోద్వేగాలను
వాటి రాజసంనుంచి
దింపేసందర్భాలను ఎదుర్కొనే
ఒకే ఒక ఖడ్గం తయారవ్వాలి
ఖడ్గం పిడికి అధికారమివ్వాలి
ఎప్పటికపుడు దుర్వినియోగంకాకుండా
ఖడ్గం అంచు
అధికారంవైపే గురిపెట్టాలి

నీవు

పలచబడిన రాత్రిని నీ కళ్లలో దాస్తాను
రెల్లుగడ్డి పరుచుకున్న చినుకుల్లోంచి పరావర్తనమైనట్టు 
రాత్రిపుడు ఇంద్రధనస్సవుతుంది
చీకటంతా చెక్కపొట్టులా
నేలమొత్తాన్ని కావాల్సినంతమేర ఆక్రమించేస్తుంది
నీలోంచొక వెలుతురు పురుగు
అప్పుడపుడు కొంగరెక్కల్లా తడుముతూ రాత్రిని నిద్రపుచ్చుతుంది
ఏ జాములోనో నీవొక నీలిసముద్రమై 
నలనల్లని రాత్రికి
అమితమైన శృంగారపు సౌఖ్యాన్నిస్తావు
కిటికీ అద్దాలమీద పిచ్చుకల కాలి 
గురుతులు చెరగకుండానే,
ఇంటిపైకప్పుమీద తచ్చాడుతున్న వర్షాన్నీ
ఏ మేఘము ఎత్తుకెళ్ళలేకుండానే,
దుప్పట్లు అలసి నిదురపోయేందుకు 
కాళ్ళదగ్గరే ఆవలిస్తున్నపుడు
సమయాలు గడిచిపోవడం తెలుసుకోలేవు...
కొన్నాళ్ళకు చలికి వణుకుతూ 
నీమాటల ఉదయాల్లోంచి బయటికొస్తాను

దుఃఖనది

ఇప్పటికీ దుఃఖాన్ని విరూపంగా చీల్చేసేవారెవరుంటారు
దుఃఖాన్ని వెతకటం అందరికీ వృధా అయిపోయినపుడు
ఏడ్వడం వ్యసనంగా తయారవుతోంది
అడుగు కింద, అనుభవాల కింద భావోద్వేగాన్ని నియంత్రించలేకున్నాం
దుఃఖమంటే ఏడ్వడం కాదు పరిస్థితులను పరిశీలన చేయడం
దుఃఖించడం భవిష్యత్తు నిర్ణయానికొక అన్వేషణ
గంటలుగా రోజులు
రోజులుగా నెలలు
నెలలుగా సంవత్సరాలు దుఃఖించి, అంతర్ధానమవడం ఎవరు నిర్ధారిస్తారు?
ఇప్పటికీ దుఃఖాన్ని ఖండఖండంగా కూల్చేసేవారెవరుంటారు
సమస్యల కాగితంవెనక సమాధానం చూడకపోవడం ఏ దృష్టిలోపంగా పరిక్షిస్తారు
వ్యక్తులు సమూహాల్లో
సమూహాలు వర్గాల్లో
వర్గాలు మళ్ళీ వొక వ్యక్తి వ్యక్తిత్వంలో దుఃఖించడం ఎవరు నిరూపిస్తారు?
లోకం నిండా దుఃఖం నదులుగా పారినపుడు
ప్రతి నదీ ఎదుటివ్యక్తి స్వాంతన సముద్రంలో కలిసి మళ్ళీ దుఃఖనదికోసం
తవ్వుకునేదెపుడు?
ఇప్పటికైనా దుఃఖాన్ని శుభ్రంచేసే వారికోసం వెతకాలి
నచ్చినట్టుగా దుఃఖించి కన్నీళ్లను అలంకరించుకునేవాళ్ళెక్కడుంటారో శోధించాలి
ముఖానికదో ఆభరణంగా గుర్తింపునివ్వాలి
దుఃఖించడమొక ప్రక్రియ కాదిపుడు అదొక పోగొట్టుకున్న జ్ఞాపకం
బుగ్గలు చల్లబడేంత దుఃఖం ఎవరికైనా వస్తోందా పొరపాటుగానైనా
వేళ్ళతో తుడవలేనంత పరధ్యానంగా దుఃఖించడం ఎవరికి సాధ్యమవుతోందిపుడు
ఎపుడైనా కల వచ్చిందా కనీసం దుఃఖిస్తున్నట్టు...
పిల్లాడిలా స్వేచ్ఛగా దుఃఖించండి మరి అమోఘమైన తృప్తినిస్తుంది
మనిషెప్పుడైతే మేఘంలా దగ్గిదగ్గి కన్నీళ్ళుపెట్టుకుంటాడో అపుడే
అసలైన దుఃఖితుడవుతాడు

విరామం

ఇంటి వరండామూలలో పరకపుల్లలు దాచిన
కాసిన్ని వర్షపు చినుకుల్లా... 
లేగదూడ, పొదుగునుంచి తాగాక గుక్కగుక్కకు మధ్యలో
జీవంపొందే పాలతడిలా...
చిన్నప్పటి కాగితాలలోంచి తీసి మళ్ళీదాచిన అమాయకపు
లేతగాలికి నవ్వే నెమలీకలా...
విరామం అన్వేషించేది కాదు రాత్రిని పొద్దుటి కంచంలో వొంపి
వేళ్లతో సుతారంగా నిమిరి మేల్కోల్పినట్టుగా ఉంటుందంతే...
అమితమైన హాయిలో ఆశ్రయించిన నవ్వుకి
నిశ్శబ్దానికి కుదిరిన ఒప్పందం తాలూకు విరామం గురించి,
పరిపూర్ణమైన స్వేచ్ఛతో తిరుగుతున్న సీతాకోకచిలుక
రెక్కలపై సేదతీరిన రంగులకున్న విరామం గురించి,
ఏ గట్టుమీదనో కూర్చుని వొంగివొంగి మరీ
పట్టుకోగలిగే తూనిగను అడగాలి
నగరం నడిబొడ్డుమీద ఎదురుపడి మరీ
పలకరించే మనిషిని అడగాలి
విరామం కలలోంచి తెంపుకోగలిగే ఆనందమవ్వాలి
అందుకే ఉన్నచోటునుంచి కాస్తంత జరిగి
ఊపిరి పీల్చుకోడానికి విరామం అడుగుతున్నాను

చిన్నవిషయాలు

చాలా చిన్న విషయాల్నే మాట్లాడుకుందాం
ఇక్కడే పరిసరాల చుట్టూ పరిభ్రమించే వాటినే పేర్చుకుంటూ
వరండాలోని నేలమీది తడిని కాస్త అద్ది చూడగలిగినపుడు కంటిలోని తడి తేలుతుంది
పిట్టగోడ అంచుల్లో వేలాడే మరకను తాకినపుడు గతకాలపు బాధొకటి రాలుతుంది
ఏమీ తోచనపుడు అలా వీధిలోకెళ్ళి నిలబడు బతుకు నడుస్తున్నట్టు నెమ్మదిగా తెలిసిపోతుంది
చుట్టూ వుండే అన్ని గడపలని పరిశీలించు అందరూ జీవితంలోకి వస్తూ పోతూ
ఎంత క్రమశిక్షణగా పనులు చేస్తుంటారని అనిపించకమానదు
నిన్ను నువ్వు వేరుశెనగలా ప్రీతిగా ఒలిచి చూడు
గడిచిన సమయం ఎంత దుఃఖపడి నీకు దూరమైందో చెబుతుంది
ఓ అరగంటో పావుగంటో దానికిచ్చేయి నిన్నెంత జాగ్రత్తగా, అపురూపంగా ప్రేమించిందో లేఖరాస్తుంది
చాలా చిన్న విషయాల్నే మాట్లాడుకుందాం
ఎక్కడో ప్రపంచానికి ఇంకోవైపున ఉత్పన్నమయ్యేవి కావవి
ఇన్నాళ్ళ తర్వాత నువ్వు స్వీకరించగలిగేది ఇంతకుమించి ఏముంటుంది
ఇంటిబయటి చెట్టుకింద తలొంచి నిలబడు ఉత్తేజం నీలోకి వేర్లనుంచి
ప్రసరించడం కనిపెట్టగలవు నువ్వు
ఆకాశం, మంటనార్పి నిద్రపోయేటపుడు మేడమీద దుప్పటిపరుచు చలచల్లని చీకటిలా పడుకుంటుంది
పక్కనే పడుకుని చుక్కల్ని లెక్కపెట్టు సరదా అనేది దీనికన్నా పెద్దదేమీ అవ్వలేదు
ఇంకొకరి నుంచి ఏమీ అడగకుండా ఇన్ని దొరికినపుడు జీవితం ప్రత్యేకమైనదేమీ కాదు
ఆలోచించినంత సులభంగానే కాగితంపై లిఖించబడుతుంది
నీపై నీ పరిశోధనకి అమూల్యమైన పెట్టుబడి జీవితమే
కష్టనష్టాల్లో జీవితాన్ని నడిపే గొప్పకార్మికుడివి నువ్వొక్కడివే
చాలా చిన్నవిషయమే కదూ మాట్లాడుకున్నామిపుడు

అతడు

అతడు నిషిద్ధ వస్తువవుతాడేమో
కొన్నాళ్ళకో లేదూ ఇంకొన్నేళ్ళకో లేదూ ఇంకో క్షణంలోనో
గోరువెచ్చటి నదొకటి అతనిదేహంపై అల్లుకుపోతేనో 
సమూహమేదీ అతని చుట్టూరా చేరనపుడో
అతనాలోచనల సముద్రమంతా గాజుముక్కలుగా పగిలినపుడో
విషాదాలను విడమర్చుకుంటూ నిషిద్ధ వస్తువవుతాడు
నడిరాత్రి ఏ ఖాళీనో పూరించడానికి ఉదయిస్తాడనుకుంటా చీకటి కాగితాలవెనక 
నునులేత చేతుల్తో గదంతా పరుచుకున్న పరికరాలు నింపుకుని
రేపటి కూడికలెన్నిటినో విత్తుతూపోతుంటాడు
నిన్నటివి ఇవాళ్టివి చచ్చిపోతున్నట్టుగా అతనికేంతెలుసు 
విత్తుతూపోవడమంటే పంచుతూ పోవడమనీ, లోపలితనమేదో దాచుకుంటూ పోవడమనొకటే తెలుసతనికి
హఠాత్తుగా ఏ అసందర్భ అసమయాల్లోనో నిషిద్ధమైపోతాడు
అతన్నెవరూ ఏమీ అనలేదు అసలతన్నెవరూ మాటగానైనా కదిలించి వుండరు
అతడికతడే నిషిద్ధ వస్తువుగా పునఃనిర్మితమైపోగలడు
అంతటి కఠినత్వం అతనిలోకెలా వెళ్ళిందనేది ఎప్పటికిదొరకని మరో నిషిద్ధ విషయమే...
అతడెప్పుడూ నిషిద్ధమనేదాన్ని తెలిసికొనివుండడు
నిర్యాణమో విధ్వంసమో జరిగిపోవాలనీ అనుకొని వుండివుండడు
తయారుచేయడమెలాగో తెలియక నడుస్తున్నట్టుగా వుందతడికి
లేకపోతే మళ్ళీ వెలుగురేఖలతో నిండే సమయానికి దేనికోసం వెతుకుతున్నట్టు
మట్టికోసమేనా ఇప్పుడు ఎప్పుడూ దొరకని ఆ మట్టికోసమేనా
మట్టిని చూసినవాడు మట్టిలో నడిచినవాడు మట్టిపైనే పడుకొన్నవాడు
అతడొక్కడే మట్టికి దొరికే మట్టిలాంటివాడయ్యుంటాడు
ఎవరికి అక్కరలేని మట్టిపై ఇంకో అతడికోసం వెంపర్లాడ్డం తప్ప ఏమీ ఉండదు
అందుకే అతడొక నిషిద్ధ వస్తువు అవగలిగాడు

వొక నేల వొక ఆకాశమై

పదేపదే వరండా దాటొస్తున్నట్టుగా చూపు స్థిరంగా ఉండడంలేదెందుకో
1
నదిలోంచి సముద్రంలోకి నిన్ను నన్నుగా ముంచి ఒంపుతున్నట్టుగానో
చెట్లనుంచి మొక్కలకు నాలోంచి నీకొక శ్వాసను అందజేసినట్టుగానో
ఎపుడైనా ఏం కోరుకుంటాం కావాల్సినపుడు
పూలరెక్కలపై చేయి చేయి కలిపి కొమ్మకు వేళ్ళాడ్డమేగా
ఏదైనా వున్నదనుకుంటే పెదాలడ్డులేకుండా పంచుకోవడమేగా...!
2
మాటలేమీ లేకుండా సెలయేరై నేనోక వెల్లువ
గువ్వ తాకిన ఆకునుదుటిపై నువ్వో రాలిపడే సిగ్గుతుంపర
కొండ చివరల్లో చేయి చాచి లాలిగా తాకెళ్ళే మేఘాల అలజడికి
మేఘాల అంచుల్లో లీలగా కదిలించి వెళ్ళే పక్షిరెక్కల దిగులుకి
కావాల్సినన్నిసార్లు నేనెన్నో చెప్పుకునుంటాను వాటికి...!
3
ఇప్పుడే రంగులద్దిన రాత్రి వీధిలా మన గదుంటుందనీ
ఎప్పట్లాగే ఓరగా తెరుచుంచిన నీ కంటిరెప్పలా తలుపుంటుందనీ
వొక మాటగానో వొక పలరింపుగానో లేదూ మరొక స్పర్శగానో
గడిచిపోయిందనే సంగతి ఉదయాల్లో నురగలై పగిలిపోయుంటుందనీ...!
4
ఒకేవొక్కటి పదే పదే తెలీకుండా జీవితపు అంచుచివరల్లో ఆగింది
దండెమీది నా తువ్వాలుకున్న నీ బొట్టుబిళ్ళ నవ్వునడిగే భాషేదనీ?
నేనో సమాధానమై నువ్వో ప్రవాహమై వాగుల్లో జారిపడే కెరటాలమవుదామంటావెందుకో..?
5
ఇద్దరి బుగ్గల శబ్దాల్లోంచి పసితనపు ప్రపంచమొకటి జారిపడి
నువ్వూ నేనూ మిగిలిపోతాం వొక నేల వొక ఆకాశమై !!
 
సత్యగోపి Blog Design by Ipietoon