సొగసరి

అతని గడ్డమ్మీద ఆమె చూపుడువేలునుంచి 
ఆమె బుగ్గమీద అతను వేళ్లను ఆనించి 
ఆ నీలాకాశానికి అటువేపున మనిద్దరి లోకముంది కదా అనుకుంటూంటారు
గాలి అలికిడిలేకుండా వర్షంలా కురవడానికి ప్రయత్నిస్తుంది ఇద్దరిమధ్య
చుట్టూతా నల్లగా ఆమె కాటుకేమో అవరించిందనిపిస్తుంది అతనికి
చుట్టూరా అతని ధైర్యం పరుచుకున్నట్టనిపిస్తుందామెకు
అతడమాయకంగా లేచి పిల్లాడిలా ఆమెచుట్టూ తిరగాడుతాడు
ఆమె గంభీరంగా గమనించనట్టే ఎటో చూస్తూంటుంది
చిటికె వేస్తున్నట్టుగా వేళ్ళతోనే గాలిని అదిమేస్తూంటుంది
మొక్కను ప్రేమగా చూస్తూ కన్నెగరేస్తుంది
వెనక్కు తిరిగి ప్రపంచాన్ని చూస్తూ నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది
నేలకోసం వెతుకుతూ ఆకుపైన వేలాడుతున్న నీటిని అంతెత్తునుంచి తోసేస్తుంది
ఒరిగిన పూలమొక్క పరిమళాన్ని కనురెప్పలతో పీల్చేస్తూంటుంది
అటుగా వెళ్ళే దారిని ఓరగా చూసి తలొంచుతుంది
అతడామెను చూస్తూ ఉక్రోషపడుతూంటాడు
నువ్వెందుకు నాముందు స్వేచ్ఛగా అన్నిటితోనూ సరసమాడతావంటాడు
నేను నీ ముందు సిగ్గుపడుతుంటాను అంటుందామె
ఆకాశం ఇద్దరిని సమ్మోహపరచడానికనీ నీలాన్నొదిలి పడుకోడానికెళ్తుంది

వెలకట్టలేని

బతికుండడం వెలకట్టలేని హాయి
బతికి ఇలా మీతో మాట్లాడుతుండడం ఇంకొంత హాయి
మీ జీరగొంతునుంచి మాటనైనా
పక్షి స్వరంనుంచి రెక్కరంగులు పూసుకున్న గమకాన్నైనా
నడుస్తూ అతిచిన్న రాయిని తట్టుకుని కింద పడడమైనా
చొక్కా జేబులో నింపుకుని ఇన్నాళ్ళుండడం ఉత్తి ఊహ కానేకాదు
జీవితంపై వెన్నెలపడవలా తీరం కోసం సాగుతున్న బతుకిది
పూలమొక్కల మధ్య ఆగిపోయిన కాలాన్ని వెతుకుతూ పచ్చసముద్రంలో జారడం
పోగేయబడ్డ జనాలనుంచి అస్పష్టంగా జల్లబడే మాటలను ఏరుకోవడం
ఉదయానికి రాత్రికి మధ్య పద్మవ్యూహంలో భ్రమించి తిరుగుతుండడం
ఇవన్నీ బతుకున్నామనేదానికి ఆనవాలేగా..!
దూరమయ్యారనో దగా చేశారనో ఎవరినో ఎందుకనుకోవాలి
మీకోసమే మీరు మిగిలి శ్వాసిస్తున్నందుకు,
అంతగానైతే మీ దేహంతో మీరు బ్రతికున్నందుకు ఆనందించండి
నాకంటూ నేనున్నానని బతుకుండడం
నాకోసమే ఉషోదయం పుడుతోందని బతికుండడం
మధురంగానో, మృదుమధురంగానో మాటలు చెబుతూ బతికుండడం గొప్ప హాయి
ఎవ్వరికి చెప్పకూడనిదొకటి చెబుతాను నమ్మండి,
పరిమళం లేకుండా బతికున్న గాలి
ఎంత అందంగా వుంటుందోనని ఆలోచిస్తూ
బతికుండడం వెలకట్టలేని హాయి

మందారవృక్షం

వొక మెలకువకు నువ్వు నేనూ సాక్ష్యం
నీ ప్రియమైన చేతులకు దొరకని నా నవ్వుని నీకందిస్తాను
నా అమితమైన పలకరింపుల భారాన్ని నీలోంచి నాలోకి ఒంపేయ్
మళ్ళీ ఇటువైపుగా రావేమోననే సందేహాలుండవు
ఎదురుపడటమేగా ఇద్దరికీ నచ్చిన పని
ఇద్దరి కళ్ల వాగులోకి కాసిన్ని వెలుగు పడవలను వదిలేద్దాం
మాటలన్నిటిని రాలిపడుతున్న పూల భారాన్ని మోసే నిశ్శబ్దంలోకి తర్జుమా చేద్దాం
మూల మలుపుల ఒంటరితనాన్ని నీ నడకతో నా చూపూలతో నింపేద్దాం
నువ్వొక మందారమై పరిమళిస్తుంటావు
నేనొక వృక్షమై శ్వాసిస్తాను
అక్కడినుంచి కదిలొచ్చాక ఖాళీ గదికి భారమవుతాను
నువ్వూ ఏ మొక్కకో దిగులకన్నీళ్ళ తడిదనాన్ని ఇచ్చేస్తుంటావనీ
నా మీదుగా వెళ్ళిన పక్షిరెక్కకు వేలాడదీస్తూ నా ప్రేమలేఖ తగిలిస్తాను
లోకం గుడ్డిదవుతున్న వేళ
నీ వెన్నెల నా పౌర్ణమి కలిపి రేయిని వెతుకుదాం
రెండు నిశ్శబ్ద ప్రపంచాలకు,
మన రెండు నవ్వులకు,
నువ్వు నేను వారధి

పగిలిపోయిన మట్టికుండ

మనిషి మనిషిలా వుండడంలేదెందుకో
వ్యవస్థలా హడావిడిగా దిక్కుతోచనివాడిలా 
తిరుగుతున్నాడేగానీ మనిషి ఒట్టి పగిలిపోయిన మట్టికుండ
బతికుండగా ఠంగుఠంగున రాగాలెన్నిటినో నింపుకున్నాడు
ఖాళీ అయినపుడు బోల్డంత శూన్యాన్నీ మోశాడనుకోండి..!
ఇపుడు మాత్రం ఒట్టి పగిలిపోయిన మట్టికుండ
ఇన్నాళ్ళు మాటలదేముందిలే అనీ
చాలా చవగ్గా చూశాడుగా
వాటికి విలువేముంది పనికిరాని శబ్దపుపగుళ్ళు
వాటికి శక్తెక్కడిదీ ఛిద్రమైన అక్షరాలనుకొని, బోర్లాపడి పాటపాడాడు
ఎన్నాళ్ళని మాటలు మౌనంగా వుంటాయి
భళ్ళున మెరుపు చప్పుళ్ళతో ఆకాశాన్ని చీల్చినట్టు
అతని గొంతుని చీలగొట్టాయి
అతనిపుడు ఒట్టి పగిలిపోయిన మట్టికుండ అంతే...
మాటలకు తెలుసు ఎపుడు మరణించాలో
మాటలు అగ్నిని మింగిన విషాదకెరటాలు
ముత్యాలను సృజించే ఆల్చిప్పలు
మనుషులు లేని చోట అవి ఎందుకుంటాయి
మాటలు మరణంకోసం ఎదురుచూడగలవు
నాలుక బీడుపగుళ్ళ లోపలికి తలనూ దూర్చగలవు
గొంతు అగాధంలోకైనా దూకి అక్షరమక్షరంగా పగిలిపోనూగలవు
ఏదైనా చీకటిగదిలో వుండగా ఏ వెలుతురు చేతులో
వస్తాయనీ,
సముద్రాన్ని కాగితంలా తిరగేసే కెరటాలకున్నంత బలమొస్తుందనీ,
ఎవరైనా వాటికి చెబితే బాగుండుననిపిస్తుంది..!
ఏనాటికైనా మనిషి మట్టి పరమాణువనీ,
పునఃనిర్మితమవుతాడని చెప్పడానికెవరైనా ఉండాలిక్కడ..!!

సీతాకోకచిలుక

వొక ఉదయాన్ని నువ్వూ నేను తెరుస్తాం
సీతాకోకచిలుక, రంగుల్ని నీ బుగ్గలమీద వొదిలి
ఖాళీరెక్కల్తో పారిపోతుంది...!
గదిమూలలో చినుకులింకా బతికేవున్నాయి
మేఘం లేకపోయినా...
బహుశా,
నీ హృదయం ఇక్కడే ఉన్నట్టు
తెలిసిందా వీటికీ...!
తలుపు దగ్గరే రాత్రి వేచివుంది
ఆకాశాన్నొదిలి...
నేనేమీ సాయపడలేను
తలుపు తీయాలంటే నీ నీలిసముద్రపు
కళ్లు తెరుచుకోవాలిగా...!
ఒకానొక పొద్దుటిపూట
మంచు మీగడలా నేలపై పరుచుకునే వేళ
నీ పెదాలమీంచి
సీతాకోకచిలుక రంగుల్తో ఎగిరిపోతాను...!!

(Published in Sakshi Daily on 07-12-2015)
 
సత్యగోపి Blog Design by Ipietoon