రహస్యం

అంతకంతకు ఒడ్డునున్న అలలన్ని మొక్కల్లా మారిపోయి పెరిగెడుతూ కదలడం...
అడవి, చినుకుల చొక్కానిప్పి పచ్చని దాని గుండెలోకి మొక్కల్ని లాక్కోడానికి నువ్వూ నేనూ సాక్ష్యంగా నవ్వుసంతకం చేసి వొకరిభుజంపై వొకరం చేతులేసుకుని చూస్తూ వుండిపోదాం. 
మోకాళ్లపై కూర్చొని కాస్త ముందుకు వొంగి నేలపై నీ పేరు రాస్తాననుకో...మృదువుగా ఒక మొక్క మనిద్దరిపై పాకుతూ విస్తరించడం వెనక ఏ సముద్ర గాఢస్పర్శ తడివుందో చెప్పలేం. 
నువ్వూ కింద కూర్చొని మోకాళ్లను వొకపక్కకు మడిచి సముద్రాన్ని, అడవిని, మట్టిని రాస్తూ, కాస్త కాస్త రాత్రిని వెదజల్లుతూ వుంటావు. ఏఁ నా పేరెందుకు రాయలేదనే ఉక్రోషాన్ని పారబోస్తాను పాయలు పాయలుగా...అంతకంతకూ నాలోపలి అలజడి విశాలమై రెక్కలిప్పుకొని విహరిస్తుందిపుడు.
వొక తుఫాను ఏ సముద్రంపై చావునెతుక్కుంటుందో ఎవరికి తెలుసంటావ్. వొక తుఫాను నా హృదయంలో చావబోతూ ఏదో గొణుగుతుంది రహస్యం చెబుతున్నట్టుగా...
చూడ్డమొకటే తెలిసినపుడు అలా చూస్తూ వుండడమే అనుకుంటే ఎలా, లోపల్లోపల ఎంత నిశ్శబ్ద యుద్ధం మొదలయిందో...ఆ యుద్ధాన్ని ఏ తూకంలో వేసి లెక్కగట్టగలను. చెవులనింకాస్త లాలిస్తూ ప్రయత్నించాను.
అహా..! ఆ రహస్యసంగీతాన్ని వినడం కుదర్లేదు. పిల్లాడిలా నీవంకే గారంగా వాలిపోతుంటే....
కొండగుహల్లోంచి వినబడినట్టుగా నీ గుండెల్లోంచి నా గుండెలోకి ఒక పాట నదిలా ప్రవహిస్తుంది...
"నువ్వే సముద్రం, నువ్వే అడవి, నువ్వే మట్టి...మరింకేదీ నీకో పేరు" అని, 

హత్యారణ్యం

వేట, తిరగేసిన చరిత్ర సిద్ధాంతమిపుడు
వేటముగిసి శవాన్ని తూకంవేసి
నీవాళ్ళకే అమ్మడం వర్తమాన శాసనం
అమ్ముడుపోవడం, నీవాళ్ళని అమ్మేయడమొకటే
నీకున్న అవకాశం
నాగరిక అరణ్యంలోని కూడలిలో
శవమొకటి నడివీధిలో..
నీ శవమో
నీలాంటి ఇంకో మనిషి శవమో
ఎవరిదైతేనేంటి శవాన్ని అమ్మేవాడిని ఉరితీయక
నువ్వు అక్కడే బేరమాడతావు
అమ్మేవాడు మనిషే
కొన్న నువ్వూ మనిషివే
కూడలిలో విరగబడి చప్పట్లు కొట్టే వారంతా మనుషులే
అరచేయి నొప్పెట్టేలా పిడికిలి బిగించిన వారూ మనుషులే
మనిషి శవాన్ని మనిషే వెలకట్టే సమాజం
ఎంతటి విలువైనది ?
ప్రశ్ననొకదాన్ని సమూహమ్మీదనుంచి
ఓ పావురం ఎగరేసుకుపోతుంది
రెక్కలు తెగిన పక్షివై అందరిమధ్య కదుల్తున్నట్టుగానో
చెదపట్టిన దేహంతో పొడిపొడిగా రాలినట్టుగానో
శూన్యంలో శ్వాసలేని నిశ్శబ్దంలానో
సమాజంలో ఒట్టిగా గడిపేయ్
ఇంకొన్నాళ్ళు వేచి చూడు అలాగే
నువు చావడానికి ముందో
లేదూ నిన్ను చంపడానికి ముందో
నీకింత అని ధర వేలాడదీయబడుతుంది
నీ ప్రాణాన్ని తూకంవేసుకునే అత్యంత సుఖమైన
జీవితాన్ని పొందే ఘనత దక్కుతుంది

వూరకనే

మౌనంగా 
ఎవరూ విననటువంటి మహా నిశ్శబ్దంగా
రాలిపడిన మనిషితాలూకూ 
నిరామయ సందర్భాన్ని కిందకు వొరిగి వినగలిగితే
పచ్చదనం నీ మెడనుంచి గుండెదాకా
సరసర ఎగబాకడం నీవు ఆపలేవు
మొక్క వూరకనే ఎలా మొలుస్తుంది మనిషిమీద
మట్టిలేకుండా
మట్టిలోకి లేపనంగానైనా కొంత తడిలేకుండా
వేర్లకు ప్రాణమెలా ఇవ్వడం
గుండెలోకి ఇంత మంటను ఎగదోసే రాత్రిపూట
చీకటి బూడిదై నీ కళ్లలోకి ఎగబాకినపుడు
అడవి వర్షాన్ని విదిలించినట్టు
నిన్ను నీవే చినుకులుగా పారేసుకుంటావు
ఇల్లు విడిచి
వీధుల్నొదిలి
ఊర్లకు ఊర్లను పిడికిట్లో బిగించి ముద్ద ముద్ద చేసేస్తావు
అనాదిగా మనిషిలో కొంత పసరికల
శకలాలు వుండకపోతే పచ్చదనం వూరకనే మొలవదనే
పురాతన వాస్తవాన్ని మళ్ళీ మళ్ళీ వినగలగడం
మట్టిలోంచి
మహోన్నతంగా
మనిషి చెట్టులా ప్రపంచంమీదకు విస్తరించడం లాంటిదే
వొకరొకరూ
మట్టి మీదకు తలలొంచి వినండి
పచ్చగా చెట్టు మీమీదకు పాముస్పర్శతో పాకుతుంది

నీటిచేతుల్తో

1
ఏ నీటి చేతుల్తోనైనా
ఓ మొక్కను పొదుముకోగలిగితే 
ప్రాణం దిగ్గున లేచి నృత్యం చేయడం చూడగలవు
2
ఏ నీటి చేతుల్తోనైనా
ఓ పిట్టను తడమగలిగితే
కొమ్మల్లో దాచుంచిన దానిస్వరం వినగలవు
3
ఏ నీటి చేతుల్తోనైనా
ఓ చెట్టును దాచగలిగితే
నదీనదాలు నీలో ప్రవహించడం తెలుసుకోగలవు
4
ఏ చెట్టునైనా నీలోపల్లోపల మొలకెత్తనిచ్చావంటే
చెట్టంత మనిషవ్వగలవు
5
ఓ చెట్టును పెరట్లోనో
ఒంటరిగా పడున్న ఏ దారిపక్కనో
పొనీ,
ఏమీ తోచక కూర్చున్న ఏ మట్టి గుండెకిందనైనా
వదిలేసి చూడు
నీదాకా పాదులు తీసుకుంటూ వచ్చి గుండెనిండుగా శ్వాసను నింపుతుంది
6
చెట్టు కంటేమించిన మనిషి లేనేలేడేమో
చెట్టంత మనిషి మరో చెట్టే అవగలదిపుడు
మనిషిని పూడ్చేసి చెట్టుని ఇంట్లో సేదతీరనివ్వాలి

మాట్లాడే మనిషికోసం

మాటల్ని మోసుకుతిరగడం నిరంతరాయంగా జరిగే ప్రదర్శన
ఎట్లా వున్నా ఎన్నిసార్లైనా అలంకారంచేసి
తెల్లారగట్టే ముఖమ్మీద అద్దిన వేకువలా 
మాటల్ని సిద్ధం చేస్తాం
వొడ్డున నుంచొని రాయిని చెరువు ఎదపై
గెంతులేయించినట్టు మాటని సమూహమ్మీదకు విసిరేస్తాం
జాతరలో పిల్లాడు బొమ్మకోసం నాన్న చొక్కా లాగినంత
నిర్మలంగా
మాటలకోసం
మనిషి మనిషిని పట్టుకుని కుదిపేస్తాం
మనిషిని కలిసిన ప్రతిసారి మాటలు పచ్చిగా వుంటాయి
కొత్తగా నిర్మించే భవనంలోంచొచ్చేంత పురాతన పరిమళం
మాటలపుడపుడు బరువవుతాయి
సముద్రాన్ని మోస్తున్న గవ్వలంత తేలిగ్గా
మాటల్ని అవలీలగా భుజానేసుకుని నడిచెళ్ళిపోగలగాలి
మాటలు ఎట్లాపడితే అట్లా పూర్వజీవికలోంచి మనిషి గొంతులోకి
దౌర్జన్యంగా దూరిపోయి ప్రదర్శించబడతాయి
గొంతే వేదికయి ముఖమే తెరలా అందరికీ ఆహ్వానం అందుతుంది
మాటలు అతి నిరాడంబరంగా భాసిల్లగలవు
మాటల్లో ఉత్కృష్టమైన సౌకుమార్యం వుంటుంది
మాటల్లో విధ్వంసకర యుద్ధం దాగుంటుంది
మాటల్లోంచి సంతోషాన్ని సులభంగా వెలికితీయొచ్చు
ఎదురొచ్చే మనిషి మనిషికీ నేలపై పంటచేలు పూసే పరిమళమంత
మృదువుగా మాటల్ని ఒలికించి సాగిపోవచ్చు
ఒకప్పుడు మాటలు తేలిగ్గానూ సౌందర్యవంతంగానూ వుండేవి
వాగు వీపుమీద సేదతీరే గడ్డిపువ్వులా
సునాయాసంగా మాటలొచ్చేవి
ఇపుడు మాటలన్నీ ఇంటి గుమ్మం బయటున్న
కసువులా దుమ్ముకొట్టుకుపోయాయి
మాటలకు పూర్వవైభవంకోసం మనిషి సిద్ధమవ్వాలి
వానచినుకు తగిలిన మట్టిలాగా మాటొచ్చిన మనిషి పరిమళిస్తాడు
మాట మనిషి మాటలంటే మనిషే
మాటలంటే మనిషికున్న రెక్కలే
మాటలంటే మనిషివ్యక్తిత్వానికి ప్రాణవాయువే
మాటల్ని చంటిబిడ్డలా చంకలో ఎత్తుకుని తిరగడం
నిరంతరాయంగా జరిగే ప్రయాణం
ప్రాణంలోంచి ప్రాణంలోకి ప్రయాణించే నిర్జీవమైన ప్రాణమే మాట
మనిషికి మనిషికి మధ్య వంతెన మాటలే
మనిషి మనిషిని నిద్రలేపే వేకువస్పర్శ మాటలే
మాటలు మేల్కోల్పుతాయి
మాటలు మంటపుట్టిస్తాయి
మాటలు గొంతులో దాక్కున్న అగ్నిపర్వతాలు
మాటలు మట్టిలో దాపెట్టిన విత్తనాలు
మాటలను మనిషిలో పూడ్చాలి
అపుడే మనిషి పుడతాడు మాటలను ఎత్తుకుంటాడు
మాటలు మాత్రం మనిషిని మోసుకుని అలా అడవిలోకి సంఘంలోకి విడిదికెళ్తాయి
 
సత్యగోపి Blog Design by Ipietoon