సొగసరి

అతని గడ్డమ్మీద ఆమె చూపుడువేలునుంచి 
ఆమె బుగ్గమీద అతను వేళ్లను ఆనించి 
ఆ నీలాకాశానికి అటువేపున మనిద్దరి లోకముంది కదా అనుకుంటూంటారు
గాలి అలికిడిలేకుండా వర్షంలా కురవడానికి ప్రయత్నిస్తుంది ఇద్దరిమధ్య
చుట్టూతా నల్లగా ఆమె కాటుకేమో అవరించిందనిపిస్తుంది అతనికి
చుట్టూరా అతని ధైర్యం పరుచుకున్నట్టనిపిస్తుందామెకు
అతడమాయకంగా లేచి పిల్లాడిలా ఆమెచుట్టూ తిరగాడుతాడు
ఆమె గంభీరంగా గమనించనట్టే ఎటో చూస్తూంటుంది
చిటికె వేస్తున్నట్టుగా వేళ్ళతోనే గాలిని అదిమేస్తూంటుంది
మొక్కను ప్రేమగా చూస్తూ కన్నెగరేస్తుంది
వెనక్కు తిరిగి ప్రపంచాన్ని చూస్తూ నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది
నేలకోసం వెతుకుతూ ఆకుపైన వేలాడుతున్న నీటిని అంతెత్తునుంచి తోసేస్తుంది
ఒరిగిన పూలమొక్క పరిమళాన్ని కనురెప్పలతో పీల్చేస్తూంటుంది
అటుగా వెళ్ళే దారిని ఓరగా చూసి తలొంచుతుంది
అతడామెను చూస్తూ ఉక్రోషపడుతూంటాడు
నువ్వెందుకు నాముందు స్వేచ్ఛగా అన్నిటితోనూ సరసమాడతావంటాడు
నేను నీ ముందు సిగ్గుపడుతుంటాను అంటుందామె
ఆకాశం ఇద్దరిని సమ్మోహపరచడానికనీ నీలాన్నొదిలి పడుకోడానికెళ్తుంది

వెలకట్టలేని

బతికుండడం వెలకట్టలేని హాయి
బతికి ఇలా మీతో మాట్లాడుతుండడం ఇంకొంత హాయి
మీ జీరగొంతునుంచి మాటనైనా
పక్షి స్వరంనుంచి రెక్కరంగులు పూసుకున్న గమకాన్నైనా
నడుస్తూ అతిచిన్న రాయిని తట్టుకుని కింద పడడమైనా
చొక్కా జేబులో నింపుకుని ఇన్నాళ్ళుండడం ఉత్తి ఊహ కానేకాదు
జీవితంపై వెన్నెలపడవలా తీరం కోసం సాగుతున్న బతుకిది
పూలమొక్కల మధ్య ఆగిపోయిన కాలాన్ని వెతుకుతూ పచ్చసముద్రంలో జారడం
పోగేయబడ్డ జనాలనుంచి అస్పష్టంగా జల్లబడే మాటలను ఏరుకోవడం
ఉదయానికి రాత్రికి మధ్య పద్మవ్యూహంలో భ్రమించి తిరుగుతుండడం
ఇవన్నీ బతుకున్నామనేదానికి ఆనవాలేగా..!
దూరమయ్యారనో దగా చేశారనో ఎవరినో ఎందుకనుకోవాలి
మీకోసమే మీరు మిగిలి శ్వాసిస్తున్నందుకు,
అంతగానైతే మీ దేహంతో మీరు బ్రతికున్నందుకు ఆనందించండి
నాకంటూ నేనున్నానని బతుకుండడం
నాకోసమే ఉషోదయం పుడుతోందని బతికుండడం
మధురంగానో, మృదుమధురంగానో మాటలు చెబుతూ బతికుండడం గొప్ప హాయి
ఎవ్వరికి చెప్పకూడనిదొకటి చెబుతాను నమ్మండి,
పరిమళం లేకుండా బతికున్న గాలి
ఎంత అందంగా వుంటుందోనని ఆలోచిస్తూ
బతికుండడం వెలకట్టలేని హాయి

మందారవృక్షం

వొక మెలకువకు నువ్వు నేనూ సాక్ష్యం
నీ ప్రియమైన చేతులకు దొరకని నా నవ్వుని నీకందిస్తాను
నా అమితమైన పలకరింపుల భారాన్ని నీలోంచి నాలోకి ఒంపేయ్
మళ్ళీ ఇటువైపుగా రావేమోననే సందేహాలుండవు
ఎదురుపడటమేగా ఇద్దరికీ నచ్చిన పని
ఇద్దరి కళ్ల వాగులోకి కాసిన్ని వెలుగు పడవలను వదిలేద్దాం
మాటలన్నిటిని రాలిపడుతున్న పూల భారాన్ని మోసే నిశ్శబ్దంలోకి తర్జుమా చేద్దాం
మూల మలుపుల ఒంటరితనాన్ని నీ నడకతో నా చూపూలతో నింపేద్దాం
నువ్వొక మందారమై పరిమళిస్తుంటావు
నేనొక వృక్షమై శ్వాసిస్తాను
అక్కడినుంచి కదిలొచ్చాక ఖాళీ గదికి భారమవుతాను
నువ్వూ ఏ మొక్కకో దిగులకన్నీళ్ళ తడిదనాన్ని ఇచ్చేస్తుంటావనీ
నా మీదుగా వెళ్ళిన పక్షిరెక్కకు వేలాడదీస్తూ నా ప్రేమలేఖ తగిలిస్తాను
లోకం గుడ్డిదవుతున్న వేళ
నీ వెన్నెల నా పౌర్ణమి కలిపి రేయిని వెతుకుదాం
రెండు నిశ్శబ్ద ప్రపంచాలకు,
మన రెండు నవ్వులకు,
నువ్వు నేను వారధి

పగిలిపోయిన మట్టికుండ

మనిషి మనిషిలా వుండడంలేదెందుకో
వ్యవస్థలా హడావిడిగా దిక్కుతోచనివాడిలా 
తిరుగుతున్నాడేగానీ మనిషి ఒట్టి పగిలిపోయిన మట్టికుండ
బతికుండగా ఠంగుఠంగున రాగాలెన్నిటినో నింపుకున్నాడు
ఖాళీ అయినపుడు బోల్డంత శూన్యాన్నీ మోశాడనుకోండి..!
ఇపుడు మాత్రం ఒట్టి పగిలిపోయిన మట్టికుండ
ఇన్నాళ్ళు మాటలదేముందిలే అనీ
చాలా చవగ్గా చూశాడుగా
వాటికి విలువేముంది పనికిరాని శబ్దపుపగుళ్ళు
వాటికి శక్తెక్కడిదీ ఛిద్రమైన అక్షరాలనుకొని, బోర్లాపడి పాటపాడాడు
ఎన్నాళ్ళని మాటలు మౌనంగా వుంటాయి
భళ్ళున మెరుపు చప్పుళ్ళతో ఆకాశాన్ని చీల్చినట్టు
అతని గొంతుని చీలగొట్టాయి
అతనిపుడు ఒట్టి పగిలిపోయిన మట్టికుండ అంతే...
మాటలకు తెలుసు ఎపుడు మరణించాలో
మాటలు అగ్నిని మింగిన విషాదకెరటాలు
ముత్యాలను సృజించే ఆల్చిప్పలు
మనుషులు లేని చోట అవి ఎందుకుంటాయి
మాటలు మరణంకోసం ఎదురుచూడగలవు
నాలుక బీడుపగుళ్ళ లోపలికి తలనూ దూర్చగలవు
గొంతు అగాధంలోకైనా దూకి అక్షరమక్షరంగా పగిలిపోనూగలవు
ఏదైనా చీకటిగదిలో వుండగా ఏ వెలుతురు చేతులో
వస్తాయనీ,
సముద్రాన్ని కాగితంలా తిరగేసే కెరటాలకున్నంత బలమొస్తుందనీ,
ఎవరైనా వాటికి చెబితే బాగుండుననిపిస్తుంది..!
ఏనాటికైనా మనిషి మట్టి పరమాణువనీ,
పునఃనిర్మితమవుతాడని చెప్పడానికెవరైనా ఉండాలిక్కడ..!!

సీతాకోకచిలుక

వొక ఉదయాన్ని నువ్వూ నేను తెరుస్తాం
సీతాకోకచిలుక, రంగుల్ని నీ బుగ్గలమీద వొదిలి
ఖాళీరెక్కల్తో పారిపోతుంది...!
గదిమూలలో చినుకులింకా బతికేవున్నాయి
మేఘం లేకపోయినా...
బహుశా,
నీ హృదయం ఇక్కడే ఉన్నట్టు
తెలిసిందా వీటికీ...!
తలుపు దగ్గరే రాత్రి వేచివుంది
ఆకాశాన్నొదిలి...
నేనేమీ సాయపడలేను
తలుపు తీయాలంటే నీ నీలిసముద్రపు
కళ్లు తెరుచుకోవాలిగా...!
ఒకానొక పొద్దుటిపూట
మంచు మీగడలా నేలపై పరుచుకునే వేళ
నీ పెదాలమీంచి
సీతాకోకచిలుక రంగుల్తో ఎగిరిపోతాను...!!

(Published in Sakshi Daily on 07-12-2015)

ఖడ్గం

ఐదు వేళ్ళు
ముడుచుకున్నపుడు
ఒక పిడికిలి 
ఒక శక్తి
కొన్ని సమూహాలు
కదులుతున్నపుడు
ఒక యుద్ధం
ఒక శక్తి
కొన్ని గుట్టల సమాహారం
పచ్చబడినపుడు
ఒక అడవి
ఒక శక్తి
ఒక భూభాగం
ఉమ్మడిగా జీవించడం
ఒక దేశం
ఒక శక్తి
ఒక దేశం ఆక్రోశం
ఒక దేశం ఆవేశం
ఒక దేశం ఆవేదన
ఈ భావోద్వేగాల స్థానచలనమే
అసహనమై వ్యాపిస్తుంది.
పదాలను, భావోద్వేగాలను
వాటి రాజసంనుంచి
దింపేసందర్భాలను ఎదుర్కొనే
ఒకే ఒక ఖడ్గం తయారవ్వాలి
ఖడ్గం పిడికి అధికారమివ్వాలి
ఎప్పటికపుడు దుర్వినియోగంకాకుండా
ఖడ్గం అంచు
అధికారంవైపే గురిపెట్టాలి

నీవు

పలచబడిన రాత్రిని నీ కళ్లలో దాస్తాను
రెల్లుగడ్డి పరుచుకున్న చినుకుల్లోంచి పరావర్తనమైనట్టు 
రాత్రిపుడు ఇంద్రధనస్సవుతుంది
చీకటంతా చెక్కపొట్టులా
నేలమొత్తాన్ని కావాల్సినంతమేర ఆక్రమించేస్తుంది
నీలోంచొక వెలుతురు పురుగు
అప్పుడపుడు కొంగరెక్కల్లా తడుముతూ రాత్రిని నిద్రపుచ్చుతుంది
ఏ జాములోనో నీవొక నీలిసముద్రమై 
నలనల్లని రాత్రికి
అమితమైన శృంగారపు సౌఖ్యాన్నిస్తావు
కిటికీ అద్దాలమీద పిచ్చుకల కాలి 
గురుతులు చెరగకుండానే,
ఇంటిపైకప్పుమీద తచ్చాడుతున్న వర్షాన్నీ
ఏ మేఘము ఎత్తుకెళ్ళలేకుండానే,
దుప్పట్లు అలసి నిదురపోయేందుకు 
కాళ్ళదగ్గరే ఆవలిస్తున్నపుడు
సమయాలు గడిచిపోవడం తెలుసుకోలేవు...
కొన్నాళ్ళకు చలికి వణుకుతూ 
నీమాటల ఉదయాల్లోంచి బయటికొస్తాను

దుఃఖనది

ఇప్పటికీ దుఃఖాన్ని విరూపంగా చీల్చేసేవారెవరుంటారు
దుఃఖాన్ని వెతకటం అందరికీ వృధా అయిపోయినపుడు
ఏడ్వడం వ్యసనంగా తయారవుతోంది
అడుగు కింద, అనుభవాల కింద భావోద్వేగాన్ని నియంత్రించలేకున్నాం
దుఃఖమంటే ఏడ్వడం కాదు పరిస్థితులను పరిశీలన చేయడం
దుఃఖించడం భవిష్యత్తు నిర్ణయానికొక అన్వేషణ
గంటలుగా రోజులు
రోజులుగా నెలలు
నెలలుగా సంవత్సరాలు దుఃఖించి, అంతర్ధానమవడం ఎవరు నిర్ధారిస్తారు?
ఇప్పటికీ దుఃఖాన్ని ఖండఖండంగా కూల్చేసేవారెవరుంటారు
సమస్యల కాగితంవెనక సమాధానం చూడకపోవడం ఏ దృష్టిలోపంగా పరిక్షిస్తారు
వ్యక్తులు సమూహాల్లో
సమూహాలు వర్గాల్లో
వర్గాలు మళ్ళీ వొక వ్యక్తి వ్యక్తిత్వంలో దుఃఖించడం ఎవరు నిరూపిస్తారు?
లోకం నిండా దుఃఖం నదులుగా పారినపుడు
ప్రతి నదీ ఎదుటివ్యక్తి స్వాంతన సముద్రంలో కలిసి మళ్ళీ దుఃఖనదికోసం
తవ్వుకునేదెపుడు?
ఇప్పటికైనా దుఃఖాన్ని శుభ్రంచేసే వారికోసం వెతకాలి
నచ్చినట్టుగా దుఃఖించి కన్నీళ్లను అలంకరించుకునేవాళ్ళెక్కడుంటారో శోధించాలి
ముఖానికదో ఆభరణంగా గుర్తింపునివ్వాలి
దుఃఖించడమొక ప్రక్రియ కాదిపుడు అదొక పోగొట్టుకున్న జ్ఞాపకం
బుగ్గలు చల్లబడేంత దుఃఖం ఎవరికైనా వస్తోందా పొరపాటుగానైనా
వేళ్ళతో తుడవలేనంత పరధ్యానంగా దుఃఖించడం ఎవరికి సాధ్యమవుతోందిపుడు
ఎపుడైనా కల వచ్చిందా కనీసం దుఃఖిస్తున్నట్టు...
పిల్లాడిలా స్వేచ్ఛగా దుఃఖించండి మరి అమోఘమైన తృప్తినిస్తుంది
మనిషెప్పుడైతే మేఘంలా దగ్గిదగ్గి కన్నీళ్ళుపెట్టుకుంటాడో అపుడే
అసలైన దుఃఖితుడవుతాడు

విరామం

ఇంటి వరండామూలలో పరకపుల్లలు దాచిన
కాసిన్ని వర్షపు చినుకుల్లా... 
లేగదూడ, పొదుగునుంచి తాగాక గుక్కగుక్కకు మధ్యలో
జీవంపొందే పాలతడిలా...
చిన్నప్పటి కాగితాలలోంచి తీసి మళ్ళీదాచిన అమాయకపు
లేతగాలికి నవ్వే నెమలీకలా...
విరామం అన్వేషించేది కాదు రాత్రిని పొద్దుటి కంచంలో వొంపి
వేళ్లతో సుతారంగా నిమిరి మేల్కోల్పినట్టుగా ఉంటుందంతే...
అమితమైన హాయిలో ఆశ్రయించిన నవ్వుకి
నిశ్శబ్దానికి కుదిరిన ఒప్పందం తాలూకు విరామం గురించి,
పరిపూర్ణమైన స్వేచ్ఛతో తిరుగుతున్న సీతాకోకచిలుక
రెక్కలపై సేదతీరిన రంగులకున్న విరామం గురించి,
ఏ గట్టుమీదనో కూర్చుని వొంగివొంగి మరీ
పట్టుకోగలిగే తూనిగను అడగాలి
నగరం నడిబొడ్డుమీద ఎదురుపడి మరీ
పలకరించే మనిషిని అడగాలి
విరామం కలలోంచి తెంపుకోగలిగే ఆనందమవ్వాలి
అందుకే ఉన్నచోటునుంచి కాస్తంత జరిగి
ఊపిరి పీల్చుకోడానికి విరామం అడుగుతున్నాను

చిన్నవిషయాలు

చాలా చిన్న విషయాల్నే మాట్లాడుకుందాం
ఇక్కడే పరిసరాల చుట్టూ పరిభ్రమించే వాటినే పేర్చుకుంటూ
వరండాలోని నేలమీది తడిని కాస్త అద్ది చూడగలిగినపుడు కంటిలోని తడి తేలుతుంది
పిట్టగోడ అంచుల్లో వేలాడే మరకను తాకినపుడు గతకాలపు బాధొకటి రాలుతుంది
ఏమీ తోచనపుడు అలా వీధిలోకెళ్ళి నిలబడు బతుకు నడుస్తున్నట్టు నెమ్మదిగా తెలిసిపోతుంది
చుట్టూ వుండే అన్ని గడపలని పరిశీలించు అందరూ జీవితంలోకి వస్తూ పోతూ
ఎంత క్రమశిక్షణగా పనులు చేస్తుంటారని అనిపించకమానదు
నిన్ను నువ్వు వేరుశెనగలా ప్రీతిగా ఒలిచి చూడు
గడిచిన సమయం ఎంత దుఃఖపడి నీకు దూరమైందో చెబుతుంది
ఓ అరగంటో పావుగంటో దానికిచ్చేయి నిన్నెంత జాగ్రత్తగా, అపురూపంగా ప్రేమించిందో లేఖరాస్తుంది
చాలా చిన్న విషయాల్నే మాట్లాడుకుందాం
ఎక్కడో ప్రపంచానికి ఇంకోవైపున ఉత్పన్నమయ్యేవి కావవి
ఇన్నాళ్ళ తర్వాత నువ్వు స్వీకరించగలిగేది ఇంతకుమించి ఏముంటుంది
ఇంటిబయటి చెట్టుకింద తలొంచి నిలబడు ఉత్తేజం నీలోకి వేర్లనుంచి
ప్రసరించడం కనిపెట్టగలవు నువ్వు
ఆకాశం, మంటనార్పి నిద్రపోయేటపుడు మేడమీద దుప్పటిపరుచు చలచల్లని చీకటిలా పడుకుంటుంది
పక్కనే పడుకుని చుక్కల్ని లెక్కపెట్టు సరదా అనేది దీనికన్నా పెద్దదేమీ అవ్వలేదు
ఇంకొకరి నుంచి ఏమీ అడగకుండా ఇన్ని దొరికినపుడు జీవితం ప్రత్యేకమైనదేమీ కాదు
ఆలోచించినంత సులభంగానే కాగితంపై లిఖించబడుతుంది
నీపై నీ పరిశోధనకి అమూల్యమైన పెట్టుబడి జీవితమే
కష్టనష్టాల్లో జీవితాన్ని నడిపే గొప్పకార్మికుడివి నువ్వొక్కడివే
చాలా చిన్నవిషయమే కదూ మాట్లాడుకున్నామిపుడు

అతడు

అతడు నిషిద్ధ వస్తువవుతాడేమో
కొన్నాళ్ళకో లేదూ ఇంకొన్నేళ్ళకో లేదూ ఇంకో క్షణంలోనో
గోరువెచ్చటి నదొకటి అతనిదేహంపై అల్లుకుపోతేనో 
సమూహమేదీ అతని చుట్టూరా చేరనపుడో
అతనాలోచనల సముద్రమంతా గాజుముక్కలుగా పగిలినపుడో
విషాదాలను విడమర్చుకుంటూ నిషిద్ధ వస్తువవుతాడు
నడిరాత్రి ఏ ఖాళీనో పూరించడానికి ఉదయిస్తాడనుకుంటా చీకటి కాగితాలవెనక 
నునులేత చేతుల్తో గదంతా పరుచుకున్న పరికరాలు నింపుకుని
రేపటి కూడికలెన్నిటినో విత్తుతూపోతుంటాడు
నిన్నటివి ఇవాళ్టివి చచ్చిపోతున్నట్టుగా అతనికేంతెలుసు 
విత్తుతూపోవడమంటే పంచుతూ పోవడమనీ, లోపలితనమేదో దాచుకుంటూ పోవడమనొకటే తెలుసతనికి
హఠాత్తుగా ఏ అసందర్భ అసమయాల్లోనో నిషిద్ధమైపోతాడు
అతన్నెవరూ ఏమీ అనలేదు అసలతన్నెవరూ మాటగానైనా కదిలించి వుండరు
అతడికతడే నిషిద్ధ వస్తువుగా పునఃనిర్మితమైపోగలడు
అంతటి కఠినత్వం అతనిలోకెలా వెళ్ళిందనేది ఎప్పటికిదొరకని మరో నిషిద్ధ విషయమే...
అతడెప్పుడూ నిషిద్ధమనేదాన్ని తెలిసికొనివుండడు
నిర్యాణమో విధ్వంసమో జరిగిపోవాలనీ అనుకొని వుండివుండడు
తయారుచేయడమెలాగో తెలియక నడుస్తున్నట్టుగా వుందతడికి
లేకపోతే మళ్ళీ వెలుగురేఖలతో నిండే సమయానికి దేనికోసం వెతుకుతున్నట్టు
మట్టికోసమేనా ఇప్పుడు ఎప్పుడూ దొరకని ఆ మట్టికోసమేనా
మట్టిని చూసినవాడు మట్టిలో నడిచినవాడు మట్టిపైనే పడుకొన్నవాడు
అతడొక్కడే మట్టికి దొరికే మట్టిలాంటివాడయ్యుంటాడు
ఎవరికి అక్కరలేని మట్టిపై ఇంకో అతడికోసం వెంపర్లాడ్డం తప్ప ఏమీ ఉండదు
అందుకే అతడొక నిషిద్ధ వస్తువు అవగలిగాడు

వొక నేల వొక ఆకాశమై

పదేపదే వరండా దాటొస్తున్నట్టుగా చూపు స్థిరంగా ఉండడంలేదెందుకో
1
నదిలోంచి సముద్రంలోకి నిన్ను నన్నుగా ముంచి ఒంపుతున్నట్టుగానో
చెట్లనుంచి మొక్కలకు నాలోంచి నీకొక శ్వాసను అందజేసినట్టుగానో
ఎపుడైనా ఏం కోరుకుంటాం కావాల్సినపుడు
పూలరెక్కలపై చేయి చేయి కలిపి కొమ్మకు వేళ్ళాడ్డమేగా
ఏదైనా వున్నదనుకుంటే పెదాలడ్డులేకుండా పంచుకోవడమేగా...!
2
మాటలేమీ లేకుండా సెలయేరై నేనోక వెల్లువ
గువ్వ తాకిన ఆకునుదుటిపై నువ్వో రాలిపడే సిగ్గుతుంపర
కొండ చివరల్లో చేయి చాచి లాలిగా తాకెళ్ళే మేఘాల అలజడికి
మేఘాల అంచుల్లో లీలగా కదిలించి వెళ్ళే పక్షిరెక్కల దిగులుకి
కావాల్సినన్నిసార్లు నేనెన్నో చెప్పుకునుంటాను వాటికి...!
3
ఇప్పుడే రంగులద్దిన రాత్రి వీధిలా మన గదుంటుందనీ
ఎప్పట్లాగే ఓరగా తెరుచుంచిన నీ కంటిరెప్పలా తలుపుంటుందనీ
వొక మాటగానో వొక పలరింపుగానో లేదూ మరొక స్పర్శగానో
గడిచిపోయిందనే సంగతి ఉదయాల్లో నురగలై పగిలిపోయుంటుందనీ...!
4
ఒకేవొక్కటి పదే పదే తెలీకుండా జీవితపు అంచుచివరల్లో ఆగింది
దండెమీది నా తువ్వాలుకున్న నీ బొట్టుబిళ్ళ నవ్వునడిగే భాషేదనీ?
నేనో సమాధానమై నువ్వో ప్రవాహమై వాగుల్లో జారిపడే కెరటాలమవుదామంటావెందుకో..?
5
ఇద్దరి బుగ్గల శబ్దాల్లోంచి పసితనపు ప్రపంచమొకటి జారిపడి
నువ్వూ నేనూ మిగిలిపోతాం వొక నేల వొక ఆకాశమై !!
నువ్వో మాటైనా చెప్పవు 
అసలు మాటనేదేదీ నీ దగ్గరుండదు శబ్దంగానైనా
దారంవుండనుంచి పూలకిచ్చిన అమ్మతనం నీ చీకటిరాత్రుల గీతలు
ఇప్పటిదాకా నీ నవ్వనేది ఎలా వుంటుంది అనుకుంటూ నీ చిత్రాల చివరాగిన రేఖనడిగాను
మాకిచ్చిన రెండురంగుల్లోనే పరావర్తనమైందనీ
మమ్మల్ని చెరిగిన కాగితమ్మీదే తేలుతోందనీ
నువ్వే నీలోపలి రంగై మునిగిచూసుకోమని నా రెప్పచివర్లో చిక్కుపడింది
అసలేందుకు 'దీదీ' మనది రెండు జీవితాలని అడుగుతాను నిన్ను
'యే జిందగీ ఉడ్‌నేవాలా పతంగ్ హై భాయ్‌జాన్' అంటావు
నాకెప్పుడు అర్థమైందనీ ఈ మాటేంటో తెలిసిపోవడానికి
నాకుతెలుసు నువ్వు నా 'పతంగ్‌'కి వున్న దారమని
నీ చిత్రం కనపడకుంటే ఖాళీ కాగితమ్మీద పాతచిత్రమే గీసుకుంటూ ఖాళీ అవుతాన్నేను
ఏ రాత్రి అరుగుమీదో ఉలిక్కిపడి లేస్తానా
'మై తేరే పాస్ హు భాయ్' అని ఒంటరిగుడిసే తలమీదున్న వెన్నలై నవ్వుతావు కదూ !

గొంతున్నవాడు

గొంతు స్వేచ్చగా బద్దలవుతున్నపుడో
గోడపెచ్చులమీద సిరా ఎర్రనికణాలై జారుతున్నపుడో
కాగితాలన్ని కెరటాలైయ్యాక నురగలన్నిటిని పోగుచేసి విసిరికొట్టాలిపుడు
ధిక్కారమనే కొత్త వర్గమేర్పడి
అదొక నూతన విధ్వంసకర పరిణామమై బయల్దేరుతుంటే
దారెంబడి గడ్డిపోచకు తగులుకొని నురగలన్ని కోతకు గురై
ఒక్కో గొంతుగా రూపాంతరమవగలదు
ఎవరివంతు ఏ మూలమలుపులోనో జారగిలబడి కలంగొంతుక తెరుచుకొనుంటుందో
ఏ గొంతుక ఎంతటి ఉద్వేగాన్ని, ఉద్వాసనని కోరుకుంటుందోనని
సముద్రమంత సిరానొంపుకుని సిద్ధంగా సైనికులవుతారంతా
ప్రతిగదికి ఏదొకచోట చూరున్నట్టే దేశ గదిగదికొక తెరుచుకున్న గొంతుంటుంది
గొంతొకటే ఇపుడున్న అతిపెద్ద ఆస్తి అవగలుగుతుంది
గొంతునుంచి ప్రయాణించగలిగినవాడు మరో కొత్తగొంతుకై అరవగలడు
ఎంతటి బలమైన యంత్రంలో వేసినా బద్దలు కానిదే గొంతవుతుందనుకుంటా
ఏ సామ్రాజ్యక్షితిజంపైనైనా ఎగరగలిగే పతాకం గొంతొకటేననుకుంటా
గొంతున్నపుడు మనిషవుతాడెవడైనా
మనిషనేవాడెవడైనా గొంతునుంచే ఉద్భవించగలుగుతాడు
గొంతున్నవాడెవడైనా రెక్కలున్న పక్షవుతాడు
పక్షికున్న స్వేచ్చవుతాడు స్వెచ్చతాలూకూ చిరునామా అవుతాడనిపిస్తుంది
అక్కడొకచోట మాత్రమే గొంతుందని చెప్పలేమెవరైనా
చెట్టుచెట్టుకు పుట్టపుట్టకు గుట్టల్లా విస్తరించే వుంటాయి గొంతులన్ని
సంధర్భమో, సంఘటనో మనిషిని చంపేయాలనుకున్నపుడు
గొంతు స్వేచ్చగా బద్దలవుతుందనుకుంటా..!

లోపలలమారు

ఒంటరితనంలో ఏకాంతం మరణించిన సంగతి తెలియకపోవచ్చు
ఆలోచనలపుడు సైనికులై పహారా కాస్తాయనుకుంటా !
చూడ్డం చూడ్డంవరకే ఆగిపోయినపుడో
వెళ్ళడానికింకేమీ అనిపించనపుడో
అప్పటి ఆ క్షణంలో నువ్వో హంతకుడివయితే
నీ వైపునుంచి అదో నిస్సహాయతనుకో ఇంకా
నువ్వనుకున్నది అదొక సాధారణమైనదే కావచ్చునేమో
చుట్టూ వొకసారి ప్రవహించగలిగినపుడు
నడుస్తున్న వ్యక్తి అడుగుల గుర్తులు జారిపోయిన
జీవితంలోని కొన్ని క్షణాల్లో
వీధిచివర కాలువపక్కన ఆకువొకటి అందులోకి
దూకి ఆత్మహత్యచేసుకోవడం
చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్న చినుకొకటి సుతారంగా
నేలపై అడుగేయడం
ఉదయపుటెండను దుప్పటిలా కప్పుకున్న జంతువొకటి
ఇంకా, వలసవెళ్ళినట్టుగా ఇంకో జంతువొకటి తలొంచుకొని పయనమవడం
వీటన్నిటి మధ్యగా,
ఇపుడొక మార్పును పొదువుకోగలనా
మరిన్నిలాంటివి ఏమైనా వున్నాయనుకున్నపుడు
నీలాంటి తోడొకటి నాకుండుంటే లోపలలమారు నింపుకోవడం
సులభమవచ్చుననీ...!!

ఆమె ఎందుకు వెళ్ళిపోయింది …

ఆమెనొకసారి మళ్ళీ ఒంపుకున్నపుడు
ప్రవహించడం నావంతుగా జరుగుతూంటుందెపుడూ
1
నిర్లిప్తంగా ఒదిగిపోయే జ్ఞాపకం కదామె !
2
వచ్చినా వెళ్ళినా భావోద్వేగాల కెరటమొకటి 
మేఘాలదాకా పరుచుకున్నట్టుగానో
ఊపిరాగిన క్షణమొకటి హఠాత్తుగా ఉబుకినట్టుగానో
దేహానికి పచ్చితిత్తొకటి బిగించినట్టుగానో
3
లోపలివైపెక్కడో ఖాళీరహదారిమీద దిగులొకటి కనపడుతూ వుంటుందెందుకో…
4
దుఃఖాల్లోకి నవ్వులు ప్రసరించినంత ధీర్ఘంగా వచ్చినపుడు
మాటల్లోని భావం ప్రయాణించినంత సుధీర్ఘంగా వచ్చినపుడు
కలిసి నడిచిన సమయాన్నంతా సునిశితంగా దాచుకోలేదెందుకనో..
పగలుగానో..రాత్రిగానో..ఋతువులాగానో 
నిష్క్రమణ జరిగిపోతుంది
5
ఆమె ఎందుకు వెళ్ళిపోయింది
దృశ్యం మీదనుంచి దృశ్యం మీదకు చూపు వెళ్ళిపోయినంత సునాయాసంగా
నిన్నటిలోంచి ఇవాళ్టిలోకి వచ్చినంత సులభంగా వెళ్ళిపోయింది
ఆమె ఎందుకు వెళ్ళిపోయిందనేదే పరమావధి 
6
వెళ్ళిపోవడం ఒక శూన్యం 
శూన్యంలోంచి శూన్యంలోకి వెళ్ళిన చప్పుడు ఆమెది...



(Published in 'Saaranga Weekly Magazine' on 15-10-2015)
పాత జ్ఞాపకాన్నొకదాన్ని తోడుకున్నపుడు
ఎక్కడో లోపలివైపు నల్లగా బరువెక్కిన మేఘమొకటి
భళ్ళున పగిలి నువ్వు నేను కురుస్తామనిగానీ
వొకరి కళ్ళలో వొకరం ఎప్పుడో చచ్చిపోయామని ఇపుడు మళ్ళీ
ఎదురుపడి గుర్తుపట్టాలి అపరిచితంగానే...
కన్నీళ్ళతో తడిసిన పెదవొకటి మాట్లాడితేనో
నవ్వుతో నిండిన గుండె పలకరించేంత దూరంలోనుంటేనో
రాత్రిలా పొదువుకున్న కౌగిలొకటి చేరువైనపుడో
మొత్తంగా నాలాంటొక ప్రేమ నీలాగా ఎదురుపడితేనో
ఎన్నిసార్లైనా చచ్చిపోవడానికి నీ కళ్ళు కావాలనిపిస్తాయెందుకో...
వెళ్ళిపోయిన శ్వాసలా చరిత్ర మిగిలిపోయినపుడు
నువ్వునేను మళ్ళీ వొకసారి మాటల్ని ఒంపేసుకుంటే ఎంతబాగుండునో..

స్పర్శ

నులివెచ్చగా వొరిగినదేదో ద్యోతకమవ్వాలి
1
లోతుల్లో గొంతుకంచుల్లో మాటకు చివరాగిన గాలిలాగానో
కవాటాల్లో తప్పిపోయిన శ్వాస కదలికలాగానో
చీకటిలోంచి చీకటిని అద్దినట్టు
అలలాంటి పలకరింపు తెలియాల్సి వుంటుంది
చూస్తూ వుండగానో ఇంకొకర్ని పరిశీలిస్తుండగానో
మరోవిధంగానో అన్నీ వృధానే
లీలగా అవగతమవుతుంది స్పర్శనే భావుక !
2
ఏ వేలికొననుండి జారినా
ఏ రెక్కనోఁ మబ్బుల్ని తోసినా
ఏ కెరటమొచ్చి ఏ తీరాన్ని తాకి నవ్వుతుందో
ఆ నవ్వుకు చూపుకు ఎక్కడ స్పర్శ మొలకెత్తిందో వెతుకులాట మొదలవ్వాలి
స్పర్శనగానే స్పర్శగానే తెలుసు
లేతగా తాకడమనే అనుభూతికి అద్దమవ్వడమనీ
తెలుసుకోగలిగినపుడు
ఆలోచననుంచి వూడిపడిన మాటే స్పర్శ కదా !
3
మాటలెపుడు కలుసుకున్నా
రెండు అక్షరాలకు మధ్య స్పర్శనేది రాలిపడుతుంది
అపరిచిత మనుషులెపుడు ఎదురైనా
పరిశీలనమనే స్పర్శ ఎదురుపడకతప్పదు
కావాలనుకునే అన్నిట్లోనూ ఆతురతల స్పర్శలు వురుకుతాయి
4
స్పర్శల్లో వెళ్ళిరాగలిగినపుడు
ఈ మాట స్పురించగలుగుతుందా
కొత్తగా ఇంకొక స్పర్శ అవసరముంటుందనీ !!

రెండు సంతకాలు

కంటిరెప్పలై మేఘాల్లాంటి వాటిని తోసేసి
తారాచూపుల్తో నువ్వూ
శూన్య హృదయంతో దిగులునిశీధి మొఖాన్నేసుకుని నేనూ
నిశ్శబ్దావరణ
విరహగొంతుకలతో
సూర్యకిరణమై నాదొక పిలుపు
వెన్నెలజలతారై నీదొక పలుకు అంతులేకుండా...
యాక్...ఇది వొక్కవితేనా !
ఏంబాగాలేదని నువ్వంటావుగా అందుకనే ఈసారి...
తెల్లకాగితంపై రెండుసంతకాలమౌదాం
వొకటి నువ్వనే సంతకం రెండు నేననే నీలాంటి దస్తూరిగా...
సెలయేటికింద రెండురాళ్ళై నదిలో కరిగిపోదాం
ప్రవహించే నీటిని సాగనంపుతూ దేవతవై నీవోవైపుగా
ప్రవాహాన్ని మోస్తూ శ్రామికుడినై నేనోవైపుగా
కొన్ని దూరాలనేవి దగ్గరిలోని అవాస్తవజీవనలే.....
దారికి చెరోవైపు విభిన్న ధృవాల్లా సంకేతాలమైపోదాం
రాత్రుళ్ళు చెట్టుకింద చీకట్లై సేదతీరుదాం
వూహూ....ఇది కూడా కవితకాదా...!!
మరింకేఁపదా...!
ఇద్దరి గదిమధ్య గోడను తొలగించేస్తే
ఒకతలుపై తెరుచుకుంటాను విశాలమై
నువ్వొక వలపై కప్పేద్దువూ దుప్పటిలా....

అతనిదొక ప్రపంచం

వెతుకుతూ వెతుకుతూ తిరుగుతున్న అతనికి
కొన్ని నిరాశలు మూటగా చెత్తకుప్పల్లో 
చనిపోవడం చూశాడు
ఇంకాస్త దూరం వెతికాక నమ్మకాలు చెట్టుకు ఉరేసుకొనుండటం చూసి
అతని దేహం మీద అతనికే పట్టు సడలిపోయి
రక్తపు తాళ్ళు పాకుతున్నట్టుగానో
గొలుసులన్నీ అతన్ని బంధించినట్టుగానో
ఏదో కాల్చేస్తున్నట్టు ముఖమంతా జేవురించిపోతోంది
ముక్కలు ముక్కలైన ఆర్తనాదాలు అక్కడక్కడా అరుస్తున్నాయి
ప్రతి మనిషి ఇంకో మనిషిని చంపేయడం
మళ్ళీ అదేమనిషి ఇంకోచోట పుట్టెస్తుండడాన్ని గమనిస్తున్నాడు
అక్కడంతా ఎవరికివారుగా చంపుకోవడాలే వుంటాయి
అక్కడంతా ఇంకో మనిషిని పుట్టించడాలే జరుగుతుంటాయి
ఇన్నన్నిటిని చూసి అతనికాశ్చర్యమేసింది
అతన్నెవరూ చంపడంలేదు
అందరి దగ్గరికెళ్ళి నుంచుంటాడు తాకుతుంటాడు
అందరూ నుసిలాగా తేలిపోతారు
అతనిలాంటి ఇంకొకరెవరో వచ్చి చంపేవరకు ఎదురుచూడ్డమే చేయాలని
అలా కాలం మంటల్లో బూడిదవుతుంటే
ఏదో అతనిమీదకొచ్చినట్టు భ్రమపడి పొదల్లోకెళ్ళిపోగానే
అప్పుడ హఠాత్తుగా మేఘం మీదపడ్డట్టు మసకతనం పడుతుంది
నిద్రనుంచి లేచి ఇందరి మధ్య అతనో జంతువుగా రూఢి చేసుకుని
అడవిలాంటి జీవితంలోకి కలలాగే ప్రవేశిస్తాడు
ఇదంతా అతనిదొక ప్రపంచం
ఆ ప్రపంచమంతా ప్రత్యేక ప్రజాస్వామ్యం

గుమ్మంతో

నుంచొని నుంచొని గుమ్మానికి కాళ్ళు నొప్పెట్టవేమో
బోల్డన్నిసార్లు చేతుల్ని ఊపుతూనో
అందర్నీ లోపలికి బయటికి సాగనంపుతూనో
దానికి నాకూ అస్సలు తీరిక దొరకదెందుకో మాట్లాడుకోడానికి
నేనేప్పుడు ఏమీ చెప్పలేదు
అదికూడా నాకేమీ చెప్పదు కాస్తయినా
ఇద్దరికీ మధ్య రహస్యాలేమీ లేవు కానీ,
దూరమైపోతుంటాం కొంతసేపు
ఒకరిలోకి ఇంకొకరం ఎగాదిగా చూసుకుని బయటికొచ్చేస్తూ
ఎవరికివాళ్ళం హద్దుల్లేకుండా ప్రేమించేసుకుంటూ
రూపంలో ఏదైనా మార్పుకోసం చూడకూడదనీ తీర్మానిస్తాం
గంటలకు రోజులకు చోటివ్వం
మాటలుకూడా వద్దనిపిస్తుంటాయి సాయంత్రాలు మునిగిపోతున్నపుడు
వ్యక్తికరణలేవీ వెలుపలికి కనపడనీయకుండానే
అర్థమైపోతూ గడిపేస్తుంటాంగా
అందుకనేననుకుంటా ఇద్దరమూ ఓ నిశ్చల జీవులమై
తలపులు తలుపులు
ఒకరికొకరం మార్చుకుంటూ
ఆరోజుకి నిద్దురపోతాం కావాల్సినన్నిసార్లు తిరుగుతూ

ఇద్దరమాయకులు

వస్తూవుండడం వెళ్తూండడమూ సహజమే
హడావిడిగా సాగుతుంది సమయమంతా
ఒకలాంటి ధీర్ఘ నిట్టూర్పుని వదిలెల్తూ
ఆమె వంక చూసినపుడో
లేదూ ఆమెకే వెళ్తున్నట్టు స్పురణకొచ్చినపుడో
చెరోఁవైపు నుంచి కాసిన్ని దిగుళ్ళను పంచుకోవాల్సివుంటుంది
దూరం కాలంకింద 
నలిగి బూడిదైనపుడన్నా కావచ్చు
సమయం వేగాన్ని దాటుకుని నిలబడ్డపుడన్నా కావచ్చు
కళ్ళ వెనక్కెళ్ళి తదేకంగా చూసుకుని
ఒంటరితనాలను స్వేచ్ఛగా చంపేసుకుని
నలుపు తెలుపుల మధ్య గడియారం ఊగిసలాడుతోందనీ తెలిసీ
మళ్ళీ ఆ వైపుకు తిరిగి ఎదురుగా నిలబడతాను
ఆమె నుదుటిపై వెన్నెలతో ఈ రాత్రి వెలుగుతోందని 
ఆ పట్టీల చప్పుడులో పగలు హాయిగా నిద్రపోతోందనీ
ఇద్దరి ఒకేవొక మైదానంలాంటి దేహంలోని మౌనానికి తెలుసు
ఆమెకూ తెలీదు నాక్కూడా తెలీదు

మాటలెప్పుడు

ఇద్దరి మీద నుంచి 
మాట తప్పుకుపోయిందని తెలియఖ్ఖరలేదు
ప్రయత్నించనూ వద్దూ!
దిక్కుతోచని శరీరాలు ఎదురుబడితే 
మాటలొక్కటేనా?
మాటల్లేని మాటల్లాంటివాటిని 
కొన్నైనా భర్తీ చేసుకోవాలిగా బ్రతుకు తూకానికి 
ఏరు పారుతుంటే బుడగలు రాయిని తాకి బద్దలయినట్టు
ఎండిన ఆకు గాలిలో ఎగురుతున్నట్టే చచ్చినట్టు
ఇద్దరి దూరం దగ్గరతో ఉబుసుపోక కబుర్లాడుతున్నట్టు
మాటలంటే శబ్దంగా ఎగసిపడ్డమే కాదు 
అడుగుల్లోంచి మాటలు
కదలికల్లోంచి మాటలు
స్పర్శల్లోంచి మాటలు
ఇద్దరి చూపుల యుద్ధంలోంచి రాలిపడుతున్నవి మాటలే...
రెండు స్పర్శలు ఏవైనా 
పొడిపొడిగానే తెలుస్తుంటాయి
రెండు అడుగులెప్పుడు ఒకే కదలికలోంచి ప్రయాణిస్తాయి
చెట్టువో కొమ్మని పైపైకి ఎదగనివ్వడం
ఆకాశం మేఘాలన్నిటిని ఒద్దికగా నడిపించడం
గాలులు పరిమళాల్ని మూలమూలకు విసురుగా జల్లేయడం
అలకు అలకు మధ్య సముద్రం సేదతీరడం
ఇన్ని ఇన్ని మాటల్లేకుండానే వ్యవహరించబడుతుంటాయి...
మాటలెప్పుడు మౌనంగా వున్నట్టే బాగుంటాయి
మాటలెప్పుడు మౌనంగా మాట్లాడినట్లే అనిపించాలి
మాటల్లోకి మాటలు ఒరుసుకుని ఇంకో మాటేదో పుట్టినపుడే మాటలు తేలికవుతాయి

ఇద్దరము



నేను తనవైపు వొరిగి చూస్తున్న ప్రతిసారీ
పువ్వులా మెలిపడి వుంటుందలాగే చినుకుల్లోంచి నవ్వేస్తూ,
కొమ్మలపైనుంచి ఓ మేఘంలా తీరైన ఒద్దికతో
నాలోకి వచ్చేస్తుంది
ఒక్కోసారి నేనో సముద్రం
తను ఓ నది
నీటి తరగలతొ చెట్టాపట్టాలేసుకుని
నిశ్శబ్ద ప్రపంచంలోకి ప్రస్థానం మొదలుపెడతాం
వెన్నెల వొకటి అలిగి తెల్లని ఉదయాల్లో
వెచ్చని దుప్పటి కప్పుకున్నాక మామూలుగా అయిపోతామెందుకో..?
ఇంకేదీ కావాలనిపించదు తననుంచి ఒక ప్రవాహమంతే...
ఒక్కోసారి దీపాన్ని వెతుక్కునే
నేనో తైలం తనోఁ వొత్తిలాగా మిళితమై
ప్రసరించబడుతుంటాం భువనానికి వెలుగునద్దుతూ
ఇంకేమీ అడగదు నానుంచి ఓ భరోసా అంతే...
ఇద్దరికి దొరకనిదేదైనా మిగిలిపోతే
అదిప్పటి జీవితమైనపుడు ఆగిపోకూడదనుకుంటాం ఎప్పటికీ
సంతృప్తి తెరలుతెరలుగా 
వచ్చివెళ్తున్నపుడు
గతానికి...
ఏదోక శ్వాస ఆగినపుడు,
ఒకే ప్రపంచాల్లాంటివి రెండూ కూలిపోయే స్థలం కావాల్సొస్తుంది...

వాడినొక్కణ్ణే

ఒకడొక చోటునుంచి కదుల్తుండగానో
గుంపులోంచి అరమరికల్లేకుండా తొలగిపోతుండగానో
పరికరాలేవి లేకుండా
ఒట్టి చేతులతోనో పట్టెడంత అక్షరాలతోనో
చూడగలిగినపుడు సంతృప్తి రేఖ వెలుగుతుంది...
ఉత్తిగానైనా,
కాగితాన్నో పుస్తకాన్నో తెరచి చూడగలగేయాలి...

రహదారులమీద క్షణాల్ని, గంటల్ని
సాంద్రమైన పుప్పొడిలా రాల్చేసిపోతుంటాడు
గుర్తులేవి మిగలవు మనలాంటి కొన్ని ఖాళీ దేహాలుంటాయంతే
ఏ సంఘటనలు జరగనపుడు
ఏదోక సంధర్భం విరుచుకుపడ్డపుడు
అతడికతడే ధూళికణాలుగా విచ్ఛిన్నమైపోగలడు
ప్రతిమనిషిలాగా తయారైపోవడం నేర్చుకున్నాడనిపిస్తుంది
మనిషంటే మనిషే
మట్టిలాంటి మనిషే
పొడిపొడిగా రాలిపోయే విడివిడిగా జారిపోయే
వున్నచోటే, ఒక్కచొటే ఉమ్మడిగా కదుల్తుండే
ద్రవ్యరాశిలాంటి మనిషే...!

ఒక్కోకర్ని స్పృశిస్తూ
ప్రయాణించగలిగాడంటే
వాడిలోన ఎన్నివేల అడుగులు పడుంటాయో
ఎన్నెన్ని రకాల ఊర్లు వాడిలోపల్లోపల శిథిలాలయుంటాయో
వాడిలోంచొక సంఘమో,
వొక వ్యవస్థో లేదొక ప్రపంచమో రాకముందే
ఏదైనా కొత్తరకపు వలవేసి పట్టేయండిపుడు
ఎవడిలాగా బ్రతకనపుడు
వాడినలా వదిలేస్తే ఇంకోకర్ని పూడ్చేసి
వాడిలాంటోణ్ణి తవ్వుకోగలడు జాగ్రత్త...!
కనీసం వాన్నొక అద్దంలోనైనా దాచేయాల్సిందే...!!

సాధారణమైనదొక

కాగితాల కొద్దీ నింపుకునే సంగతులెందుకు !
వేలి కొసన జారిపడే
నీటిబొట్టు అరిచే అరుపు సంగతో
మెలకువల్లో ఊపిరాడక మరణించే
కలల చివరిలేఖ సంగతో
ఇంటి వసారాలో సేద తీరిన వర్షం సంగతో
చెప్పుకోడానికి ఎన్ని కాగితాలని పోగేస్తావ్
పోగేసి పోగేసి సేనానివవ్వగలుగుతావు
చెప్పుకుని చెప్పుకుని మనిషివి అవగలుగుతావు
ఏం చేసినా
ఇంకో మనిషిని పోగేసుకోవాలని
ఇంకో మనిషితో చెప్పుకోవాలనేది
ఆఖరి శాసనంగా మిగిపోతేనే
సంగతులన్నిటిని అక్కడక్కడా దాచేసుకుంటావ్
గడిచిన కొన్నాళ్ళకు
జీవితం నీముందుకొచ్చి సాగిలపడుతుంది
అప్రయత్నంగా చూసి
స్పృశించడమొక్కటే మిగిలుంటుంది
అలసిపోయి బీడువారిన శరీరమిక్కడే
లేవలేని నిస్సహాయ క్షణంలో
కన్నీళ్లలో కొట్టుకుపోయాక ఒక మాట
జారిపోతుంది నీనుంచి
ఎన్ని చెప్పుకున్నా ఎన్నిటిని పోగేసినా
మనిషి మనలోకి వచ్చిన
సాధారణమైనదొక సంగతి మర్చిపోకూడదనీ !!

విస్ఫోటనం తర్వాత

ఒక విస్ఫోటనం తర్వాత
నిశ్శబ్దం పెకలించబడుతుందని గుర్తెరగాలి
ఎప్పుడైనా నీలోకి నీవే బద్దలయినపుడు
ఒక సంధర్భం వెతుక్కుని
అందులోకి ఒరిగి తడిమే బలం తెచ్చుకోగలిగినపుడు
విషాదాలు ఆవిష్కరించబడతాయి
విషాదమంటే
కొలిమిలో కాగుతున్న ఇనుపుముక్కలా
చుట్టుముట్టిన శతృవులను నిశితంగా చూడ్డంలాంటిది

దేహంలేని రెక్కల్లా టపటపమని
సముద్రంలేని అలలా గిలగిలమని
విలవిల్లాడిపో వికృతమైపో
అదే విషాదమని నీకు స్పష్టమైపోవాలి
ఎక్కడినుంచో
ఆకాశం నిన్నెతుక్కుంటూ రావాలని,
భూమి నీ చుట్టూ
కూడా నృత్యం చేయాలని,
ప్రపంచం మొత్తం పూలుగా నీపై కుప్పకూలిపోవాలనీ...
ఇలాంటిలాంటనూహ్యమైనవన్ని
నీక్కాకుండా నీ
విషాదంలోకే ప్రవేశించబడతాయప్పుడు

దొరకనిదేంటంటే
విషాదమంటే రెండు పగళ్ళ మధ్య కుట్టేసిన రాత్రిలా
నిశ్శబ్దంగా ఉండడం...

చూపు

అలా చూస్తూ కూర్చోడమనేది
నీనుంచే ప్రసరించిన సెలయేరు లాంటి ప్రవాహం
కెరటమై నవ్వేస్తావు కానీ
ఏటిఒడ్డున గట్టులా కాళ్ళు చాపుకునుంటా
ఎన్ని మాట్లాడామో
ఎంత మాట్లాడుకున్నామో
ఇంకా మిగిలేవుంటుంది ఇద్దరిమధ్య
ఆకాశమెంతున్నా మేఘాలవెనక హరివిల్లున్నట్టుగా...
నువ్వెళ్తున్నపుడు
నీ చూపు నాపై యుద్ధం ప్రకటిస్తుంది
అలా చూస్తుంటావేంటసలు..!
నవ్వుల్తో తడిపేస్తూ
మౌనంతో స్పర్శించేస్తూ
ముసిముసిగా రంగొకటి పూసేసి
తూనిగ కాళ్ళతో కదిలించి వెళ్తుంటావేంటని నిలదీసేస్తుంది...!!
గాలులకూగే కొమ్మలు
పక్షుల కేరింతలు
నేలపైనీ పసరికల కబుర్లూ
అన్ని ఆగిపోయి ఒక చాయాచిత్రంపై అందరం బంధీలమైపోతుంటాం...
అటుఇటు ఏమీలేనట్టు
నువ్వో పువ్వై కదిలొస్తున్నట్టు
నేనో దారాన్నై నిన్నల్లుకుపోదామనీ
నాలోకి నేనే ఉండలుగా చుట్టబడుతుంటాను
క్రమశిక్షణగా...

తప్పిపోవడం

తప్పిపోవడమంటే
వెనక్కెళ్ళి చరిత్రలో ఏదోకమూల జారిపోవడమనేమో
ఒక నిర్లిప్తతను దాచేసి
ఆశనో, ఆశయాన్నో మోసుకురావడమనీ...
ముందువైపుకు తిరిగాక చేయి వెనక్కిచాచి
ఇంకో చెయ్యేదో పట్టుకోవడంలాంటిదని.
వూరికే ఉండడంకంటే ఇలా తప్పిపోవడం
సీతాకోకచిలుక మరచి మళ్ళీ గొంగళిపురుగైపోవడంలాగా..
ఏదైనా దొరకచ్చు
జనాలందరూ ఒకేచోట గుమికూడడమో
ఉదయాలన్నీ పొయ్యిలోంచొచ్చే పొగతో నిండిపోవడమో
సాయంత్రాలు గలగలమని చప్పుళ్ళలో చావడమో
చీకట్లు కిలకిల నవ్వుల్లో వెలిగిపోవడమో
మట్టి తప్ప మరేదీలేని మౌనమే దొరకచ్చునేమో!!
వృధాగా పడుండటం దేనికి,
అమానుషంగా
అమానవీయంగా ఇక్కడే నిలబడితే
ఏదోవొకటైపోయి
నశించిపోవటం జరిగిపోవచ్చు...
తప్పించుకు పోవడం స్థాయినుంచి
తపించిపోయే దిశకు మళ్ళీ మరలిపోదామనుందిపుడు
నిశ్శబ్దంలో నిర్దాక్షిణ్యంగా,
నిరాధారంగా మరణించడంకన్నా
శబ్దంలో బద్దలుకావడమనేది మరొక జననమవుతుంది
అందుకే తప్పిపోవడం
అత్యంతావశ్యకమూ,
అనివార్యమూ అవ్వాలిలాంటపుడు...!

ఖాళీతనం

నడుస్తూ నడుస్తూ ఆగిపోయినపుడు
పాదానికి పాదానికి మధ్య 
ఖాళీతనం దాగుంటుందనీ
వీధిదీపాల వెలుతుర్లో
కాంతికిరణాల మధ్య 
నిశీధిలాంటిదేదో వెతకాలేమో..!

మాటలన్ని 
క్రమక్రమముగా 
నిలబడ్డాక అక్షరాలవొత్తుల మధ్య 
ఖాళీతనం పెగులుతుందపుడు
దృశ్యాల సంభాషణల్లో 
వీక్షణమొకటి 
నలగబడి, 
నిశ్శబ్దాల లోపలివైపు
ఎడంగావున్న తలంపులలో 
ఖాళీతనం చుట్టుముట్టి 
నన్నాక్రమిస్తున్నపుడు
అప్పటికొక 
కలనై రాత్రికి వేల్లాడతాను

ఖాళీతనమనేది 
తెచ్చిపెట్టుకోగలిగినంతగా 
కావాల్సొస్తుంది
శ్వాసకి మరణానికి 
మధ్యనున్నపుడు 
వీలవుతుందనిపించదేమో కదా..!

మూర్ఖత్వం

సాయంత్రాల మీదనుంచి జారిపడిన
రాత్రుళ్లు నల్లని దుప్పటితో
కప్పేస్తుంటే
వెతుక్కోటానికి స్పర్శలే మిగులుతాయప్పుడు
నీకు నాకు గుడ్డితనముంటే బాగుండుననిపిస్తుందెందుకో
చెట్టాపట్టలేసుకుని
సిగ్గుల్ని కనురెప్పల కిందకు తోసేసి
స్వేచ్చగా ముద్దాడటానికి...
జీవించడానికి
మాంసపుముద్దలు బరువవుతాయి
దేహమంటూ వొకటి లేకుండా
నిర్జీవంగానో
నిరాకారంగానో మిగిలిపోదాం పదా !
చీకటిలా దాక్కోవడమో
శూన్యంలా మాయమవడమో సాధన చేద్దాం !
ఇలాంటి ప్రయాణాలు బలంగా,
రాత్రి ఆకాశమ్మీద నక్షత్రాల్లాగా వెలుగుతూనే వుంటాయి
ఉదయాలు నిద్రలేచాకా
జ్ఞాపకాల్లాగా మెరుస్తుంటాయని భ్రమించాలంతే...
ఎప్పుడోవొకప్పుడు
ఏదోవొకచోట
ప్రతి అడుగు, గుర్తుగా మన వెనకే మిగిలిపోయినపుడు
మసకతనం ప్రవహిస్తుంది
అపుడు నువ్వు నేను
అనుకుంటూనే వుంటాం ఇంకొన్ని అడుగులు వేయాలేమో అని.....
గుర్తుచేసుకోవడమంటే
మేఘాల మధ్య నుంచి ఆకాశాన్ని చూసినట్టుగా...
నిజమా..? అబద్దమా..?
ఇవాళ్టిలోనే వున్నానా లేక నిన్నల్లోనా...!!
ఇప్పుడనిపిస్తుంది మూర్ఖంగా...

వింత ప్రకటన

ఎవరూ లేరని
గతాన్ని తవ్వుకుంటున్నపుడు
హత్యచేయబడ్డ నా శవం
ఇప్పటికి మీ మధ్యే ఉండడమంటే
ఆ శవాన్ని ఇంకోసారి నేనే హత్యచేయాలనేమో..!
ఏదో ఒక అద్భుతం జరిగిపోయి
చినుకులన్ని శూలాలై ఈ శవాన్ని చీల్చిపడేయనీ
కాలాలు కత్తులై బూడిదైనా చేసేయ్యాలి
కుళ్ళి కంపు కొడుతున్నపుడు
మీ మధ్యలో పడేయడమొక్కటే అంతిమంగా,
నిరసనగా శవాన్ని
కాలితో తన్నండి
ఇంటి దూలంపై ముడుచుకున్న కత్తుల్తో
విచక్షణారహితంగా,
కౄరంగా,
గుర్తుపట్టలేనంతగా గీసేయ్యండి
దూరంగా, కనిపించనంత దూరంగా విసిరేయండి
నేనో గాఢ నిట్టూర్పుని ఇక్కడ శిలాఫలకంగా వదిలివెళ్తాను
వెళ్తూ వెళ్తూ నా కన్నీళ్లతో
నా అంత సముద్రాన్ని ఇస్తాను బయల్దేరండి
నెనో నాలాంటి ప్రేమో
నుజ్జు నుజ్జై నురగలుగా అవతలి తీరంవైపుకు కొట్టుకెళ్తే
మీరే గాలాలై పట్టుకోండి
మీకేమాత్రం అవకాశమున్నా
నన్నోదిలేయండి
నాలోకి నేను ముడుచుకొని
నేనొక ఆయుధమై
ఆత్మహత్యగా చిత్రికరించబడతాను
మనిషన్నవాడు మరణించాక
ఒక శవమై మీలోకి బద్దలుకావడమే...!
దారుణమైనదేదైనా వుందంటే
నేను శవమై
ప్రకటించడమొక్కటే...

పక్షిరెక్కల చప్పుడు

ఊగుతున్న ఊయలలో
అటు ఇటు నా శరీరం ఒక లోలకం
మట్టికి మేఘానికి
చాటు మాటు ప్రణయ లేఖలు చినుకులన్ని
మట్టిలోంచి నా దేహంలోకి
మోయలేని కన్నీళ్లన్నీ ఇంకిపోతుంటాయి...
సున్నితమైన వాటి గురించి చెప్పడమంటే
నాలాగా ఏడుస్తున్న
ఒకే ఒక ఆకాశంలాంటిదొకటుంటుందేమో
బాధలన్ని నీలంగా బరువయినవనీ
మేఘాలన్ని జ్ఞాపకాలుగా
పొడిపొడిగా రాలిపడటమనీ
కెరటాల ఉప్పెనకి
తీరమై స్పందించడమనీ
పక్షి రెక్కల చప్పుడుకి పసిపిల్లాడినై ఊగుతాను
నేనొక జ్ఞాపకం
నిశ్శబ్ద నిఘంటువునై
మరణం చేతిలో ప్రత్యర్థినవుతే
రాలిపడే చూపులన్నిటికి దృశ్యాన్నవుతే
మృదువైన రాత్రిలోకి మాటలుగా
అస్పష్టమవుతాను
చీకటిగది మౌనంగా మాట్లాడుతుంది నాలాగా
నిర్మానుష్యంగా
నిర్లక్ష్యంగా
ఆవరించివున్న ఆకాశంలా
మిగిలిపోవడం ఒక నేర్పు అచ్చంగా నాలా...!!

సావేరి

ఒక నిశ్శబ్దం ప్రవేశించినపుడు
అటు ఇటు వెతుకులాట మొదలవుతుంది
నీలోను నాలోను
చుట్టూ ఖాళీతనమేర్పడి
కనురెప్పలు పెదాలై అక్షరాలు గుసగుసగా
మౌనం వంతెనగా టపటపమని
యదసవ్వడి గాలిని చీలుస్తూ
అలల నురగలు మేఘాల్లా చుట్టేస్తే
చినుకులమై ఆకాశంలోకి రాలిపడదాం
కోమల తీగలు అలుముకున్నపుడు
హరితమై వికసిద్దాం
ఇద్దరి మధ్య దూరం ఎదిగినపుడు
ఒక మెలుకువ
మరణిస్తుంది కలల ఆవరణంలో
ఒకానొక
సున్నితమైన భావోద్వేగంలోంచి మొలకెత్తడమంటే
గొంగళిపురుగు రంగుల రెక్కలు చాచడం
భారమైన చలనంలోంచి ప్రకటితమవడమంటే
చినుకులు బుగ్గలపై మృదువుగా
జారిపడటమనే ఉద్వేగం
ఎప్పటికి అంతరాల్లోని శాసనమొక్కటే
నేనొక పదం
నువ్వొక పద్యం

ఈ రాత్రిలో

శూన్యంలో ఎగురుతున్న
పక్షి వెన్నెల
రెక్కలాడిస్తూ నేలపై 
నేనింకో పక్షి
ఆశలరెక్కలతో ఎగిరి శూన్యంలోకి
ఆ పక్షిని పట్టుకోబోతే నా ఊహల
గోరు తగిలి
తనపై ఓ మచ్చ మిగిలిపోతుంది

రెక్కలు విప్పి తన భుజాలపై నుంచోబెట్టాలని
ఆ పక్షి మబ్బులరెక్కలతో
నన్నందుకోబోతే..!
శ్వాసల నిచ్చెన కూలి నేను పడిపోతాను...

రాత్రికిరువైపులా తీరాలు తెగిపోయి
ఎర్రని కాంతికిరణ తూటాలకు
బలవుతూ ఓ పక్షి..!
జీవనాగ్నిగోళంపై నడుస్తూ
బూడిదవుతూ ఇంకో పక్షి..!

కాలం కొమ్మపై ప్రణయానికి మళ్ళీ
ఒక రాత్రి పుష్పించేదాక
పక్షులు రెండు
కొన ఊపిరితో విలవిల్లాడుతూ...

కాలం

ఒక్కోసారి నిజాలు
బయల్పడతాయి సునాయాసంగా
దశాబ్దాల ముందనుకుంటా
రోజులు,
మనిషి సమతూకం...
ఇప్పటి ఘడియల్లో
వేగం,
మనిషి సమాంతరం
బక్కచిక్కి మూలుగుతున్న రోజులు
కాలానికి వ్రేలాడుతూ
అబద్దాలుగా
కనబడేవి కొన్ని అప్రయత్నంగా
కాలానికి సవాలు
విసురుతున్నట్టుగా
ఇప్పటి శవాలు
జీవితకాలం
అరిగేలా రోగాలు మోస్తూ...
రేపటి కోరలు
చాచుకుని విషం పూసిన
అంచులతో రోజులను మింగేస్తూ కాలం వేళ్లూనుకుని
ఒకానొకరోజు అలసి
తూలిపడ్డపుడు నిర్దయగా మనల్ని చూస్తూ కాలం
ఒకే ఒక పానుపు విసిరేస్తుంది
పొడిగా రాలడానికో
పూడికలో
మునగడానికో
అప్పటివరకూ నేను వల్లె వేస్తాను
ఒకే ఒక మాట
కదిలే శవాలమీద నడుస్తున్నదే కాలమా...!

దు:ఖం

కాసేపు ఏడ్వనివ్వండి
చరిత్ర వంతెనేమీ కూలిపోయే
స్థితిలో లేదుగా...!
జ్ఞాపకాల ఎర వేసి ఆలోచనల ఆయుధాలతో
తోడుకోనివ్వండి తవ్వుకోనివ్వండి
గుండెకింద నుంచి ఉబికి కన్నుల్లో సుడితిరిగాక ఏటవాలుగా
జారడాన్ని ఊహిస్తే ఎంతందం...
కాసేపు ఏడ్వనివ్వండి
అంతరిక్షంలోకి వెళ్ళినపుడే కాదు
అంతర్గతలోతుల్లోకి
వెళ్ళి ఏడ్చినపుడే తేలికపడతాం
శరీరం ప్రాణంలేక నిశ్చలంగా పడున్నపుడే కాదు
శరీరం వణికేలా
గుక్కబట్టి ఏడ్చినపుడే చల్లబడతాం
కనురెప్పల చుట్టూ అంటుకున్న
కన్నీళ్ళను ముదాడుతున్నట్టు ఊహించడం ఎంతందం...
ఏడ్చి ఏడ్చి ముఖమంతా ఎర్రబడేలా
దు:ఖానికి దారులు
ఉండవనీ, ద్వారాలు మాత్రమే ఉంటాయని
తెలిసేంత...
ఏడ్చి ఏడ్చి చూపు కన్నీళ్ళలో మునిగి
దు:ఖానికి దృశ్యంతో పనిలేదని దృఢపడేంత...
కాసేపు ఏడ్వనివ్వండి,
మీరు దోసిళ్ళు నింపుకునేంతైనా ఏడ్వండి
హక్కుగా ,
హద్దుల్లేకుండా చేయగలిగేది ఇంకేముంది...!

అస్తవ్యస్తం

మార్చడానికో
మభ్యపెట్టడానికో రాయదల్చుకోలేదుగానీ
వాహనాల కిందపడి 
పత్రికల్లో ఎక్కే శవాలను
లెక్కపెట్టడానికే ఉదయాలన్ని ఖర్చవుతుంటాయి
ఉత్సాహంగా జీవితాన్ని
హత్య చేసే శిరస్సులు
కొన్ని రహదారులపై రక్తమోడుతుంటాయి
కూలిన గోడల మధ్య
అరుస్తున్న దేహాల కేకలు ప్రసరించే
వాహకం వెతుక్కోవటానికి
మార్గాలను అన్వేషించడం జరగాలి
ఉష్ణోగ్రతలకు ఖర్చుచేస్తున్న అలసటల
భారాలు మోస్తూ
ఆకలి ఆత్మహత్య చేసుకుందనీ
కాసిన్ని నీళ్లని సాక్ష్యంగా ప్రవేశపెట్టాలి....
లుప్తమైన సగందేహాలు
ధీమాగా అందరిని వెక్కిరించడం
గమనించినా అహంకారంతో కప్పేసుకోవడం తెలియాలి...
ఏదీ పట్టించుకోకుండా మూర్ఖంగా చావడమే
జీవితాలన్ని,
ఆశలు అన్నిసార్లూ బ్రతికించవనీ
సమాధానపడటమో
ఆవేదనలు అమితమైనా శేషాన్ని వదిలివెళ్తాయని
దాచుకోవడమో మిగులుతుంది...

నది

ఒక నది 
అవతలొక తీరం ఇవతలొక తీరం
నదిని చూడాలంటే ముందుగా ఒక బండరాయిని
వెతుక్కోవాలి
దానిమీద నిలబడి చూస్తే ఆకాశం మీద
నది పారుతున్నట్టే ఉంటుందనీ భ్రమలోకెళ్తాం
అక్కడక్కడా నక్షత్రాల గులకరాళ్లను
మరిచిపోకూడదు
నది నృత్యం చేయడం తెలీదేమో
వంపుల దగ్గరికెళ్ళి తొంగి చూడగలగాలి
కొన్ని కన్నీళ్ళు ఎగసిపడుతుంటాయి చూశారా...!
మునిగి చూడండి మేఘాల్లో తలను ముంచినట్టుంటుంది
అపుడు కన్నీళ్ళుండవు
నదిలా మనం బ్రతుకుతున్నామని
అవగతమవుతుంది.
ప్రవహిస్తున్నపుడు
జీవితంలోని నదిగాని నదిలాంటి జీవితంగాని
ఎత్తుపల్లాలను
కష్టసుఖాలను
కొలిచే తూనికలు ఇంకా తయారుకాలేదేమో
అసలు నన్నడగకూడదు మీరు
నదిని ప్రేమించడం వెనక జీవితం ప్రవహిస్తుందని

అలల జీవితం

హఠాత్తుగా
నేనేమో అలలా మారిపోతాను
మారి నేలపై 
పడుకుని పొర్లి పొర్లి పారుతుంటాను
అలేమో నాలాగనో లేక
ఇంకో మనిషిలానో
మారి అటు ఇటు పచార్లు చేయడం చూడాలనీ
నడుస్తుందో పాకుతుందోననీ వెతికా
అల ఆడుకుంటోంది ఇసుకతిన్నెలమీద గెంతులేస్తోంది
తీరం అంచున పరిగెడుతోంది
మోకాళ్లు మడిచి చేతులు చాచి సముద్రాన్ని హత్తుకుంటొంది
అలల దేహం చూడాలని
నాలోకి నేనే మునిగి చూసుకుంటే
కాస్త నీలంగా
ఇంకాస్త తెల్లగా అచ్చంగా నాలాగనే వుంటాను
ఇంకేమీ తోచక
గవ్వలన్నిటిని రెక్కలు చేసుకుని
నింగి సముద్రంలోకి
ఎగురుతుంటాను తేలికగా నాలాంటి అలల కోసం
అలా తిరిగితిరిగి అలల కోసం
తీరం వచ్చేసిందని మేఘాలపై తల వాల్చగానే
జర్రున జారిపోతాను చినుకులా
నేలపై పడగానే
ఈతరాక మునిగిపోవడం మీరు చూస్తారో లేదో
పారడం వెనక
ఎంతో కొంత హాయిదనం ఉండచ్చు
లోలోపల ఒక జీవిత పరిణామక్రమం ఉండనూవచ్చు
ఏదైనా
ఆస్వాదించడంలోని పరిపక్వత ఉన్నతమైనదే
ఆ జీవితం మరణం అంచున నిలిచేదాకా..!

అక్క

చూపుడువేలు పట్టుకుని 
పరుగుదీసినా
వెనక రెండుపాదాలు నిదానంగానే నడుస్తాయి
పడుకున్నాక నా కాళ్లు 
ఆసరాకోసం తన కాళ్లను తలగడగా తీసుకుంటాయి
రాత్రికలలో 
ఉలికిపాటుకు 
కౌగిలింత ధైర్యాన్నిస్తుంది జోలగా
ఉదయాల్లో బుగ్గలపై నునుపైన 
స్పర్శల మెలకువలు 
మళ్లీ మళ్లీ ఉదయించని ఉషోదయాలు...
దారిలో నడుస్తున్న పాదాలు 
అమాంతం పైకి వెడతాయి 
భుజాలపైకి 
కొత్తముఖాలేవైనా 
ఎదురుపడితే చేతులు 
తన నడుముచుట్టు బిగుసుకుంటాయి భయాన్ని తనపై వేస్తూ
ఎప్పుడైనా కోపమొస్తే నా పంటిగాట్లు తన చేతిపై ముద్రలవుతాయి
అయినా తనకెప్పుడు నేను ప్రేమనే
దుప్పట్లు చిరిగేలా
పోట్లాటలు మావరకూ అవి భయంకర యుద్ధాలు
కొన్ని క్షణాలకే ఆరుబయట 
పసరికల్లో కాళ్లు మునగదీసుకుని కబుర్లూ...
తను కూర్చుంటే 
వెనకనుంచి మెడచుట్టూ చేతులు చుట్టేయటం నాకిష్టం
జ్ఞాపకాలిప్పుడు 
పాతపుస్తకాల మధ్యలో మసకబారిన అక్షరాలయ్యాయి...
తన చేతుల్లో 
నాముఖం ఇప్పటికీ సేదతీరుతున్నట్టేవుంది
 
సత్యగోపి Blog Design by Ipietoon