ఉగ్రవాద నిర్వచనం

భూగోళంపై ఒకేవొక్క రంగు పులుముకుంటోందివాళ
అది మనుషుల దేహంలోంచి ఉబికిన రక్తంరంగు
ఉక్కుగోడల్లో గుర్రుపెడుతున్న వారికోసమే అయినా
ఎప్పటికపుడు కొన్నికోట్ల సార్లు మరణిస్తున్నది నువ్వూ నేనే
మరణించడం ఇవాళ కొత్త కాదనుకో
దాని తాలూకు కౄరత్వం ఎంతనేది కొలవటానికి
కొలతల్లేవనుకుంటా
మన మరణం ఎప్పటికీ గుర్తించబడదు
మనల్ని మనం గుర్తించని అన్ని రోజులూ మరణిస్తూనే వుంటాం
ఇలా కొన్నిసార్లు ఎవరైనా రక్తం పూసినపుడు మాత్రమే
మనుషులుగా గుర్తించబడుతుంటాం
మిగిలిన సమయమంతా ఇద్దరమూ శవంలాగా
ఒట్టి దేహంతో తిరగాల్సిందే
నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే పదా
ఏ దేశ సరిహద్దుల కంచెనైనా కదిలించి చూడు
రక్తం జల్లులుగా పడతుంది నీ ఒంటిపైన
ఏ దేశ సైనికుల దేహాన్నైనా
నగ్నంగా చూడు చిల్లులు పడుంటాయి
ఏ దేశ ప్రజల కళ్లలోనైనా
చూడు భయమనే జీర కదలాడుతూంటుంది
ఏ దేశంలోని ప్రాంతాలనైనా
తాకి చూడు వణికిపోతుంటాయి
ఏ దేశంలోనైనా బ్రతకాలంటే చంపగలగాలి లేదా చచ్చిపోగలగాలి
చచ్చిపోగలిగితే బతికినట్టేగా,
చంపగలిగితే బతికుండడం గురించి నీకవసరమేలేదు కదా
మూర్ఖుడా..!

ఉన్నట్టుండి

ఉన్నట్టుండి ఈ దారి ఆత్మహత్య చేసుకుంటే
నీకంటూ వెళ్లడానికేమీ వుండదు
ఉన్నట్టుండి చీకటిమొత్తం దుప్పటిలా పరుచుకుంటే
ఏదీ కనపడక తెగిన పూలరేకువై తేలిపోగలవు
అలా సులభంగా చీకటి గుహల్లోంచి బయటికెగిరొస్తూ
రెక్కల్లాంటివేమైనా మొలిపించుకునే ప్రయత్నం చేయాలి
ఉన్నట్టుండి తోడుగా రెక్కలొచ్చిన ఉత్సాహం నిలువనివ్వదు
సుదూరంలోని అడవికి రెక్కలతో ఊపిరులూది
ఇష్టమొచ్చిన రంగుల్తో నింపేసి దొరక్కుండా పారిపోవాలి
ఎక్కడో వొకచోట సేదతీరడానికి కూర్చొని కలగనడం మొదలుపెట్టు
ఉన్నట్టుండి నది నీవైపు నడుచుకుంటూ రావడం
ద్వంసమైపోతున్న పైరు నీపైనే మొలవడం కలగను
కలగనడానికి నువ్వుంటేచాలు
ఎవరో వచ్చి కలగనమని చెప్పేదాకా ఉండాల్సిన పనిలేదు
కలగనడమొకటే ఇపుడు మిగిలిపోయింది
నీకిష్టమైన కలను నేలమీద గీసి చూడు
కనబడక్కరలేదు, కలను గీయడానికి ప్రయత్నించడమే
అతిపురాతనమైన మహాస్వప్నం
ఉన్నట్టుండి మనిషెదురైతే
హఠాత్తుగా ప్రేమించడానికి కాసిన్ని మాటల్ని
కళ్లలోనే భద్రపరచుకొనుండాలి
లేదంటే గుప్పిట్లోనైనా దాచుంచుకోగలగాలి
గర్వంగా చెప్పుకునేందుకు ఖాళీచేతుల్తో రాసుకునే ఇలాంటి కలగను
ఉన్నట్టుండి మర్చిపోగలిగే కలైనా పర్లేదు
కలగనడం మరవద్దు
కలగనడం అయ్యాక మర్చిపోవడం కలగానే వుండచ్చు
కలగన్నట్టు గుర్తుండటం జీవితమని రాసుకో

నిశ్శబ్దగది

తడిలేని కన్నీళ్ళను నింపుకోగలిగే గదొకటుంది
పెచ్చులూడిన దేహంలాంటి నిర్మానుష్యమైన గది
ఎవ్వరూ లేనపుడు తూనిగచప్పుళ్ళను మింగేసే నిశ్శబ్దగది
ఏ శూన్యసంద్రంలోంచో మంద్రమైన వెలుతురు అందులోకి ప్రసరించింది
ఇపుడాగదికి రెక్కలొచ్చాయి అయినా ఎగరడంలేదు
నేలపై జారగిలబడి అనూహ్యమైన శక్తితో పాకుతోంది
పిట్టగోడ మీదనుంచి పాకుతున్న తీగలా గోడగోడను పట్టుకుని వేలాడుతోంది
చివరంచుదాకా ఎగరగలిగింది కానీ అటుపక్కకు దూకడం లేదు
శక్తి అంతా దృశ్యరహిత ఆకర్షణకు కూలబడిపోతోంది
చేతిలో ఏ ఆయుధమూ లేకపోవడంతో నిండైన ప్రోత్సాహం కోసం తననితానే తవ్వుకుంటోంది
ఆ గదికి ఇపుడొక పద్యం కావాలి
రాతిబండ కింద ఊరుతున్న తేమలాంటి పద్యమో
ఊరి మధ్యలో నిటారుగా నిలబడ్డ చెట్టులాంటి పద్యమో
నగరానికి అవతల విసిరేయబడ్డ మనిషిలాంటి పద్యమో
రాజ్యం తూపాకికి ఎదురుగా ఎక్కుపెట్టిన తూటాలాంటి పద్యమో
సంఘం నెత్తిన పిడికిలితో బలంగా మోదగలిగే పద్యమో కావాలి
సమాజాన్ని వరదలా ముంచెత్తి ఆ గదిలో నింపగలిగే పద్యం కావాలి
ఆకాశాన్ని చుట్టచుట్టి గూట్లో భద్రపరిచే పద్యం కావాలి
సముద్రాన్ని కిటికీ అద్దంలా నిర్మించే పద్యం కావాలి
మొత్తం మట్టినీ నింపుకున్న అవతారమెత్తాలి
ఆ పద్యమే మట్టి అనిపించేంత కొత్తరూపమవ్వాలి
పద్యానికి మట్టిని అద్దడం కాదు మట్టిలోంచి వచ్చిన మధురమైన పద్యం కావాలి
మట్టిలాంటి ఆ మధురమైన పద్యం ఆ గదిని మింగేయాలి
మట్టి లేకుంటే గది గదికాదు, పద్యం పద్యమే కాదు
మట్టిలాంటి పద్యం ఎప్పుడైనా గది అవుతుంది
మట్టిలాంటి గది ఎప్పుడైనా పద్యం అవుతుంది
వెళ్ళండి మట్టి మాట్లాడిన పద్యం ఆ గదిలో వుందేమో వెతకండి
మట్టికిందే పద్యం పడుకుని వుండగలదు
నిలదీయండి ఆ పద్యాన్ని ఇంకో గదిలాంటి పద్యం చెప్పమనీ,
అది ఈ దశాబ్దాన్ని శాసించే పద్యమవ్వాలని !!



Published in  Andhrajyothi 'Vividha' on 21-03-2016

పావురంకోసం

ఆ పావురం ఎగిరిన స్థలంలో కాసేపు తిరుగాడి
దాని రెక్కల కింద లేచిన ధూళి నావొంటికి పూసుకొని
సాయంత్రాలపై సంపూర్ణంగా నిద్రలేవని రాత్రినై ఒళ్ళు విరుస్తాను
ఆ పావురం చూసిన చోట నెమలిరెక్కలతో నిండైన మనిషిలా లేస్తాను
ఈక ఈకకు మధ్య కన్నులతో ఆ పావురంకోసం నడిచొచ్చే మనిషిలా కదుల్తాను
ఏ చెట్టుకొమ్మ ఊగినా ఆ పావురమే కదిలినట్టు
నేలపైన మట్టి ఎక్కడ కనబడినా ఆ పావురమే వొచ్చి పారబోసినట్టు
మనిషి కనబడితే ఆ పావురమే వదిలెళ్ళినట్టు
పిల్లకాలువలో పారుతున్న నీటిని పిల్లాడు చూస్తున్నంత అమాయకంగా
నేనా పావురంకోసం చూస్తుంటాను
నేనున్న వీధిని మరిచి ఇంకోచోటెక్కడైనా వెతుక్కుంటూ వెళ్లిందేమో
సాధారణంగా ఏ పావురమైనా ఒక్కలాగే వుంటుందా
స్వఛ్చమైన దాని ఒంటిపై ఏమైనా మరకలుపడి గుర్తుపట్టలేనా
సరాసరి ఆ పావురం నా ఎదురుగుండా నిలబడి పలకరిస్తే
నేను నన్నుగా పరిచయం చేసుకోవడానికి మాటలొస్తాయో లేదో
మౌనంగా మూగవాణ్ణై బెరుగ్గా చూస్తే ఆ పావురానికి నచ్చుతానో లేదో
ఎన్నెన్ని దిగులు శిఖరాలు మీదపడినా
ఆ పావురం సంగతి తప్పా ఏమీ గుర్తుండడంలేదెందుకో
సముద్రాన్ని దాచేసుకున్న పావురంకోసం ఎన్ని నదుల్ని దాటెళ్ళానో
ఎన్ని అడవుల్ని తడుముతూ కదిలానో
పావురమొక కలగా ఎగిరిపోకముందే ఆకాశాన్నై
ఆ వెన్నెల లోగిట్లో హరివిల్లు రంగులతో ముగ్గేయాలి
ఆ పావురానికి ముగ్గంటే అమితమైన ఉత్సాహం
మనిషిలోని ప్రేమను ఇంకో మనిషి ప్రేమించినంతగా
రంగులంటే పావురానికి భలే సంబరంగా అనిపిస్తుంది
 
సత్యగోపి Blog Design by Ipietoon