ఒకలాంటివే

మబ్బులో పక్షులో
పువ్వులో పావురాలో
అన్నీ ఒకలాంటి ఊహలే
1
ఒక పువ్వునలా మబ్బుల్లోంచి తుంచి
మెరుపులా జడలో గుచ్చేశాననుకో
ఎంత సొగసుగా వుంటుంది...
2
ఒడ్డునుంచి పట్టుకొచ్చిన అడుగుల్ని
ఏ మొక్కచుట్టూరానో జల్లాననుకో
ఉదయాన్నే పువ్వులు కొన్ని నవ్వేస్తుంటాయి
3
నిన్న సాయంత్రం మనం వదిలొచ్చిన
కొన్ని నడకలు
ఇవాళ పక్షులై ఎగిరిపోయాయని ఎవరో చెప్పుకుంటున్నారు
4
రాత్రి ఏమీతోచక అలా చేయి చాస్తే
వెన్నెల తగిలింది కదా
అపుడు నువు కళ్లు మూసుకొని వున్నావులే
5
నీ బుగ్గమీదనుంచి పెదాలపైకి సిగ్గోకటి పాకడం చూశా
చప్పున ముద్దొకటి బుగ్గకు పెదాలకు మధ్యన
ఇవ్వగానే
నావంక గడుసుగా చూశావుకానీ
కొంగుని విసురుగా నా మీదకేసి
అటుతిరిగి పడుకున్నావో లేదో
నేను ఎప్పట్లాగే కళ్లుమూసుకుని పిల్లాడిలా నవ్వుకున్నాను
6
నా భుజంపై వాలిన పావురమొకటి
ఇలాంటొక ఊహ ఇద్దరిలోనూ వుండడం
అంత బాగోలేదనీ
7
మబ్బులా ఎగిరెళ్ళిపోతుంది ఇంకో దగ్గరికి
మరి ఇవాళేమైనా...!?

ఇవ్వడంలోని…

ఏదీ అక్కరలేదన్నట్టు
పరధ్యానంగా కూర్చొనుండడం నేర్చుకోవాలి
కళ్ళు తెరుచుకునే వుండాలి
బాసింపట్టు వేసుకునే కూర్చొనుండాలి
చొక్కానో తుండుగుడ్డొ
మీదుండి మానాన్ని కప్పెట్టాలి
ఇవేమీ తెలీకుండా లేకుండా ఎక్కడెక్కడొ తిరిగిరావాలి
కానుగాకును తిని తిని కదలలేక కొమ్మను
కరుచుకునుండే పురుగుకి కాస్త కదలిక నివ్వగలగాలి
ఎవ్వరినీ లెక్కచేయకుండా
దారిమధ్యలో పడుకున్న కుక్కపిల్లవైపు
దోసెడంతైనా నవ్వునివ్వకుంటే దిగులనిపించాలి
జేబులోంచి చిల్లర పడిపోయినట్టు
మేఘంలోంచి రాలే చినుకులకు
రెక్కలిచ్చి అటుఇటు ఎగరగలిగే ఊహనివ్వాలి
ఇవ్వడంలోని సంపూర్ణతను దాచుకోలేమెవరం
నడుస్తూ వెళ్తున్న మనిషి
గాజుముక్కలా ఫెళ్ళున విరిగిపోతూండడం
ఉన్మాదంగా ఈ నేలపైనుంచి
నిన్నొక మౌఢ్యం తుడిచిపెట్టేయడం
విసురుగా ఒళ్ళు విరుస్తూన్న
గాలి ఒక్కసారే ఆగిపోవడం ఎవ్వరికీ ఇష్టముండదు
మిగిలింది మనిషికింత
ఊహను సరఫరా చేయడమేననీ తెలిసినపుడు
పొడిపొడిగా బూడిదవుతున్న ఈ చోటునుంచి
లేచెళ్ళి ఊహ ప్రవహిస్తున్న కాగితంలో దూకేయాలి
సాయంత్రానికి ఉదయానికి మధ్య
ఆకాశంకేసి దీనంగా చూస్తూ
ప్రాణంకోసం చీకటిరక్తాన్ని కక్కుకుంటున్న
రాత్రిలా నిశ్శబ్దంగా చావడాన్ని ఎన్నటికీ ఒప్పుకోకూడదు

ఒకానొక చిత్రం

1
ఇంత అడవిని మరికొంత పచ్చదనాన్ని
గీసినట్టు కాదేమో
2
పక్షిరెక్కలను
చెట్ల దేహాల్లోకి ముంచి
కాగితంలా
రెపరెపలాడుతున్న
మనిషి ఖాళీ అల్లోచనల్లోకి
అడవిని
ఒలకబోసినట్టుందని చెప్పగలగాలి
3
బతిమాలి చూడు
అడవినో
ఆ మయూరాన్నో
వానలాగా
నీ గుండెల్లో
నిప్పు రాజేసినంత నిర్మలంగా
నీక్కాస్త పచ్చదనం ఇచ్చేయగలవు
4
ఎక్కడో
సమూహాల్లో తిరిగి
ఆనవాల్లేమీ మిగలక పిగిలిపోయుంటావు
5
వెళ్ళు వెళ్ళు
లోలోపలికి వెళ్ళిపో
అందర్నొదిలి
నిన్ను నువ్వు అతికించుకో ఇపుడే
6
రోజూలా చీకటిని కాకుండా
ఈ రాత్రికి
అడవిని కంట్లో భద్రపరచుకొని
నిద్రపో

(వాడ్రేవు చిన్నవీరభద్రుడు గురువుగారు గీసిన ఒక చిత్రాన్ని చూసి)

రహస్యం - 2

ఎప్పటికీ..ఇంకెప్పటికీ రానని మొండికేసే సమయాలు బోల్డన్ని వుంటాయి నీవైపునుంచి...
రాత్రిపడ్డ వర్షంలో ఈదులాడిన మట్టికి ముద్దిస్తున్న ఉదయాన్ని నీకు చూపించగానే ! తేలికైన మంచు, కిటికీ అద్దంపైనుంచి భారంగా దిగినట్టుగా నా బుగ్గపైనుంచి జార్చేస్తావు ముద్దుని...
మొండిసమయాలు కరిగి నీ వొదులుజుట్టులో ఎక్కడో దాక్కునేస్తాయపుడు, నా కుడిపక్క నిలబడి తలను కొంచెంగా వంచి చిన్నపిల్లలా కళ్లలోకే చూస్తూ చామంతిపువ్వులా నవ్వై పూస్తావు.
ఎంత బాగుంటుందనుకున్నావ్ అలా...! అర్ధరాత్రిలాంటి నాలో చంద్రుణ్ణి గుండెగా మార్చుకున్న మృదుత్వం లోలోపల విస్తరిస్తున్నట్టుగా మారిపోతాను. ఇవాళ కూడా నీకొక కానుకనివ్వాలి పదా ! అని లాలనగా పిల్చుకెళ్తాను. ఎంత దూరమైనా నీ గుండెనుంచి నా గుండెకున్నంత దగ్గరైపోతుంది. మేఘాలు మొలిచినట్టు, నీ నా పాదాలను కౌగిలించినట్టుగా వున్న గడ్డిమీదనుంచి ఒడ్డుకున్న అడ్డువాకిలిని తెరచి లోపలికెళ్తాం. ఆకాశంలోంచి జారిపోయిన ఇంద్రధనస్సు పగిలి చెల్లాచెదురైనట్టు ఒకేచోట పడున్న అన్ని రంగుమొక్కలు మనకి వినబడకుండా గుసగుసలాడుతుంటాయి...
పక్కనేవున్న కొండపైకెళ్ళి దూరంగా కనబడే సముద్రాన్ని చూపిస్తాను చూపుడువేలితో..."సముద్రం చాలా పెద్దదిగా వుంది కదా" అంటావు నావైపు తిరిగి చిలిపిగా, వెక్కిరింతగా...అచ్చు మల్లెతీగ ఒంపుతిరిగినంత అందంగా బుంగమూతి పెడతాను నీమీద కోపం నటిస్తున్నట్టు. నా అలకను తొలగించడానికని సముద్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తావు...నా భజంపై చేయి వేసోకసారి, వెనకగా వచ్చి మళ్లీ భుజంపై గడ్డం ఆన్చి మరొకసారి అలా పదే పదే చూసి చూసి అలసినట్టు నా వంకే చుస్తూ "బడాయి కాకపోతే నీకేమనిపించిందో చెప్పవోయ్" అంటూ బుగ్గ గిల్లుతావు...
నీ నొసటమీద చిన్నగా ముద్దిచ్చి కాస్త దూరం జరిగి "అక్కడా సముద్రమెలా కదుల్తోందో చూడమ్మీ" అని ఇంకోసారి చూపిస్తాను. అల్లరిచేస్తున్నపుడు అమ్మ గద్దించినట్టు కిందపెదవి కొరుకుతూ చెయ్యెత్తి నామీదకొస్తావు...
అప్పుడంటాను "ఆ సముద్రం అలా అలా ఊయలలా కదుల్తూంటే నీ నడుము కదుల్తున్నట్టుగా లేదూ !!" అని,

చెట్టుగీతం

నేల నేలంతా
ఖాళీ లేకుండా
నిర్మలంకోసం
మట్టిని తొలుచుకుంటోంది
మనిషే లేని మహాస్వప్న మైదానం
చెరువు హృదయం
సెలయేర్లు చేతులు
వాగులు కాళ్లు
నది గుండె
మొక్కనొకదాన్ని దాచుకుని సేదతీరాక
నేల నేలంతా 
ప్రకృతి నృత్యం చేస్తుందిపుడు
ఆకాశం తప్పెటై
దిక్కులే దరువులై 
చెట్టుగీతం 
మట్టికి వినిపిస్తుంటుంది

అలా ఎన్నిసార్లో

అలా ఎన్నిసార్లో
పరిగెడుతూ కొండల్లోంచి లోయల్లోంచి
ప్రవహిస్తూ వాగు
అలా ఎన్నిసార్లో
మౌనంగా మట్టిలోంచి మనిషిలోకి
పచ్చగా పరిమళిస్తూ చెట్టు
అలా ఎన్నిసార్లో
తేలిపోతూ మనిషిపైనుంచో మనిషిలోపల్నుంచో
గంధమై గాలి
అలా ఎన్నిసార్లో
వాగు గుండెలోంచి చెట్టొకటే
గాలి పల్లకిపై
మనిషిదాకా ప్రయాణిస్తూనేవుంది
చెట్టొకటే మనిషికి
జీవం
నింపగలదు
చెట్టొకటే మనిషికి
ప్రాణమివ్వగలదు

బంగారు పాప

చూస్తూనే వుండాలంతే
చూసి చూసి కళ్లకు ఆనంద ప్రపంచాలేవో వేలాడుతాయి
ఓ పాపనెక్కడో
లీలగా చూసిన దృశ్యం
ఓ పాప నా అరచేతుల్లో పారాడిన సన్నివేశం
ఓ పాప నా నుదురుపై పాదాలతో తడిమినట్టుగా
ఓ పాప నా గుండెలపై
నవ్వుతూ అలసి నిదురపోయినట్టుగా
ఆ నవ్వునెవరైనా
నా కళ్లకు బిగించమని
ఆ పాపనెవరైనా నా బుగ్గలపై నడిపించమని
ఎన్నెన్ని అదృశ్య రహస్యాలు
నాలోపల్లోపలే
రాత్రిలా మొరపెట్టుకుంటున్నాయో
రాత్రెపుడూ
ఓ వెలుగు రేఖ కరచాలనం కోసం తచ్చాడుతుంటుంది
అలాంటి ఓ రాత్రిని నేనే అవడం
నన్ను నేను వెలుగు చాపమీద దొర్లి దొర్లి నిద్రపుచ్చాలనుకోవడం
ఎంత దయామయ పసితనమది
ఎక్కడినుంచి వొచ్చిందిదంతా నాలో
ఏ బాల్యస్మృతుల గీతం గొంతెత్తి పాడుతోంది
ఆ పాపకోసం
నన్ను నేను ఛిద్రం చేసుకుని బయటికొచ్చేయాలనుంది
ఆ పాపకోసం
కాళ్లను చుట్టచుట్టి చక్రాల్లా తిరిగేయాలనుంది
నేను వేరు పాప వేరు అన్నపుడు
దేహన్ని ఉండచుట్టి దిబ్బలో పడేయాలనుంటుంది
దేహం ధరించుండడమే దౌర్భాగ్యంగా తోస్తుంది
దేహం ముసుగేసుకోవడమే
అసలైన మరణంగా భావిస్తాను
నాకెవరైనా విరూపాన్ని ఇవ్వండి
పోనీ పాప చెంతనుండే ఏదొక రూపమివ్వండి
ఆ పసిదానితో ఆడుకోడానికి మబ్బుల బంతిలానో
ఆ పసిదాని పాదాలంటుకునుండే అడుగుల్లానో
ఆ పసిదాని లోకంలో రెక్కల్లేకుండా ఎగిరే ఊహలానో
పసిదానితో వుండే వొకేవొక్క నవ్వునివ్వండి
లేదంటే
నిన్నటికి ఇవాళ్టికి మధ్య
ఆగిన కాలాన్ని హత్యచేయడానికి నాకో ఖడ్గాన్నివ్వండి
కనీసం నా చూపు పొలిమేరల్లో
ప్రవహించే ఆత్మీయతను తన ముందు కుమ్మరించే
ఒక్క రోజునైనా ఇవ్వండి
నా మాట చివర్లలో ఒలికే ఆప్యాయతే
తన కళ్ళకు కాటుక అయ్యే క్షణాన్నైనా ఇవ్వండి
ఆ పాప నాలోపలి సముద్రం
ఆ పాప నాలోపలి సంతోషం
ఆ పాప నాకు నన్నుగా చూపించే ప్రాయం
ఎన్ని ఉదయాలనో కుప్పగా పోస్తేగాని పాపను చేరుకోలేను
ఇలా
ఇక్కడ సాయంత్రం గుమ్మం ముందు నుంచుని
రాత్రిని హత్యచేయడానికి
నేనో విధ్వంసక రూపాన్ని నిర్మించుకుంటున్నాను

చెట్టు

రాత్రి గుండెలో 
చీకటి గీతమొకటి
వినిపించినట్టు
మట్టిలోని విత్తనానికి
మొక్కపాట
వినిపిస్తేనో
ఈ వీధిమలుపు
ఆ వీధివంక తొంగి
చూసినట్టు
ఓ మొక్కకోసం చూడగలిగితేనో
ఒంటరికొమ్మలపై పక్షులు
వాలినట్టు
కొన్ని నీటిచుక్కలు నేలపై
వాలితేనో
చూడగలుగుతావు
ఒక చెట్టు
మనిషిపై పచ్చగా
బోరవిడిచి ఇంకో మనిషిలోకి
నడవడం
 
సత్యగోపి Blog Design by Ipietoon