కవిత్వం తినాలనుంది...!

ఏంటో ఇవాళ
బొత్తిగా సమయం కదలటం లేదు

మనసంతా ఇరుకుగా
శరీరం కరుగుతున్నట్టుగా

నువ్వైనా రావచ్చుగా
కవి..!
నాలోకి పరకాయం
చేయకూడదు

నాలుగు అక్షరాలు పిండి కలిపి
పదాల వడియాలు
ఆరబెట్టి
కాగితపు
నూనెలో వేయించి
కవిత్వాలను తినాలనుంది...

నువ్వంతేనోయ్..
ఒట్టి స్వార్థపరుడివి
నీక్కావలిస్తే
మట్టుకు
రవికి తెలియని చోటుని కూడా
కాజేస్తావు...

ఏం
నాబోటి వారిని కాస్త
పట్టించుకోవచ్చుగా...
నేను
పామరుడనే
అందుకే నిను రమ్మంటున్నా..!
నా మనసుని
పావనం చేయమని...

ఇది నా ఆర్థి
నా ప్రార్థన

తప్పుంటే క్షమించు కవి
ఎంతైనా
నేను నీ వాడినేగా.....

నా బాల్యం

నా బాల్యం
పల్లెటూరిలో
గతుకుల దారిలో
బస్సు గొట్టం నుంచి వచ్చే
దట్టమైన పొగ..
ఇంటి వెనక దొడ్లో పేడ అంత
చిక్కని మెత్తదనం..

నా బాల్యం
ముడ్డి కింద చిరిగిన నిక్కరు
అతుకులు..
చొక్కాకు గుండి పోగొట్టుకున్న బాధను
కప్పివేసే పిన్నీసు..

నా బాల్యం
వేప చెట్టుకింద
అరుగుపై
పెద్దమనుషుల చుట్టూ
పరిగెడుతోంది..
ఇంటి బయట ఆడవాళ్ళ
బారాకట్ట ఆటకు
సిద్ధమైంది..

నా బాల్యం
బడిలో తక్కువ మార్కులు వచ్చినందుకు
మేష్టారు చేతిలో బెత్తం..
చేను గట్టుపై పడకుండా పరిగెట్టే
పందెం..

నా బాల్యం
మసక చీకటిలో
చందమామ పక్కన చుక్కలను
లెక్కపెడుతోంది..
అవ్వ చెప్పే కథలకు
ఊ కొడుతోంది..

నా బాల్యం
ఎడ్లబండిపై
హోప్ప...హూప్ప...హో హో
అని ఎద్దులని గద్దిస్తోంది..
చిగురు కోసం చింత చెట్టుపై
కొమ్మకు వ్రేలాడుతోంది..

బాల్యం ఎప్పుడు
అందమైనదే
దర్జాగా, స్వతంత్రంగా,
ధీమాగా
ఉంటుంది నా బాల్యం..

నా బాల్యం
రాత్రి
ఒంటరిగా బయటికి వెళ్ళలేని
పసితనం..
అమ్మ పక్కనే కొంగు కప్పుకుంటుంది
నా బాల్యం..

నువ్వంటే భయం

నిను వెలివేస్తున్నాను...
ప్రపంచపు చివరి మెట్టుపై నుండి
విసిరివేస్తున్నాను...

నడవడం రాని అడుగు నువు
క్రమశిక్షణ లేని కవాతు నీది

శిలతో మాట్లాడినట్లు
నిశితో కలిసినట్లు
అశ్రువులో కరిగినట్లు

ఒట్టి భ్రమ నాది
మట్టి బొమ్మ నువ్వు...

ఆర్భటపు ఆవిర్భావానివి
అనంతలోకపు
అంతానికి సంకేతానివి

చెరిగిపోయే చిరునవ్వు నీది
దరి దాటని దరహాసం నాది
నాకు హద్దులు ఉన్నాయి
బరువులు
అరువులు
బాధలు
భయాలు
సంతోషాలు, సహవాసాలు ఉన్నాయి...

అన్ని నీవల్లే...

కష్టాలు నాకు ఇష్టాలు
బాధలు నాకు బంధాలు
తడబాటు నా తోబుట్టువు
అయినా
చిరునవ్వు నా పెదవుల
తడిని
తాకుతూనే ఉంటుంది...

సమాజమా...!
నువ్వంటే నాకు
భయం
నిను వదులుకోలేని భయం అది

కవిత్వ పుత్రిక

కరమున కలమును పట్టుకుని
రుథిర సిరా ఒంపుకుని
ఎదుట
పుటలను పరచుకుని
హృదయం బిగువుని భరిస్తూ
కవిత్వ పుత్రికను
కంటున్న
పురిటినొప్పులివి...

పల్లెటూరిలో పసరికల
మధ్యన
వెన్నెల్లో అవ్వ బోసి నవ్వుల
జడిలో
అక్షర పుత్రుడను పెంచే
పరిపూర్ణత

మట్టిని ముద్దాడిన ఘడియలు
ఒంటిగా గతాన్ని తవ్వుకునే
జ్ఞాపకాలు
నువు ఆడపిల్లవి...
నా అమ్మవి ...

ఓటమంటే ఇష్టం...!

గమ్యం ఎప్పుడూ గమనాన్ని
భయపెడుతుంది
అడుగు తడబడుతుందని.....

సమాధానంలో ఏముంది
ముగింపు తప్పా...
ప్రశ్నలను
తడుముకో
ప్రతిక్షణం పరిశోధిస్తావు....

విజయంలో సమాజం నిను మాత్రమే చూస్తుంది
ఒక్కసారి ఓటమిని
కావలించు
నువు సమాజాన్ని చూస్తావు
ఒక మనిషిగా మరో మనిషికి పరిచయం అవుతావు...

ఉధ్భవించు
ఉజ్వలించు
ఉవ్వేత్తున ఎగసిపడు
పోగొట్టుకునేది నీ ఆశ మాత్రమే
పొందగలిగేవి ఆశయాలు...

నాకు ఓటమి
ఇష్టం
నా కన్నులు చూస్తాయి...
వాటితో మాట్లడతాయి...
గెలుపు ఒకవైపే చూస్తుంది
గెలిచే వైపు...

ఓటమి నలువైపులా చూపిస్తుంది...
ఒంటరితనం వైపు
కన్నీటి వైపు
బాధ వైపు
బదులు వైపు
బాధ్యత వైపు

అందుకే ఓటమి ఇష్టం
నాకిష్టం...

ప్రమాదం - ప్రక్కన నేను

రాదారికి ఒక ప్రక్కగా నిలబడగా
తెరలు తెరలుగా రుధిరపు వాసన నాపై పరుచుకుంది
ఏవో అరకొరగా మూగ రోదనలు నా చుట్టు ద్రవించినవి

సన్నని వణుకు
తడిగా మారిన చేతులు
శరీరం కూలబడుతోంది

మనసు అక్కడినుంచి పారిపోబోయింది
అశక్తిక ప్రయత్నంగా తోచింది

జనాల ఆచోటే అతుక్కుపోయారు సలపకుండా
కొన్ని కొన్ని మానవత్వపు జల్లులు కురిశాయక్కడ

ఛిద్రమైన వాహనపు తునకలు పాదాలను తాకుతున్నాయి
బాధగా......
ఆర్ద్రతగా అందరిని చూస్తూ స్థానువయింది వాయువు కూడానూ
స్పర్శగా......

కన్నీటితో లోపల తడుస్తున్న నదిని అయిపోయాను
ఆ నిమిషం క్షణక్షణాలుగా విడిపోయాను

మనం చేసే కార్యాలకు వేగం
ఆలోచనలో...
శరీరానికి వేగాన్ని ఇవ్వడం ఇలాంటి ప్రమాదానికి స్వాగతమే.......


06-04-2013

నేను - నాలో నేనే



ఒక పిడికిలిలో చీకటిని
ఇంకో పిడికిలిలో వెలుగుని దాచేసిన
బలహీనత నాది

బాధలో చీకటిని చూసి నేనే నయం
ఆనందంలో వెలుగుని నువు సన్నబడ్డావనే అపహాస్యం
రెండిటిని బేరీజు వేయలేని అసహాయత

ఊహ ప్రపంచానికి వ్రేలాడేసిన వస్తువుని నేను
సమాజానికి అన్వయం కాని అద్దాన్ని
కొన్నిసార్లు భయంగా
కొన్నిసార్లు కోపంగా
కొన్నిసార్లు దిగులుగా
కొన్నిసార్లు గుబులుగా

అన్నిసార్లూ భయంగా చూస్తుంటాను........

నాలో నా ప్రశ్నకు సమాధానం నేనే
మిమ్మల్నడిగే ప్రశ్నకు ఆశ్చర్యమే బదులు

నేనో విరామచిహ్నాన్ని
ఒట్టి చిహ్నాన్ని
ప్రశ్నించాలని ఆపి అడగలేని స్వప్నాన్ని
తాకాలని చేయి చాపి స్ప్రుశించని గాలిని

ఎప్పటికైన నా జాబుకు
మీ జవాబు కావాలి.........

03-04-2013
 
సత్యగోపి Blog Design by Ipietoon