చూపు

అలా చూస్తూ కూర్చోడమనేది
నీనుంచే ప్రసరించిన సెలయేరు లాంటి ప్రవాహం
కెరటమై నవ్వేస్తావు కానీ
ఏటిఒడ్డున గట్టులా కాళ్ళు చాపుకునుంటా
ఎన్ని మాట్లాడామో
ఎంత మాట్లాడుకున్నామో
ఇంకా మిగిలేవుంటుంది ఇద్దరిమధ్య
ఆకాశమెంతున్నా మేఘాలవెనక హరివిల్లున్నట్టుగా...
నువ్వెళ్తున్నపుడు
నీ చూపు నాపై యుద్ధం ప్రకటిస్తుంది
అలా చూస్తుంటావేంటసలు..!
నవ్వుల్తో తడిపేస్తూ
మౌనంతో స్పర్శించేస్తూ
ముసిముసిగా రంగొకటి పూసేసి
తూనిగ కాళ్ళతో కదిలించి వెళ్తుంటావేంటని నిలదీసేస్తుంది...!!
గాలులకూగే కొమ్మలు
పక్షుల కేరింతలు
నేలపైనీ పసరికల కబుర్లూ
అన్ని ఆగిపోయి ఒక చాయాచిత్రంపై అందరం బంధీలమైపోతుంటాం...
అటుఇటు ఏమీలేనట్టు
నువ్వో పువ్వై కదిలొస్తున్నట్టు
నేనో దారాన్నై నిన్నల్లుకుపోదామనీ
నాలోకి నేనే ఉండలుగా చుట్టబడుతుంటాను
క్రమశిక్షణగా...

తప్పిపోవడం

తప్పిపోవడమంటే
వెనక్కెళ్ళి చరిత్రలో ఏదోకమూల జారిపోవడమనేమో
ఒక నిర్లిప్తతను దాచేసి
ఆశనో, ఆశయాన్నో మోసుకురావడమనీ...
ముందువైపుకు తిరిగాక చేయి వెనక్కిచాచి
ఇంకో చెయ్యేదో పట్టుకోవడంలాంటిదని.
వూరికే ఉండడంకంటే ఇలా తప్పిపోవడం
సీతాకోకచిలుక మరచి మళ్ళీ గొంగళిపురుగైపోవడంలాగా..
ఏదైనా దొరకచ్చు
జనాలందరూ ఒకేచోట గుమికూడడమో
ఉదయాలన్నీ పొయ్యిలోంచొచ్చే పొగతో నిండిపోవడమో
సాయంత్రాలు గలగలమని చప్పుళ్ళలో చావడమో
చీకట్లు కిలకిల నవ్వుల్లో వెలిగిపోవడమో
మట్టి తప్ప మరేదీలేని మౌనమే దొరకచ్చునేమో!!
వృధాగా పడుండటం దేనికి,
అమానుషంగా
అమానవీయంగా ఇక్కడే నిలబడితే
ఏదోవొకటైపోయి
నశించిపోవటం జరిగిపోవచ్చు...
తప్పించుకు పోవడం స్థాయినుంచి
తపించిపోయే దిశకు మళ్ళీ మరలిపోదామనుందిపుడు
నిశ్శబ్దంలో నిర్దాక్షిణ్యంగా,
నిరాధారంగా మరణించడంకన్నా
శబ్దంలో బద్దలుకావడమనేది మరొక జననమవుతుంది
అందుకే తప్పిపోవడం
అత్యంతావశ్యకమూ,
అనివార్యమూ అవ్వాలిలాంటపుడు...!

ఖాళీతనం

నడుస్తూ నడుస్తూ ఆగిపోయినపుడు
పాదానికి పాదానికి మధ్య 
ఖాళీతనం దాగుంటుందనీ
వీధిదీపాల వెలుతుర్లో
కాంతికిరణాల మధ్య 
నిశీధిలాంటిదేదో వెతకాలేమో..!

మాటలన్ని 
క్రమక్రమముగా 
నిలబడ్డాక అక్షరాలవొత్తుల మధ్య 
ఖాళీతనం పెగులుతుందపుడు
దృశ్యాల సంభాషణల్లో 
వీక్షణమొకటి 
నలగబడి, 
నిశ్శబ్దాల లోపలివైపు
ఎడంగావున్న తలంపులలో 
ఖాళీతనం చుట్టుముట్టి 
నన్నాక్రమిస్తున్నపుడు
అప్పటికొక 
కలనై రాత్రికి వేల్లాడతాను

ఖాళీతనమనేది 
తెచ్చిపెట్టుకోగలిగినంతగా 
కావాల్సొస్తుంది
శ్వాసకి మరణానికి 
మధ్యనున్నపుడు 
వీలవుతుందనిపించదేమో కదా..!

మూర్ఖత్వం

సాయంత్రాల మీదనుంచి జారిపడిన
రాత్రుళ్లు నల్లని దుప్పటితో
కప్పేస్తుంటే
వెతుక్కోటానికి స్పర్శలే మిగులుతాయప్పుడు
నీకు నాకు గుడ్డితనముంటే బాగుండుననిపిస్తుందెందుకో
చెట్టాపట్టలేసుకుని
సిగ్గుల్ని కనురెప్పల కిందకు తోసేసి
స్వేచ్చగా ముద్దాడటానికి...
జీవించడానికి
మాంసపుముద్దలు బరువవుతాయి
దేహమంటూ వొకటి లేకుండా
నిర్జీవంగానో
నిరాకారంగానో మిగిలిపోదాం పదా !
చీకటిలా దాక్కోవడమో
శూన్యంలా మాయమవడమో సాధన చేద్దాం !
ఇలాంటి ప్రయాణాలు బలంగా,
రాత్రి ఆకాశమ్మీద నక్షత్రాల్లాగా వెలుగుతూనే వుంటాయి
ఉదయాలు నిద్రలేచాకా
జ్ఞాపకాల్లాగా మెరుస్తుంటాయని భ్రమించాలంతే...
ఎప్పుడోవొకప్పుడు
ఏదోవొకచోట
ప్రతి అడుగు, గుర్తుగా మన వెనకే మిగిలిపోయినపుడు
మసకతనం ప్రవహిస్తుంది
అపుడు నువ్వు నేను
అనుకుంటూనే వుంటాం ఇంకొన్ని అడుగులు వేయాలేమో అని.....
గుర్తుచేసుకోవడమంటే
మేఘాల మధ్య నుంచి ఆకాశాన్ని చూసినట్టుగా...
నిజమా..? అబద్దమా..?
ఇవాళ్టిలోనే వున్నానా లేక నిన్నల్లోనా...!!
ఇప్పుడనిపిస్తుంది మూర్ఖంగా...

వింత ప్రకటన

ఎవరూ లేరని
గతాన్ని తవ్వుకుంటున్నపుడు
హత్యచేయబడ్డ నా శవం
ఇప్పటికి మీ మధ్యే ఉండడమంటే
ఆ శవాన్ని ఇంకోసారి నేనే హత్యచేయాలనేమో..!
ఏదో ఒక అద్భుతం జరిగిపోయి
చినుకులన్ని శూలాలై ఈ శవాన్ని చీల్చిపడేయనీ
కాలాలు కత్తులై బూడిదైనా చేసేయ్యాలి
కుళ్ళి కంపు కొడుతున్నపుడు
మీ మధ్యలో పడేయడమొక్కటే అంతిమంగా,
నిరసనగా శవాన్ని
కాలితో తన్నండి
ఇంటి దూలంపై ముడుచుకున్న కత్తుల్తో
విచక్షణారహితంగా,
కౄరంగా,
గుర్తుపట్టలేనంతగా గీసేయ్యండి
దూరంగా, కనిపించనంత దూరంగా విసిరేయండి
నేనో గాఢ నిట్టూర్పుని ఇక్కడ శిలాఫలకంగా వదిలివెళ్తాను
వెళ్తూ వెళ్తూ నా కన్నీళ్లతో
నా అంత సముద్రాన్ని ఇస్తాను బయల్దేరండి
నెనో నాలాంటి ప్రేమో
నుజ్జు నుజ్జై నురగలుగా అవతలి తీరంవైపుకు కొట్టుకెళ్తే
మీరే గాలాలై పట్టుకోండి
మీకేమాత్రం అవకాశమున్నా
నన్నోదిలేయండి
నాలోకి నేను ముడుచుకొని
నేనొక ఆయుధమై
ఆత్మహత్యగా చిత్రికరించబడతాను
మనిషన్నవాడు మరణించాక
ఒక శవమై మీలోకి బద్దలుకావడమే...!
దారుణమైనదేదైనా వుందంటే
నేను శవమై
ప్రకటించడమొక్కటే...
 
సత్యగోపి Blog Design by Ipietoon