2048

ఒకడు బయల్దేరి 
ఏదోక వీధి మలుపులో కాస్త మట్టిని తీసి నింపుకుంటాడు
చూస్తుండగానే వస్తాడు వెళ్తాడు 
అలవోకగా అతిసాధారణంగా అందరూ తిరుగుతున్నట్టుగానే
అలా వీధులు ఇళ్లు కూడళ్ళు దాటుకుంటూ
తెలియని నగరంలోకి వలసొచ్చిన పక్షిలా 
మామూలుగానే వచ్చేసి కాస్త మట్టిని దోసిట్లో
పట్టి పట్టి చూసి ప్రేమగా వెంటతెచ్చిన సంచిలో వేసుకుంటాడు
మట్టి మీద నది నడిచెళ్తున్నట్టు
మనుషుల్లోంచి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతాడు
ఊహలను ఆలోచనలను మేఘం సముద్రాన్ని ఎత్తుకెళ్ళినంత
ప్రాణప్రదంగా మరో చోటుకు మోసుకెళ్తాడు
అలా ఎన్నో ఊళ్ళూ తిరిగి ఇంట్లోనే వుండిపోతాడు
కొన్నాళ్ళకు 
చుట్టూన్న వాళ్ళంత ఎగబడి అతనింటి దగ్గరికొస్తారు
ఉత్సుకతతో ఊపిరాడని ఉబలాటంతో 
వాడిని నిలదీయడానికి వాడింటిముందే సభలు పెట్టి
వాడొక పరమ దరిద్రుడని నిర్దారిస్తారు
పెద్ద పెద్ద భవనాల మధ్యలోంచి
అనాదిగా స్థిరపడిన సూర్యుడొచ్చే సమయానికి
అతను అన్నం వండుకుని తింటుంటాడొక్కడే
అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో అన్నం చేయడమొక అద్భుతమని 
అతడిని ఎత్తుకుని సన్మానించారు
మనుషులు అన్నాన్ని చూసి చాలా రోజులయ్యింది కదా
గుర్తుపట్టినట్టులేదని అక్కడినుంచి 
కొన్ని చిన్న మొక్కలు పట్టుకుని బయళ్దేరాడు
ఏదోక ఖాళీ ప్రదేశంలో అడవిని నిర్మించడానికి
అతను బయల్దేరిన ఏడాది 2048

ఏడ్పు

ఏడ్వడం కూడా ఆనందంగా ఉంటుందనీ
కన్నీళ్ళు చెక్కిలిపై
గిలిగింతలు పెట్టేవరకు తెలీదు...

ఏడ్వడం మొదలుపెట్టాక
ప్రపంచం మొత్తం భారాన్ని మోస్తున్నట్టు
అలలు అలలుగా విరిగి
సెలయేటి చప్పుళ్ళ కిందపడి మరణిస్తున్నట్టు
కాలుతున్న కాగితాలపై అక్షరాన్నై
ఆత్మహత్యనైనట్టు
నాలో ఒక శూన్యం నన్నే లాగేశాక అదృశ్యమవుతానేమో

ఏడ్చి ఒట్టిముఖం మిగిలిపోవడానికి మధ్య
సమయం రాజ్యాధికారానికి ఖైదిలా
దు:ఖం విధించిన శిక్షల్లో గాయాలు మోసే దోషిలా
ఒంటరి మైదానంలాంటి దేహం
అలసత్వంతో ధూళికణాలుగా
చెదిరిపోతుందేమో...
నాలో ఒక శూన్యం నన్నే లాగేయడం చూడలేకపోవచ్చు...

ఏడ్వడం పూర్తయ్యాక
శాసించే సాధనం ఏదో కాళ్లకింద ఒదిగినట్టు
మొఖం విప్పార్చి ఆయుధమైన
నవ్వొకటి వికసిస్తున్నట్టు
ఎడాపెడా దేహం లోకాన్నంతటిని చుట్టేస్తున్నట్టుగా
నాలోని శూన్యం నుంచి
బయటికిరావడం తెలిసుండకపోవచ్చు...

ఏడ్పు ఎప్పటికీ
వ్యక్తిగత జీవితానికి ముఖ్యమైన భరోసా !
ఏడ్పు ఎడతెగని జీవనసంగీతం
అఖండమైన శక్తినిచ్చే స్నేహం

గుర్తింపు

అందరూ వెళ్ళిపోయాక
నిశ్శబ్దాన్నే అణ్వాయుధంగా విసుర్తాయి గోడలు
వరండాలోని చెట్లన్నిటికి జీవమొచ్చి
ఆకులను కప్పుకుని వొంగి వొంగి వేర్లతో ఇంటిలోపలికి నడిచొస్తాయి
నీళ్ళన్ని నృత్యం చేస్తుంటాయి గాలిపాటకి
బల్లమీది కాఫీకప్పు నురగలు నురగలుగా దగ్గుతుంది గుర్తించరేమోనని
పుస్తకాలన్ని చనిపోయినట్టు నటిస్తుంటాయి
మనిషిలేకుండా పోవడమంటే లేకపోవడమనే అనుకుంటా
గోడలకు వాటిదైన చలనముంటుందనీ కనిపెట్టగలిగేదెవరు
చెట్లకు సంభాషించడం తెలుసునని చెప్పేదెవరు
పుస్తకాలు అన్నన్ని దృశ్యాలను చూపించినా అదొక కంటివెలుగని నిరూపించిందెవరు
మానవుడు తయారుచేసిందే ప్రపంచంకాదని లిఖించబడుతోంది ఈ గోడలమధ్యలోనే
ఇది చరిత్రలోనూ వుంది భవిష్యత్తులోనూ ఉండబోతుంది
ఎవరొచ్చి మాత్రం వెలికితీయగలరు వీటన్నిటిని
జీవనానికి ఇంకోవైపు దృశ్యరహిత ప్రాణాలివన్నీ
శాసనాలుగా స్థిరమైనవేగానీ
చలనంలేనివొక్కటే చదవగలిగే లిపి
గోడలమీద పునరుజ్జీవనం పొందుతోందంటే నమ్మగలిగేదెవరు
ఆ నమ్మకాన్ని మోసుకుని ప్రయాణించేదెవరు
తేలికే అయినా భారమైన వాస్తవాన్ని మోయగలిగే ఊహ నిలబడదు
కొన్ని అదృశ్యాల వెనక నడిచే దృశ్యనాటకమిది
దాన్ని గుర్తించగలిగినపుడు నాటకం మరో జీవితమైపోతుంది

చాలు కదా..!

పెద్దగా ముఖ్యమనిపించని ఆలోచనల్లోంచి
బయటివైపుకి దూకగలిగి
ఇలా వొకరోజంతా ఒకే కాగితంపై
తచ్చాడుతున్న జ్ఞాపకాన్నై మిగిలుండడం గొప్పదిగా తోస్తుంది
అతిముఖ్యమనిపించేలా దేన్నీ చెప్పుకోవాలనుండదు
అత్యంత ప్రేమగా మాత్రమే నిరూపించబడాలనుంటుంది
చెప్పడానికేమీ లేకపోయినా ఏవోకొన్ని మాటలు అటుగా అందించాలనొకటి
అడగటానికేదో బలంగా తోచినపుడు వద్దని ఆపేయగలిగేదొకటి
రెండు హృదయాలో రెండు జ్ఞాపకాలో చిక్కుబడుంటాయి కాలంలో ఇరుక్కుని
రెండు దేహాలో రెండు ఆలోచనలో దారితప్పిపోయుండచ్చు పట్టుబడని ప్రపంచంలో
సముద్రమూ మేఘమూ ఒకే అలకోసం యుద్ధం చేస్తున్నపుడు
తీరం ఆ అలను పొదుముకోవడం ఒక సుధీర్ఘమైన ప్రేమవుతుంది కదా !
అలాంటి సుధీర్ఘమైన మన జీవితాల పలకరింపుల్లో
ఇలాంటొక రోజు గడిచిపోవడానికంటే మించిన ముఖ్యమైనదేముంటుందనేదే రాసుకోవాలి
మళ్ళీ మళ్ళీ అడ్డుపడనివేవీ లేకపోవడమంత సాధారణంగా
కొన్ని ఊదా రంగుపూల గుసగుసల మధ్యనో
లేత పసుపురంగు మొక్కలను ఓరగా తడుముతూనో
రంగుపిచ్చుకల మాటలను నక్కినక్కి వింటూనో
ఇలా గడిచిపోవడంలోని అమాయకత్వాన్ని మించిన జీవితాన్నివ్వగలిగే
రోజొకటి ఇవాళ చేతిలో దాచుకోవడం చాలనిపిస్తుంది కదిపుడు !!
 
సత్యగోపి Blog Design by Ipietoon