రెండు సంతకాలు

కంటిరెప్పలై మేఘాల్లాంటి వాటిని తోసేసి
తారాచూపుల్తో నువ్వూ
శూన్య హృదయంతో దిగులునిశీధి మొఖాన్నేసుకుని నేనూ
నిశ్శబ్దావరణ
విరహగొంతుకలతో
సూర్యకిరణమై నాదొక పిలుపు
వెన్నెలజలతారై నీదొక పలుకు అంతులేకుండా...
యాక్...ఇది వొక్కవితేనా !
ఏంబాగాలేదని నువ్వంటావుగా అందుకనే ఈసారి...
తెల్లకాగితంపై రెండుసంతకాలమౌదాం
వొకటి నువ్వనే సంతకం రెండు నేననే నీలాంటి దస్తూరిగా...
సెలయేటికింద రెండురాళ్ళై నదిలో కరిగిపోదాం
ప్రవహించే నీటిని సాగనంపుతూ దేవతవై నీవోవైపుగా
ప్రవాహాన్ని మోస్తూ శ్రామికుడినై నేనోవైపుగా
కొన్ని దూరాలనేవి దగ్గరిలోని అవాస్తవజీవనలే.....
దారికి చెరోవైపు విభిన్న ధృవాల్లా సంకేతాలమైపోదాం
రాత్రుళ్ళు చెట్టుకింద చీకట్లై సేదతీరుదాం
వూహూ....ఇది కూడా కవితకాదా...!!
మరింకేఁపదా...!
ఇద్దరి గదిమధ్య గోడను తొలగించేస్తే
ఒకతలుపై తెరుచుకుంటాను విశాలమై
నువ్వొక వలపై కప్పేద్దువూ దుప్పటిలా....

అతనిదొక ప్రపంచం

వెతుకుతూ వెతుకుతూ తిరుగుతున్న అతనికి
కొన్ని నిరాశలు మూటగా చెత్తకుప్పల్లో 
చనిపోవడం చూశాడు
ఇంకాస్త దూరం వెతికాక నమ్మకాలు చెట్టుకు ఉరేసుకొనుండటం చూసి
అతని దేహం మీద అతనికే పట్టు సడలిపోయి
రక్తపు తాళ్ళు పాకుతున్నట్టుగానో
గొలుసులన్నీ అతన్ని బంధించినట్టుగానో
ఏదో కాల్చేస్తున్నట్టు ముఖమంతా జేవురించిపోతోంది
ముక్కలు ముక్కలైన ఆర్తనాదాలు అక్కడక్కడా అరుస్తున్నాయి
ప్రతి మనిషి ఇంకో మనిషిని చంపేయడం
మళ్ళీ అదేమనిషి ఇంకోచోట పుట్టెస్తుండడాన్ని గమనిస్తున్నాడు
అక్కడంతా ఎవరికివారుగా చంపుకోవడాలే వుంటాయి
అక్కడంతా ఇంకో మనిషిని పుట్టించడాలే జరుగుతుంటాయి
ఇన్నన్నిటిని చూసి అతనికాశ్చర్యమేసింది
అతన్నెవరూ చంపడంలేదు
అందరి దగ్గరికెళ్ళి నుంచుంటాడు తాకుతుంటాడు
అందరూ నుసిలాగా తేలిపోతారు
అతనిలాంటి ఇంకొకరెవరో వచ్చి చంపేవరకు ఎదురుచూడ్డమే చేయాలని
అలా కాలం మంటల్లో బూడిదవుతుంటే
ఏదో అతనిమీదకొచ్చినట్టు భ్రమపడి పొదల్లోకెళ్ళిపోగానే
అప్పుడ హఠాత్తుగా మేఘం మీదపడ్డట్టు మసకతనం పడుతుంది
నిద్రనుంచి లేచి ఇందరి మధ్య అతనో జంతువుగా రూఢి చేసుకుని
అడవిలాంటి జీవితంలోకి కలలాగే ప్రవేశిస్తాడు
ఇదంతా అతనిదొక ప్రపంచం
ఆ ప్రపంచమంతా ప్రత్యేక ప్రజాస్వామ్యం

గుమ్మంతో

నుంచొని నుంచొని గుమ్మానికి కాళ్ళు నొప్పెట్టవేమో
బోల్డన్నిసార్లు చేతుల్ని ఊపుతూనో
అందర్నీ లోపలికి బయటికి సాగనంపుతూనో
దానికి నాకూ అస్సలు తీరిక దొరకదెందుకో మాట్లాడుకోడానికి
నేనేప్పుడు ఏమీ చెప్పలేదు
అదికూడా నాకేమీ చెప్పదు కాస్తయినా
ఇద్దరికీ మధ్య రహస్యాలేమీ లేవు కానీ,
దూరమైపోతుంటాం కొంతసేపు
ఒకరిలోకి ఇంకొకరం ఎగాదిగా చూసుకుని బయటికొచ్చేస్తూ
ఎవరికివాళ్ళం హద్దుల్లేకుండా ప్రేమించేసుకుంటూ
రూపంలో ఏదైనా మార్పుకోసం చూడకూడదనీ తీర్మానిస్తాం
గంటలకు రోజులకు చోటివ్వం
మాటలుకూడా వద్దనిపిస్తుంటాయి సాయంత్రాలు మునిగిపోతున్నపుడు
వ్యక్తికరణలేవీ వెలుపలికి కనపడనీయకుండానే
అర్థమైపోతూ గడిపేస్తుంటాంగా
అందుకనేననుకుంటా ఇద్దరమూ ఓ నిశ్చల జీవులమై
తలపులు తలుపులు
ఒకరికొకరం మార్చుకుంటూ
ఆరోజుకి నిద్దురపోతాం కావాల్సినన్నిసార్లు తిరుగుతూ

ఇద్దరమాయకులు

వస్తూవుండడం వెళ్తూండడమూ సహజమే
హడావిడిగా సాగుతుంది సమయమంతా
ఒకలాంటి ధీర్ఘ నిట్టూర్పుని వదిలెల్తూ
ఆమె వంక చూసినపుడో
లేదూ ఆమెకే వెళ్తున్నట్టు స్పురణకొచ్చినపుడో
చెరోఁవైపు నుంచి కాసిన్ని దిగుళ్ళను పంచుకోవాల్సివుంటుంది
దూరం కాలంకింద 
నలిగి బూడిదైనపుడన్నా కావచ్చు
సమయం వేగాన్ని దాటుకుని నిలబడ్డపుడన్నా కావచ్చు
కళ్ళ వెనక్కెళ్ళి తదేకంగా చూసుకుని
ఒంటరితనాలను స్వేచ్ఛగా చంపేసుకుని
నలుపు తెలుపుల మధ్య గడియారం ఊగిసలాడుతోందనీ తెలిసీ
మళ్ళీ ఆ వైపుకు తిరిగి ఎదురుగా నిలబడతాను
ఆమె నుదుటిపై వెన్నెలతో ఈ రాత్రి వెలుగుతోందని 
ఆ పట్టీల చప్పుడులో పగలు హాయిగా నిద్రపోతోందనీ
ఇద్దరి ఒకేవొక మైదానంలాంటి దేహంలోని మౌనానికి తెలుసు
ఆమెకూ తెలీదు నాక్కూడా తెలీదు
 
సత్యగోపి Blog Design by Ipietoon