నీతో కొన్ని చెప్పనా..!

దగ్గర దగ్గరగా..
నీతో నడిచే అడుగులన్నిటిని పోగేసి
నీతో మాట్లాడే మాటలన్ని ఏరి
నీ దోసిట్లో వేస్తాను..

భూమిలో నుంచి ఉబికిన పచ్చగడ్డిపై
నీవోవైపు
నేనోవైపు
నువు అలిగావని
నేను అడగాలని తెలుస్తోంది..

కొంత సమయం వృధా అయినా సరే
నీ కంటిపాప కింద నీటిచుక్కలా
చెంపల మీదకు జారుతూ..

కొన్ని క్షణాలు ఆగిపోయినా సరే
నీ మాటల స్వరాలను దాచుకుని
గుండెలపై మీటుతూ..

నీ చేతిని నా చేయి సుతారంగా పలకరించింది
నా హృదయంలో సెలయేటి చప్పుడు విను
నా గుండెలో చీకటిని తాకిచూడు

నీతో కొన్ని చెప్పనా..!
ఆరోజు బల్లపై ఇద్దరము
నువ్వోవైపు నేనోవైపు
చూపులతో సరదాగా మాట్లాడుకున్నాం
మట్టివాసనను తాకుతూ పాదాలు నడుస్తుంటే
భుజం పట్టుకున్నపుడు నా గుండె
నీవైపే చూస్తోంది...

నా పెదాలు నీ బుగ్గలను కౌగిలించుకున్నపుడు
నీ పెదాలు నా కళ్లవంకె చూస్తూన్నాయి..

నీతో కొన్ని చెప్పనా..!
ఇంకేం చెప్పకంటూ నీ చిర్నవ్వు నావైపు తిరిగి
నా గంభీరమైన నవ్వులో కలిసిపోయింది...

నువ్వొదిలిన క్షణం..రణం..

నువ్వొదిలిన క్షణం
ఘడియలు, దినములు, పక్షాలు,
మాసాలు గడిచాయేమో..
నాకెందుకులే...!

విశదీకరించలేని ఆలోచనతో
వివరించలేని భావాలతో
నిలుచున్నాను నిర్మానుష్య శరీరంతో..

హృదయంలో వణుకుని దాచేస్తూ
చర్మపు దుప్పటి వెచ్చగా..

నువ్వొదిలిన క్షణం ఇంకా అక్కడే ఉన్నాను
కదలని పాదాలతో
మరువని భావాలతో

గుండె గుహలో గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి
పెదవుల అంచుల్లో మౌనం
నిర్మాణమవుతుండగా...

నువ్వొదిలిన క్షణం
సంక్షోభం
సంశయం
సంఘర్షణం
ఎదురుచూపుల్లో సంగ్రహించే సంగతం కోరుతూ..

భరించలేని బాధను కప్పేస్తూ
విచలనమైన నవ్వు..
వివర్ణమైన నవ్వు..

నువ్వొదిలిన క్షణం ఆగిపోయింది
కాలం నాపై ఆగ్రహించింది
లేదు..
లేదు..
నేనే కాలాన్ని మరిచాను...

గతానికి మానవత్వపు ముడిసరుకు అడ్డు

నాకందుకే నచ్చనిది
ఎప్పుడూ ఇదే గోల ఇదే వేళ
కొన్ని బంధనాలకి అతుక్కుని

ఆలోచనల పట్టాలపై బొగ్గు బండి
పొగలా గుప్పుమని
జ్ఞాపకాలు

కొద్ది క్షణాలే
అందంగా, సుందరంగా
ఆ జ్ఞాపకపు అర ఖాళీ అయ్యేవరకు...

నాకందుకే ఈ గతాన్ని బంధించాలనిపిస్తుంది
కొన్ని క్షణాల కదలికలతో జీవితాన్నే
ప్రశ్నిస్తుంది...

కలత నిదుర నుంచి
మగత నిదురలోకి వీలైనంత వేగంగా జారిపోవాలి
లేదంటే వాటినే మరో రూపంలో నాపై జల్లుతుంది
ఆకాశంలో చుక్కలు ఇంటికెళ్ళేవరకు...

నాకందుకే గతాన్ని హత్య చేయాలనిపిస్తుంది
భవిష్యత్తు ప్రణాళికతో వర్తమాన ప్రక్రియ మొదలు
అక్కడక్కడ
మానవత్వపు ముడిసరుకు అడ్డు
తప్పదనిపించి విరమించా
దానితోనే గమనం మొదలు ఇక ఆగదు

విసరబడిని వీడ్కోలుని..!

అక్కడ

అదిగో అక్కడే..!

కూలిపోయిన చీకటి శకలాలు

ఆ వెనకే నే నిలబడి

సంతోషం బాధ కోపం జాలి
భయం శాంతం ధైర్యం
చైతన్యం విప్లవం
ఇంకా నాకు తెలియనివి
నీకు తోచినవి కలుపుకుని

వాటికి విరామచిహ్నాలు లేవని అడక్కు
అవెప్పుడూ నాలో కలివిడిగానే
ఉంటాయి
అందుకే విరామమెందుకని విసిరికొట్టాను...

అన్నిటిని
మానవత్వపు బొత్తాలు తీసి

నగ్న హృదయంతో
భగ్న ప్రేమికుడిలా నీ వైపుకు

కాగుతున్న దూరాన్ని
ఆవిరవుతున్న భారాన్ని
దు:ఖించే ఖర్మాగారంలోకి
శ్వాసించలేని కర్మాగారంలోకి
బంధించి...

నగ్న హృదయంతో
భగ్న ప్రేమికుడిలా నీ వైపుకు

రాయిలా నిశ్శబ్దంగా నీ ప్రక్కనే
శిల్పమై
పొగలు కక్కుతూ నీ ప్రక్కనే
వేకువై
నులివెచ్చగా తాకుతూ నీ ప్రక్కనే
రవికిరణమై

మాటలు మౌనంగా శబ్దం చేస్తున్నాయి...
నీ కనురెప్పల పలకరింపులు
నీ పెదిమల చిలకరింపులు

నే నీ ప్రక్కనే విసరబడిన వీడ్కోలుని
నీ ప్రేమికుడిని...

వర్షం - ఓ ఉదయం

కదపనా..
వద్దోద్దు అంటుకుంటుంది

పర్లేదు కదలవోయ్..
లేతవి కాదుగా
సున్నితం అంతే

పదా..!
అలా వెళ్ళి
పరిమళం దుప్పటి కప్పుకుని
వెచ్చగా వచ్చి
తేనీటిలో మునుగుదువూ కాని...

అమ్మో బయటికే..నేను
రాలేను..
ఈ బురదలో
ఈ ఛాండాలపు దారిలో

ఛప్ నోర్ముయ్..
బడుద్ధాయ్...

ఎప్పుడూ
ఈ సాంకేతికపు
సంకేళ్ళు వేసుకునుంటావా..!!?

అలా రా..
చల్లగా స్నానం చేసిన
చెట్లను పరికించూ..
నీ పాదాలను కావలించే మెత్తని
ఆ బురదను తాకు..
ఆ వాసన పీల్చు అమ్మలా ముద్దాడే
ఎంగిలి వాసన..
తూనీగలతో పోటి పడే పిల్ల కాలువలై
నువు కూడా అందులో దూకి
గెంతులేస్తావ్...

ఒక చిరునవ్వు...

కుసుమాల వంటి ఆ కన్నులు
అటువైపుగా వెడుతున్న అందరివైపు సాగుతాయి
ఎవరో ఒకరు దయచూపుతారన్న
ఆశతో ఎద నిండ
పరుచుకొని ఎదురు చూస్తూంటాడు...

ఎప్పుడు అక్కడే నిలబడి
ఉంటాడు

ఎంతసేపైనా చెరగని చిరునవ్వు
ముఖముపై వెలుగుతున్న దీపంతో
అందరిని ఆకర్షిస్తూ
పరవశింపజేస్తాయి...

దయ కలిగిన హృదయాలు అతని దోసిట్లో పడతాయి
చెరిగిన జుట్టు
చిరిగిన బట్టలు
అతడి జీవితాన్ని ప్రతిబింబిస్తాయి...

చలికి వణుకుతున్న శరీరం
భానుడి వేడి కోసం తహతహలాడుతోంది..

చుట్టు ఉన్న మురికిని సైతం
పరిమళంలా పీలుస్తాడు
అందరిని చిరునవ్వుతో పలకరించేస్తాడు..

చేతిలో పడ్డ చిల్లర ఎంతైనా
కళ్ళతోనే
కృతజ్ఞత తెలుపుతాడు..

బాల్యంలో ముద్రించుకోవాల్సిన
అల్లరి చేష్టలు
మధురమైన స్నేహాలు
తుంటరి పనులను
భహిస్కరించాడేమో...!

అతను ఎప్పుడు
ఎల్లప్పుడు
మెరుస్తున్న ముఖవదనంతో
చిరునవ్వుతోనే స్నేహం
చిరునవ్వుతోనే బాల్యం
చిరునవ్వుతోనే అనంతం
అని
నిక్కచ్చిగా
నిఖార్సైన ఒక చిరునవ్వు
మనకిస్తాడు...

తొలి అడుగు

తొలి పయనం వైపుకు
ఎన్ని పాదాల అడుగుల స్పర్శలో..

తొలి మాటల వెనుకే
ఎన్ని పదాల పలకరింపులో..

నా అక్షరం తొలి పదాన్ని స్ప్రుశించి
ఎన్నో పదాలను శ్వాసించి ఒక కావ్యమై..

నీ స్వేచ్చా అడుగుల వంతెనపై
నా అడుగుల జాడలు ముద్రిస్తూ..
చేయి చరచి గమ్యం వాకిలి తడుతూ..

స్నేహమై..!
చెలిమితో జత కడుతూ
విజయాల వారధిని సారధినై దాటుతూ..
అందులోనే అక్షరాల నక్షత్రాలను
ఏరుతూ...
చీకటి గదిలో అతికించాను వెలుతురుకై..

నెశీధిని తొలిచి స్నేహం
వెలుగై నాలో ప్రసరించేనూ..
చేయి చరచి గమ్యం వాకిలి తడుతూ..

తొలకరి జల్లు స్నేహమై తాకేను..
నీ మైత్రి కలయిక తీగలై అల్లుకునేను..
పయనం ఎటువైపైనా...
పయనం ఎన్ని వేల అడుగులైనా...

తొలి అడుగు నీతోనే
ప్రశ్నించని ప్రకృతి అందాలెన్నో
వర్షించని తొలకరి చినుకులెన్నో...

చీకటి...

ఏదో పరిమళం పలకరింపు
ఆరు ఋతువుల మేళవింపు
అష్టదిక్కుల లాలనలో నుంచి...
సప్తగిరులను వలమాని
నా తోపు మొదలలో
చంపక ననలై
సంవర్తిక మొనలై
నను అల్లుకుని పోతూవుంది...

అపుడే..
విన్ను చిక్కటి చీకటి చిమ్ముతోంది
వినుచూలి ఉరుకురికి పడుతోంది
పయోధిపై పరుగిడు లహరిలా
పృథివిపై పారుతున్న వహతిలా
హృదినుంచి కవనం
మౌనం వీడి మాటలాడాలని తపన
పదముల కూడి ఆటలాడాలని ఆశ
స్వప్నము నిక్కముగా నిలుచు సమయమిది...

నీ వలన నా లోకం...?

ఓయ్..!
ఏం చేశావో ఏమో
కుదురుగా ఉండలేకున్నా...

అదేంటో ..
నీ చూపుల వల
నీ మాటల చెరలో
నను కాజేశావు...

ఏంటిది..
నను ఊరక ఉండనీక
పిలుస్తున్నావో
పలకరిస్తున్నావో
సిగ్గు తుంపర్లతో చిలకరిస్తున్నావు...

ఏమిటోయ్..!
నేను నచ్చానని చెప్పక
బిడియం దాచి బడాయి పడుతున్నావు...

నీ ఊహల సుందరస్వప్నం
సుమధురం..
నీ మాటల మంత్రకావ్యం
సుమధురం..
నీ నడకల అద్భుతహొయలు
సుమధురం..

అయ్యో...!
నీ వల్ల వెర్రివాణ్ణి అయిపోయేలా ఉన్నా...

నీ వలన నా లోకం...?
సుందరమైనదో...
సంధిగ్దమైనదో...

నీవే బదులు.....

నేనేంటో....

ఇది నేను ఏర్పరచుకున్నది
నాకోసం నేను సృష్టించుకున్నది...
నాకంటూ నేను తయారు కావడానికి
నాలో నేను మరమ్మత్తులు
చేసుకుంటూ...

కరుగుతున్న రక్తపు చినుకు
మరుగుతున్న స్వేదం
మరొక్కసారి నా శరీరంపై చర్మంతో
గోడ కడుతున్నా...
కొన్ని స్వార్థ జల్లులు నాపై పడకుండా

ఇది నేను ఏర్పరచుకున్నది
నేను నిర్మించినది...
నాకంటూ నేను పరిశుభ్రమవడానికి
నాతో నేను తడుముకుంటూ...

జారుతున్న గుండెపై కన్నీరు

నేను
విశిష్టత కోరుకోను
విలువ కావాలంటాను...
ప్రేమ వద్దులే
పలకరింపు చాలంటాను...

నాలో నేను మరణించాక
ఆ పైన
నివురెందుకు..?
నాకు తెలుసుగా
నేనేంటో.....

అమ్మకు ఎందుకు...

అమ్మను అభినందించాలా.....

ప్రత్యేకంగా
ఎందుకు..

అమ్మ ఎప్పుడు ఆత్మీయత
అమ్మ ఎప్పుడు అనురాగం

అమ్మ నీ ఆకలి కడుపున
పేగుల
స్వరం...

అమ్మ రోజూ అమ్మే
ప్రత్యేకంగా ఎందుకు అభినందన...

అమ్మ చల్లని వెన్నెల
అమ్మ వెన్నెల పిలుపు
అమ్మ బ్రహ్మకు కూడా అమ్మే...

దేవుడు లేని లోగిలి
అమ్మ కౌగిలి...

అంతా అమ్మే
ప్రతి ఆడపిల్ల అమ్మే...

మరి ఒక జన్మ ఉంటే
అమ్మకు అమ్మగా పుట్టాలని

అమ్మ ప్రేమలోని ఆనందాన్ని
పొందాలని.....

అమ్మ నా శ్వాసలోని చల్లదనం...

నిజమేనేమో...!

నిజమేనంటావా...!

కరుగుతున్న నీటి బొట్టుకు
చల్లదనం తగిలినట్టు

పరుగెత్తిన పాదాలను
మెత్తదనంలో ముంచినట్టు

ఇపుడు జారుతున్న
కన్నీరు చాలు నాకు నీ జ్ఞాపకం
జ్ఞాపికం అవడానికి

ఊహించలేదు హృదయమా...!

మరీ నీ గొంతు వింటానని

నీ స్వరం ఇంకా వినబడుతోంది సఖి....

ఒకప్పటి నీ ముంగురుల స్పర్శ
మళ్ళీ..
ఒకప్పటి నా నవ్వులో దాగిన నీ ప్రేమ
మళ్ళీ..
ఒకప్పటి నీ కౌగిలింతల గిలిగింతలు
మళ్ళీ..

ఎంత బావుండేది ఆ క్షణం

ఇప్పటికి
నా తుది శ్వాస నీ ఉచ్వాస అయితే చాలు...

మరువలేను నిన్ను నాలోని

నా శవపు వాసన

ఇంకా నా శవం వాసన వస్తోంది

కృశించి క్రుళ్ళిపోయిన
నా ఎముకల
గూడు
బీటలు వారిన నా
చర్మం
ఇంకా వాసన వస్తోంది

నేనిక్కడ ఇమడలేనని
ఈ వేగంతో నడవలేనని

నన్ను మీరైన కాల్చేయండి....


కవిత్వం తినాలనుంది...!

ఏంటో ఇవాళ
బొత్తిగా సమయం కదలటం లేదు

మనసంతా ఇరుకుగా
శరీరం కరుగుతున్నట్టుగా

నువ్వైనా రావచ్చుగా
కవి..!
నాలోకి పరకాయం
చేయకూడదు

నాలుగు అక్షరాలు పిండి కలిపి
పదాల వడియాలు
ఆరబెట్టి
కాగితపు
నూనెలో వేయించి
కవిత్వాలను తినాలనుంది...

నువ్వంతేనోయ్..
ఒట్టి స్వార్థపరుడివి
నీక్కావలిస్తే
మట్టుకు
రవికి తెలియని చోటుని కూడా
కాజేస్తావు...

ఏం
నాబోటి వారిని కాస్త
పట్టించుకోవచ్చుగా...
నేను
పామరుడనే
అందుకే నిను రమ్మంటున్నా..!
నా మనసుని
పావనం చేయమని...

ఇది నా ఆర్థి
నా ప్రార్థన

తప్పుంటే క్షమించు కవి
ఎంతైనా
నేను నీ వాడినేగా.....

నా బాల్యం

నా బాల్యం
పల్లెటూరిలో
గతుకుల దారిలో
బస్సు గొట్టం నుంచి వచ్చే
దట్టమైన పొగ..
ఇంటి వెనక దొడ్లో పేడ అంత
చిక్కని మెత్తదనం..

నా బాల్యం
ముడ్డి కింద చిరిగిన నిక్కరు
అతుకులు..
చొక్కాకు గుండి పోగొట్టుకున్న బాధను
కప్పివేసే పిన్నీసు..

నా బాల్యం
వేప చెట్టుకింద
అరుగుపై
పెద్దమనుషుల చుట్టూ
పరిగెడుతోంది..
ఇంటి బయట ఆడవాళ్ళ
బారాకట్ట ఆటకు
సిద్ధమైంది..

నా బాల్యం
బడిలో తక్కువ మార్కులు వచ్చినందుకు
మేష్టారు చేతిలో బెత్తం..
చేను గట్టుపై పడకుండా పరిగెట్టే
పందెం..

నా బాల్యం
మసక చీకటిలో
చందమామ పక్కన చుక్కలను
లెక్కపెడుతోంది..
అవ్వ చెప్పే కథలకు
ఊ కొడుతోంది..

నా బాల్యం
ఎడ్లబండిపై
హోప్ప...హూప్ప...హో హో
అని ఎద్దులని గద్దిస్తోంది..
చిగురు కోసం చింత చెట్టుపై
కొమ్మకు వ్రేలాడుతోంది..

బాల్యం ఎప్పుడు
అందమైనదే
దర్జాగా, స్వతంత్రంగా,
ధీమాగా
ఉంటుంది నా బాల్యం..

నా బాల్యం
రాత్రి
ఒంటరిగా బయటికి వెళ్ళలేని
పసితనం..
అమ్మ పక్కనే కొంగు కప్పుకుంటుంది
నా బాల్యం..

నువ్వంటే భయం

నిను వెలివేస్తున్నాను...
ప్రపంచపు చివరి మెట్టుపై నుండి
విసిరివేస్తున్నాను...

నడవడం రాని అడుగు నువు
క్రమశిక్షణ లేని కవాతు నీది

శిలతో మాట్లాడినట్లు
నిశితో కలిసినట్లు
అశ్రువులో కరిగినట్లు

ఒట్టి భ్రమ నాది
మట్టి బొమ్మ నువ్వు...

ఆర్భటపు ఆవిర్భావానివి
అనంతలోకపు
అంతానికి సంకేతానివి

చెరిగిపోయే చిరునవ్వు నీది
దరి దాటని దరహాసం నాది
నాకు హద్దులు ఉన్నాయి
బరువులు
అరువులు
బాధలు
భయాలు
సంతోషాలు, సహవాసాలు ఉన్నాయి...

అన్ని నీవల్లే...

కష్టాలు నాకు ఇష్టాలు
బాధలు నాకు బంధాలు
తడబాటు నా తోబుట్టువు
అయినా
చిరునవ్వు నా పెదవుల
తడిని
తాకుతూనే ఉంటుంది...

సమాజమా...!
నువ్వంటే నాకు
భయం
నిను వదులుకోలేని భయం అది

కవిత్వ పుత్రిక

కరమున కలమును పట్టుకుని
రుథిర సిరా ఒంపుకుని
ఎదుట
పుటలను పరచుకుని
హృదయం బిగువుని భరిస్తూ
కవిత్వ పుత్రికను
కంటున్న
పురిటినొప్పులివి...

పల్లెటూరిలో పసరికల
మధ్యన
వెన్నెల్లో అవ్వ బోసి నవ్వుల
జడిలో
అక్షర పుత్రుడను పెంచే
పరిపూర్ణత

మట్టిని ముద్దాడిన ఘడియలు
ఒంటిగా గతాన్ని తవ్వుకునే
జ్ఞాపకాలు
నువు ఆడపిల్లవి...
నా అమ్మవి ...

ఓటమంటే ఇష్టం...!

గమ్యం ఎప్పుడూ గమనాన్ని
భయపెడుతుంది
అడుగు తడబడుతుందని.....

సమాధానంలో ఏముంది
ముగింపు తప్పా...
ప్రశ్నలను
తడుముకో
ప్రతిక్షణం పరిశోధిస్తావు....

విజయంలో సమాజం నిను మాత్రమే చూస్తుంది
ఒక్కసారి ఓటమిని
కావలించు
నువు సమాజాన్ని చూస్తావు
ఒక మనిషిగా మరో మనిషికి పరిచయం అవుతావు...

ఉధ్భవించు
ఉజ్వలించు
ఉవ్వేత్తున ఎగసిపడు
పోగొట్టుకునేది నీ ఆశ మాత్రమే
పొందగలిగేవి ఆశయాలు...

నాకు ఓటమి
ఇష్టం
నా కన్నులు చూస్తాయి...
వాటితో మాట్లడతాయి...
గెలుపు ఒకవైపే చూస్తుంది
గెలిచే వైపు...

ఓటమి నలువైపులా చూపిస్తుంది...
ఒంటరితనం వైపు
కన్నీటి వైపు
బాధ వైపు
బదులు వైపు
బాధ్యత వైపు

అందుకే ఓటమి ఇష్టం
నాకిష్టం...

ప్రమాదం - ప్రక్కన నేను

రాదారికి ఒక ప్రక్కగా నిలబడగా
తెరలు తెరలుగా రుధిరపు వాసన నాపై పరుచుకుంది
ఏవో అరకొరగా మూగ రోదనలు నా చుట్టు ద్రవించినవి

సన్నని వణుకు
తడిగా మారిన చేతులు
శరీరం కూలబడుతోంది

మనసు అక్కడినుంచి పారిపోబోయింది
అశక్తిక ప్రయత్నంగా తోచింది

జనాల ఆచోటే అతుక్కుపోయారు సలపకుండా
కొన్ని కొన్ని మానవత్వపు జల్లులు కురిశాయక్కడ

ఛిద్రమైన వాహనపు తునకలు పాదాలను తాకుతున్నాయి
బాధగా......
ఆర్ద్రతగా అందరిని చూస్తూ స్థానువయింది వాయువు కూడానూ
స్పర్శగా......

కన్నీటితో లోపల తడుస్తున్న నదిని అయిపోయాను
ఆ నిమిషం క్షణక్షణాలుగా విడిపోయాను

మనం చేసే కార్యాలకు వేగం
ఆలోచనలో...
శరీరానికి వేగాన్ని ఇవ్వడం ఇలాంటి ప్రమాదానికి స్వాగతమే.......


06-04-2013

నేను - నాలో నేనే



ఒక పిడికిలిలో చీకటిని
ఇంకో పిడికిలిలో వెలుగుని దాచేసిన
బలహీనత నాది

బాధలో చీకటిని చూసి నేనే నయం
ఆనందంలో వెలుగుని నువు సన్నబడ్డావనే అపహాస్యం
రెండిటిని బేరీజు వేయలేని అసహాయత

ఊహ ప్రపంచానికి వ్రేలాడేసిన వస్తువుని నేను
సమాజానికి అన్వయం కాని అద్దాన్ని
కొన్నిసార్లు భయంగా
కొన్నిసార్లు కోపంగా
కొన్నిసార్లు దిగులుగా
కొన్నిసార్లు గుబులుగా

అన్నిసార్లూ భయంగా చూస్తుంటాను........

నాలో నా ప్రశ్నకు సమాధానం నేనే
మిమ్మల్నడిగే ప్రశ్నకు ఆశ్చర్యమే బదులు

నేనో విరామచిహ్నాన్ని
ఒట్టి చిహ్నాన్ని
ప్రశ్నించాలని ఆపి అడగలేని స్వప్నాన్ని
తాకాలని చేయి చాపి స్ప్రుశించని గాలిని

ఎప్పటికైన నా జాబుకు
మీ జవాబు కావాలి.........

03-04-2013

ఒంటరిగా.....

 
నిలబడే ఉన్నారా.....
నిలబడేంత ఇష్టం ఉందా మీకు.....
ఆకాశం బరువుగా ఉంటే నిలబడగలరా...
భూమి మెత్తగా ఉంటే
నిలబడగలరా...

నిజం ఎదురుగా ఉంటే
నిశ్శబ్దంగా...........
అబద్దం మీ వెనకే ఉంటే
ధైర్యంగా............

ఒక కొత్త గొంతుక పిచ్చిగా
పరిమళిస్తుందేమో
ఒక కొత్త శ్వాస గంభీరంగా
అరుస్తుందేమో
ఒక కొత్త సువాసన చెవులపై
గుభాళిస్తుందేమో

అవును మరి
నేను మూర్ఖంగా మారిపోయాను
మీరు నన్ను వదిలేశారని ఇన్నాళ్ళుగా తెలియలేదుగా
మిమ్మల్ని సుగంధాలతో మోసి మూత వేసి
నేను చెత్తకుప్పని కావలించుకుంటాను.............

పారిపొండి...
నేను మంచితనపు మౌనాన్ని........
అరుస్తున్న నిశ్శబ్దాన్ని.............

11-02-2013 (ఒంటరిగా కూర్చుని )

వెతుకులాట


వెతుకుతున్నా......
కాగితపు గీతల మధ్యలో
కలము కురిపించే కన్నీటిలో
బెరుకుగా.....

నడుస్తూ
మట్టిని స్పర్శిస్తూ లాలనగా

మబ్బులను మింగేస్తూ నాలోకి
సముద్రాన్ని దాచేసుకుని నాలోనే
పుస్తకాన్ని ప్రాణానికి ముడివేశా

అయినా దొరకవుగా............

అలలను ఒక్కోక్కటిగా విడదీశా
నక్షత్రాలను ఒక మూలకు ఊడ్చేశా
అక్షరాలను చీల్చీ చూశా

అయినా నిరాశేగా.........

అమ్మనడిగా ఒడిలోనో, కొంగు ముడిలోనో కట్టెసిందేమోనని
నాన్నను అడిగా మనసులోనో, గుండె గోడల వెనక దాచాడేమో అని
అక్క గుప్పిట్లో, అన్నయ్య జేబులో
చెల్లి పుస్తకాలలో, తమ్ముడి చేతిలో
ఎక్కడయిననూ లేవుగా.........

ఒంటరిగా కూర్చూని చేతికి తెలియకుండా కలం వెంట
కనురెప్పకు తెలియకుండా కంటి వెంట
ఏడ్చేస్తున్నా...........

అపుడు అమ్మ రహస్యంగా
చెప్పింది
"నీలో వెతికావా......."
21-03-2013
 
సత్యగోపి Blog Design by Ipietoon