మాటలెప్పుడు

ఇద్దరి మీద నుంచి 
మాట తప్పుకుపోయిందని తెలియఖ్ఖరలేదు
ప్రయత్నించనూ వద్దూ!
దిక్కుతోచని శరీరాలు ఎదురుబడితే 
మాటలొక్కటేనా?
మాటల్లేని మాటల్లాంటివాటిని 
కొన్నైనా భర్తీ చేసుకోవాలిగా బ్రతుకు తూకానికి 
ఏరు పారుతుంటే బుడగలు రాయిని తాకి బద్దలయినట్టు
ఎండిన ఆకు గాలిలో ఎగురుతున్నట్టే చచ్చినట్టు
ఇద్దరి దూరం దగ్గరతో ఉబుసుపోక కబుర్లాడుతున్నట్టు
మాటలంటే శబ్దంగా ఎగసిపడ్డమే కాదు 
అడుగుల్లోంచి మాటలు
కదలికల్లోంచి మాటలు
స్పర్శల్లోంచి మాటలు
ఇద్దరి చూపుల యుద్ధంలోంచి రాలిపడుతున్నవి మాటలే...
రెండు స్పర్శలు ఏవైనా 
పొడిపొడిగానే తెలుస్తుంటాయి
రెండు అడుగులెప్పుడు ఒకే కదలికలోంచి ప్రయాణిస్తాయి
చెట్టువో కొమ్మని పైపైకి ఎదగనివ్వడం
ఆకాశం మేఘాలన్నిటిని ఒద్దికగా నడిపించడం
గాలులు పరిమళాల్ని మూలమూలకు విసురుగా జల్లేయడం
అలకు అలకు మధ్య సముద్రం సేదతీరడం
ఇన్ని ఇన్ని మాటల్లేకుండానే వ్యవహరించబడుతుంటాయి...
మాటలెప్పుడు మౌనంగా వున్నట్టే బాగుంటాయి
మాటలెప్పుడు మౌనంగా మాట్లాడినట్లే అనిపించాలి
మాటల్లోకి మాటలు ఒరుసుకుని ఇంకో మాటేదో పుట్టినపుడే మాటలు తేలికవుతాయి

ఇద్దరము



నేను తనవైపు వొరిగి చూస్తున్న ప్రతిసారీ
పువ్వులా మెలిపడి వుంటుందలాగే చినుకుల్లోంచి నవ్వేస్తూ,
కొమ్మలపైనుంచి ఓ మేఘంలా తీరైన ఒద్దికతో
నాలోకి వచ్చేస్తుంది
ఒక్కోసారి నేనో సముద్రం
తను ఓ నది
నీటి తరగలతొ చెట్టాపట్టాలేసుకుని
నిశ్శబ్ద ప్రపంచంలోకి ప్రస్థానం మొదలుపెడతాం
వెన్నెల వొకటి అలిగి తెల్లని ఉదయాల్లో
వెచ్చని దుప్పటి కప్పుకున్నాక మామూలుగా అయిపోతామెందుకో..?
ఇంకేదీ కావాలనిపించదు తననుంచి ఒక ప్రవాహమంతే...
ఒక్కోసారి దీపాన్ని వెతుక్కునే
నేనో తైలం తనోఁ వొత్తిలాగా మిళితమై
ప్రసరించబడుతుంటాం భువనానికి వెలుగునద్దుతూ
ఇంకేమీ అడగదు నానుంచి ఓ భరోసా అంతే...
ఇద్దరికి దొరకనిదేదైనా మిగిలిపోతే
అదిప్పటి జీవితమైనపుడు ఆగిపోకూడదనుకుంటాం ఎప్పటికీ
సంతృప్తి తెరలుతెరలుగా 
వచ్చివెళ్తున్నపుడు
గతానికి...
ఏదోక శ్వాస ఆగినపుడు,
ఒకే ప్రపంచాల్లాంటివి రెండూ కూలిపోయే స్థలం కావాల్సొస్తుంది...

వాడినొక్కణ్ణే

ఒకడొక చోటునుంచి కదుల్తుండగానో
గుంపులోంచి అరమరికల్లేకుండా తొలగిపోతుండగానో
పరికరాలేవి లేకుండా
ఒట్టి చేతులతోనో పట్టెడంత అక్షరాలతోనో
చూడగలిగినపుడు సంతృప్తి రేఖ వెలుగుతుంది...
ఉత్తిగానైనా,
కాగితాన్నో పుస్తకాన్నో తెరచి చూడగలగేయాలి...

రహదారులమీద క్షణాల్ని, గంటల్ని
సాంద్రమైన పుప్పొడిలా రాల్చేసిపోతుంటాడు
గుర్తులేవి మిగలవు మనలాంటి కొన్ని ఖాళీ దేహాలుంటాయంతే
ఏ సంఘటనలు జరగనపుడు
ఏదోక సంధర్భం విరుచుకుపడ్డపుడు
అతడికతడే ధూళికణాలుగా విచ్ఛిన్నమైపోగలడు
ప్రతిమనిషిలాగా తయారైపోవడం నేర్చుకున్నాడనిపిస్తుంది
మనిషంటే మనిషే
మట్టిలాంటి మనిషే
పొడిపొడిగా రాలిపోయే విడివిడిగా జారిపోయే
వున్నచోటే, ఒక్కచొటే ఉమ్మడిగా కదుల్తుండే
ద్రవ్యరాశిలాంటి మనిషే...!

ఒక్కోకర్ని స్పృశిస్తూ
ప్రయాణించగలిగాడంటే
వాడిలోన ఎన్నివేల అడుగులు పడుంటాయో
ఎన్నెన్ని రకాల ఊర్లు వాడిలోపల్లోపల శిథిలాలయుంటాయో
వాడిలోంచొక సంఘమో,
వొక వ్యవస్థో లేదొక ప్రపంచమో రాకముందే
ఏదైనా కొత్తరకపు వలవేసి పట్టేయండిపుడు
ఎవడిలాగా బ్రతకనపుడు
వాడినలా వదిలేస్తే ఇంకోకర్ని పూడ్చేసి
వాడిలాంటోణ్ణి తవ్వుకోగలడు జాగ్రత్త...!
కనీసం వాన్నొక అద్దంలోనైనా దాచేయాల్సిందే...!!

సాధారణమైనదొక

కాగితాల కొద్దీ నింపుకునే సంగతులెందుకు !
వేలి కొసన జారిపడే
నీటిబొట్టు అరిచే అరుపు సంగతో
మెలకువల్లో ఊపిరాడక మరణించే
కలల చివరిలేఖ సంగతో
ఇంటి వసారాలో సేద తీరిన వర్షం సంగతో
చెప్పుకోడానికి ఎన్ని కాగితాలని పోగేస్తావ్
పోగేసి పోగేసి సేనానివవ్వగలుగుతావు
చెప్పుకుని చెప్పుకుని మనిషివి అవగలుగుతావు
ఏం చేసినా
ఇంకో మనిషిని పోగేసుకోవాలని
ఇంకో మనిషితో చెప్పుకోవాలనేది
ఆఖరి శాసనంగా మిగిపోతేనే
సంగతులన్నిటిని అక్కడక్కడా దాచేసుకుంటావ్
గడిచిన కొన్నాళ్ళకు
జీవితం నీముందుకొచ్చి సాగిలపడుతుంది
అప్రయత్నంగా చూసి
స్పృశించడమొక్కటే మిగిలుంటుంది
అలసిపోయి బీడువారిన శరీరమిక్కడే
లేవలేని నిస్సహాయ క్షణంలో
కన్నీళ్లలో కొట్టుకుపోయాక ఒక మాట
జారిపోతుంది నీనుంచి
ఎన్ని చెప్పుకున్నా ఎన్నిటిని పోగేసినా
మనిషి మనలోకి వచ్చిన
సాధారణమైనదొక సంగతి మర్చిపోకూడదనీ !!

విస్ఫోటనం తర్వాత

ఒక విస్ఫోటనం తర్వాత
నిశ్శబ్దం పెకలించబడుతుందని గుర్తెరగాలి
ఎప్పుడైనా నీలోకి నీవే బద్దలయినపుడు
ఒక సంధర్భం వెతుక్కుని
అందులోకి ఒరిగి తడిమే బలం తెచ్చుకోగలిగినపుడు
విషాదాలు ఆవిష్కరించబడతాయి
విషాదమంటే
కొలిమిలో కాగుతున్న ఇనుపుముక్కలా
చుట్టుముట్టిన శతృవులను నిశితంగా చూడ్డంలాంటిది

దేహంలేని రెక్కల్లా టపటపమని
సముద్రంలేని అలలా గిలగిలమని
విలవిల్లాడిపో వికృతమైపో
అదే విషాదమని నీకు స్పష్టమైపోవాలి
ఎక్కడినుంచో
ఆకాశం నిన్నెతుక్కుంటూ రావాలని,
భూమి నీ చుట్టూ
కూడా నృత్యం చేయాలని,
ప్రపంచం మొత్తం పూలుగా నీపై కుప్పకూలిపోవాలనీ...
ఇలాంటిలాంటనూహ్యమైనవన్ని
నీక్కాకుండా నీ
విషాదంలోకే ప్రవేశించబడతాయప్పుడు

దొరకనిదేంటంటే
విషాదమంటే రెండు పగళ్ళ మధ్య కుట్టేసిన రాత్రిలా
నిశ్శబ్దంగా ఉండడం...
 
సత్యగోపి Blog Design by Ipietoon