ఇవాళ్టిదొక్కటే..!

1
ఎక్కడో పువ్వు పరిమళించడం ఊహించుంటావంతే
ఇంకెక్కడో ఒక మొక్క మొలకెత్తడం చూసుంటావంతే

ఊహలు కూడా కబ్జా కాబడిన 
కులక్షేత్ర పద్మవ్యూహంలో నువ్వో అభిమన్యుడవైనావిపుడు
2
సమభావంలేని సరిహద్దులనుంచి వెలివేయడమే
కారణమయితే నీ కన్నీళ్లతో దారిని తుడుస్తూ తిరిగొచ్చేయాల్సింది 
మధ్యలో ఆగిపోవడమనే చిగురుని ఎవరు మొలకెత్తిస్తున్నారో గమనించకుండా 
తల తిప్పేసుకుని ఉండాల్సింది
అది విషమ్నిండిన ఎరువుతో వేగంగా వృక్షమై నీమీదే కూలబడింది
3
నీ చివరి కన్నీళ్ళ తడిని రుచిచూడలేక
కలం కాగితంపై రక్తం చిందించిన వేడిని అందరూ పులుముకుంటున్నారిపుడు
వెలిసిపోని చీకటి రంగుగా ఆకాశంలో పరుచుకున్నావు
ఇంకెక్కడికీ వెళ్ళకూ...!
4
నేలమీద నడిచిన గుర్తులను చెరిపేయడానికి
గొంతులోంచి పేల్చిన ఆవేశాన్ని హత్య చేయించటానికి
ఒకానొక ఆయుధం నీదాకా రావడం సంఘంపై వేయబడే 
సాధారణ సంతకమంతే
అదొక ముద్రనుకొని పొరబడ్డావు కదా..!
5
ఉరిని సిద్ధం చేసుకునే ముందు
తల్లి పేగుతో పేనుతున్నట్టు మర్చిపోతే 
ఇన్నాళ్ళ నీ శ్వాస ఈ పరిసరాల్లో పరిమళించిన గుర్తులుండవు
వెళ్తూ వెళ్తూ కాస్తంత దుఃఖాన్ని, ఆక్రోశాన్ని
సమతూకంలో ఇచ్చావు చూడూ
అదే నువ్వంటూ వదిలెళ్ళిన శిలాఫలకంగా మొలకెత్తుతోందిపుడు
6
ఇవాళ్టిదొక్కటే చివరిదని నువు రాయగలగడం
గుర్తించనంతవరకూ అంతా తుప్పట్టిన దేహాల్తో తిరుగుతుంటాం


(రోహిత్‌ కోసం)

పరిభ్రమణం

1
అతను తూర్పులా మేల్కోవడం
ఉదయంలా పసిగడుతుందామె
నేలమొత్తం సముద్రమైనట్టు నదిలా పరిగెడుతూ వచ్చి
మైలురాయి పక్కన నవ్వుతున్న మొక్కలా చేతులు చాచినిలబడతాడు
ప్రేమంటే మరేదోకాదు
ఒక ప్రవాహమని అతనిలోకి పరిమళమై ఆక్రమిస్తుందామె
పువ్వులా అతను మరలా చిగురించడం ఆమె ఇంకోసారి జన్మించడమేనని
పరిమళంలా ఆమె ప్రసరించడం అతని నవ్వులా విస్తరించడమేనని
ఒకరిలోకి ఒకరు అంతర్థానమవుతారు
2
పడమరలా అతను ఒదిగే సమయానికి
సాయంత్రంలా ఆమె పొదువుకుంటుందతన్ని
ఎంతవాడైనా ఆమెలోకి నింపబడే వెలుగతడు
ఆమె రాత్రిలా కొంగులో దాచుకోగానే పిల్లాడిలా కరిగిపోతాడు
జీవించడం ఏంటో తెలిశాక
ఒకరిలోకి ఒకరు పునర్జన్మిస్తూనే వుంటారు
3
ప్రపంచపు కిటికీ వెనక దాక్కున్న చంద్రుడికి
ఒకవైపు అతను ఇంకోవైపు ఆమె
ఒకరికోసం ఒకరు పరిభ్రమిస్తారు కొత్తగా
4
గదిలో కొన్ని సముద్రాలు రెక్కలతో కూర్చొనుండగా
ఎవరైనా హఠాత్తుగా కాగితాలను తిరిగేయగలరు
వాటిపై ఎగురుతున్న గాలిపటంలా అక్షరమై
ఆమె ఒళ్ళు విరుస్తుంది
కాగితానికి వెనకవైపు దారంలా అతను కదుల్తుంటాడు
ఒకరిని ఒకరు విడిచుండలేని ఒకే ప్రపంచాలవుతారపుడు
5
పెద్దగా బ్రతికుండడం ఇష్టముండదు వారికి
రోజుకొకసారి పుట్టడం
రోజుకొకసారి మరణించడం
ఒక తూర్పులాగానో ఒక పడమరలాగానో
అంతే అదొక పరిభ్రమణం

దాగుడుమూతలు

అతను వెతుక్కుంటున్నాడు
తననితనే దాచేసుకున్నాడుగానీ ఇపుడు దొరకడంలేదు 
ఎలాగైనా వెతికి సముద్రమంత కాంతివంతంగా 
ఆమె కళ్లలో భద్రపరుచుకోవాలని నిత్యం అదే పనిగా వుంటాడు
ఆమె సర్దుతూవుంటుంది
అన్ని పక్కనే వుంటాయి చిందరవందరగా
ముందేదో వెనకేదో తెలీని అయోమయంలో వుంటుంది
ఎలాగో లా కంటపడకుండా అతనిజేబులోనే భద్రపరచాలని అదేపనిగా కూర్చుంటుంది
ఒకచోటే వున్నారు ఎదురెదురే
లెక్కపెట్టలేనన్ని కాంతి సంవత్సరాల దూరాల్లో
తనప్రేమను, అతని ఆప్యాయతల్ని, సంతోషాల్ని,
వేళ్లలో దాచుంచిన స్పర్శల్నన్నిటినీ తీరుబడిగా సర్దుతూ
అతనికోసం ఎదురుచూస్తోందామె
ఇంటిబయట తలుపుకి మరణవాంగ్మూలాన్ని వేలాడేసి
అతనికతనే ఆమె కౌగిట్లో దాచేసుకుని
పోగోట్టుకున్నాననుకుని చీకటికోసం వెలుతురులా వెతుక్కుంటున్నాడు
అతను వర్షంలా ఝల్లున కురిసే ఆమె సిగ్గు
ఆమె మేఘంలా కదిలే అతని కౌగిలి
 
సత్యగోపి Blog Design by Ipietoon