నది

ఒక నది 
అవతలొక తీరం ఇవతలొక తీరం
నదిని చూడాలంటే ముందుగా ఒక బండరాయిని
వెతుక్కోవాలి
దానిమీద నిలబడి చూస్తే ఆకాశం మీద
నది పారుతున్నట్టే ఉంటుందనీ భ్రమలోకెళ్తాం
అక్కడక్కడా నక్షత్రాల గులకరాళ్లను
మరిచిపోకూడదు
నది నృత్యం చేయడం తెలీదేమో
వంపుల దగ్గరికెళ్ళి తొంగి చూడగలగాలి
కొన్ని కన్నీళ్ళు ఎగసిపడుతుంటాయి చూశారా...!
మునిగి చూడండి మేఘాల్లో తలను ముంచినట్టుంటుంది
అపుడు కన్నీళ్ళుండవు
నదిలా మనం బ్రతుకుతున్నామని
అవగతమవుతుంది.
ప్రవహిస్తున్నపుడు
జీవితంలోని నదిగాని నదిలాంటి జీవితంగాని
ఎత్తుపల్లాలను
కష్టసుఖాలను
కొలిచే తూనికలు ఇంకా తయారుకాలేదేమో
అసలు నన్నడగకూడదు మీరు
నదిని ప్రేమించడం వెనక జీవితం ప్రవహిస్తుందని

అలల జీవితం

హఠాత్తుగా
నేనేమో అలలా మారిపోతాను
మారి నేలపై 
పడుకుని పొర్లి పొర్లి పారుతుంటాను
అలేమో నాలాగనో లేక
ఇంకో మనిషిలానో
మారి అటు ఇటు పచార్లు చేయడం చూడాలనీ
నడుస్తుందో పాకుతుందోననీ వెతికా
అల ఆడుకుంటోంది ఇసుకతిన్నెలమీద గెంతులేస్తోంది
తీరం అంచున పరిగెడుతోంది
మోకాళ్లు మడిచి చేతులు చాచి సముద్రాన్ని హత్తుకుంటొంది
అలల దేహం చూడాలని
నాలోకి నేనే మునిగి చూసుకుంటే
కాస్త నీలంగా
ఇంకాస్త తెల్లగా అచ్చంగా నాలాగనే వుంటాను
ఇంకేమీ తోచక
గవ్వలన్నిటిని రెక్కలు చేసుకుని
నింగి సముద్రంలోకి
ఎగురుతుంటాను తేలికగా నాలాంటి అలల కోసం
అలా తిరిగితిరిగి అలల కోసం
తీరం వచ్చేసిందని మేఘాలపై తల వాల్చగానే
జర్రున జారిపోతాను చినుకులా
నేలపై పడగానే
ఈతరాక మునిగిపోవడం మీరు చూస్తారో లేదో
పారడం వెనక
ఎంతో కొంత హాయిదనం ఉండచ్చు
లోలోపల ఒక జీవిత పరిణామక్రమం ఉండనూవచ్చు
ఏదైనా
ఆస్వాదించడంలోని పరిపక్వత ఉన్నతమైనదే
ఆ జీవితం మరణం అంచున నిలిచేదాకా..!

అక్క

చూపుడువేలు పట్టుకుని 
పరుగుదీసినా
వెనక రెండుపాదాలు నిదానంగానే నడుస్తాయి
పడుకున్నాక నా కాళ్లు 
ఆసరాకోసం తన కాళ్లను తలగడగా తీసుకుంటాయి
రాత్రికలలో 
ఉలికిపాటుకు 
కౌగిలింత ధైర్యాన్నిస్తుంది జోలగా
ఉదయాల్లో బుగ్గలపై నునుపైన 
స్పర్శల మెలకువలు 
మళ్లీ మళ్లీ ఉదయించని ఉషోదయాలు...
దారిలో నడుస్తున్న పాదాలు 
అమాంతం పైకి వెడతాయి 
భుజాలపైకి 
కొత్తముఖాలేవైనా 
ఎదురుపడితే చేతులు 
తన నడుముచుట్టు బిగుసుకుంటాయి భయాన్ని తనపై వేస్తూ
ఎప్పుడైనా కోపమొస్తే నా పంటిగాట్లు తన చేతిపై ముద్రలవుతాయి
అయినా తనకెప్పుడు నేను ప్రేమనే
దుప్పట్లు చిరిగేలా
పోట్లాటలు మావరకూ అవి భయంకర యుద్ధాలు
కొన్ని క్షణాలకే ఆరుబయట 
పసరికల్లో కాళ్లు మునగదీసుకుని కబుర్లూ...
తను కూర్చుంటే 
వెనకనుంచి మెడచుట్టూ చేతులు చుట్టేయటం నాకిష్టం
జ్ఞాపకాలిప్పుడు 
పాతపుస్తకాల మధ్యలో మసకబారిన అక్షరాలయ్యాయి...
తన చేతుల్లో 
నాముఖం ఇప్పటికీ సేదతీరుతున్నట్టేవుంది
 
సత్యగోపి Blog Design by Ipietoon