నిశ్శబ్దగది

తడిలేని కన్నీళ్ళను నింపుకోగలిగే గదొకటుంది
పెచ్చులూడిన దేహంలాంటి నిర్మానుష్యమైన గది
ఎవ్వరూ లేనపుడు తూనిగచప్పుళ్ళను మింగేసే నిశ్శబ్దగది
ఏ శూన్యసంద్రంలోంచో మంద్రమైన వెలుతురు అందులోకి ప్రసరించింది
ఇపుడాగదికి రెక్కలొచ్చాయి అయినా ఎగరడంలేదు
నేలపై జారగిలబడి అనూహ్యమైన శక్తితో పాకుతోంది
పిట్టగోడ మీదనుంచి పాకుతున్న తీగలా గోడగోడను పట్టుకుని వేలాడుతోంది
చివరంచుదాకా ఎగరగలిగింది కానీ అటుపక్కకు దూకడం లేదు
శక్తి అంతా దృశ్యరహిత ఆకర్షణకు కూలబడిపోతోంది
చేతిలో ఏ ఆయుధమూ లేకపోవడంతో నిండైన ప్రోత్సాహం కోసం తననితానే తవ్వుకుంటోంది
ఆ గదికి ఇపుడొక పద్యం కావాలి
రాతిబండ కింద ఊరుతున్న తేమలాంటి పద్యమో
ఊరి మధ్యలో నిటారుగా నిలబడ్డ చెట్టులాంటి పద్యమో
నగరానికి అవతల విసిరేయబడ్డ మనిషిలాంటి పద్యమో
రాజ్యం తూపాకికి ఎదురుగా ఎక్కుపెట్టిన తూటాలాంటి పద్యమో
సంఘం నెత్తిన పిడికిలితో బలంగా మోదగలిగే పద్యమో కావాలి
సమాజాన్ని వరదలా ముంచెత్తి ఆ గదిలో నింపగలిగే పద్యం కావాలి
ఆకాశాన్ని చుట్టచుట్టి గూట్లో భద్రపరిచే పద్యం కావాలి
సముద్రాన్ని కిటికీ అద్దంలా నిర్మించే పద్యం కావాలి
మొత్తం మట్టినీ నింపుకున్న అవతారమెత్తాలి
ఆ పద్యమే మట్టి అనిపించేంత కొత్తరూపమవ్వాలి
పద్యానికి మట్టిని అద్దడం కాదు మట్టిలోంచి వచ్చిన మధురమైన పద్యం కావాలి
మట్టిలాంటి ఆ మధురమైన పద్యం ఆ గదిని మింగేయాలి
మట్టి లేకుంటే గది గదికాదు, పద్యం పద్యమే కాదు
మట్టిలాంటి పద్యం ఎప్పుడైనా గది అవుతుంది
మట్టిలాంటి గది ఎప్పుడైనా పద్యం అవుతుంది
వెళ్ళండి మట్టి మాట్లాడిన పద్యం ఆ గదిలో వుందేమో వెతకండి
మట్టికిందే పద్యం పడుకుని వుండగలదు
నిలదీయండి ఆ పద్యాన్ని ఇంకో గదిలాంటి పద్యం చెప్పమనీ,
అది ఈ దశాబ్దాన్ని శాసించే పద్యమవ్వాలని !!



Published in  Andhrajyothi 'Vividha' on 21-03-2016

0 comments:

Post a Comment

 
సత్యగోపి Blog Design by Ipietoon