చిన్నవిషయాలు

చాలా చిన్న విషయాల్నే మాట్లాడుకుందాం
ఇక్కడే పరిసరాల చుట్టూ పరిభ్రమించే వాటినే పేర్చుకుంటూ
వరండాలోని నేలమీది తడిని కాస్త అద్ది చూడగలిగినపుడు కంటిలోని తడి తేలుతుంది
పిట్టగోడ అంచుల్లో వేలాడే మరకను తాకినపుడు గతకాలపు బాధొకటి రాలుతుంది
ఏమీ తోచనపుడు అలా వీధిలోకెళ్ళి నిలబడు బతుకు నడుస్తున్నట్టు నెమ్మదిగా తెలిసిపోతుంది
చుట్టూ వుండే అన్ని గడపలని పరిశీలించు అందరూ జీవితంలోకి వస్తూ పోతూ
ఎంత క్రమశిక్షణగా పనులు చేస్తుంటారని అనిపించకమానదు
నిన్ను నువ్వు వేరుశెనగలా ప్రీతిగా ఒలిచి చూడు
గడిచిన సమయం ఎంత దుఃఖపడి నీకు దూరమైందో చెబుతుంది
ఓ అరగంటో పావుగంటో దానికిచ్చేయి నిన్నెంత జాగ్రత్తగా, అపురూపంగా ప్రేమించిందో లేఖరాస్తుంది
చాలా చిన్న విషయాల్నే మాట్లాడుకుందాం
ఎక్కడో ప్రపంచానికి ఇంకోవైపున ఉత్పన్నమయ్యేవి కావవి
ఇన్నాళ్ళ తర్వాత నువ్వు స్వీకరించగలిగేది ఇంతకుమించి ఏముంటుంది
ఇంటిబయటి చెట్టుకింద తలొంచి నిలబడు ఉత్తేజం నీలోకి వేర్లనుంచి
ప్రసరించడం కనిపెట్టగలవు నువ్వు
ఆకాశం, మంటనార్పి నిద్రపోయేటపుడు మేడమీద దుప్పటిపరుచు చలచల్లని చీకటిలా పడుకుంటుంది
పక్కనే పడుకుని చుక్కల్ని లెక్కపెట్టు సరదా అనేది దీనికన్నా పెద్దదేమీ అవ్వలేదు
ఇంకొకరి నుంచి ఏమీ అడగకుండా ఇన్ని దొరికినపుడు జీవితం ప్రత్యేకమైనదేమీ కాదు
ఆలోచించినంత సులభంగానే కాగితంపై లిఖించబడుతుంది
నీపై నీ పరిశోధనకి అమూల్యమైన పెట్టుబడి జీవితమే
కష్టనష్టాల్లో జీవితాన్ని నడిపే గొప్పకార్మికుడివి నువ్వొక్కడివే
చాలా చిన్నవిషయమే కదూ మాట్లాడుకున్నామిపుడు

0 comments:

Post a Comment

 
సత్యగోపి Blog Design by Ipietoon