మాట్లాడే మనిషికోసం

మాటల్ని మోసుకుతిరగడం నిరంతరాయంగా జరిగే ప్రదర్శన
ఎట్లా వున్నా ఎన్నిసార్లైనా అలంకారంచేసి
తెల్లారగట్టే ముఖమ్మీద అద్దిన వేకువలా 
మాటల్ని సిద్ధం చేస్తాం
వొడ్డున నుంచొని రాయిని చెరువు ఎదపై
గెంతులేయించినట్టు మాటని సమూహమ్మీదకు విసిరేస్తాం
జాతరలో పిల్లాడు బొమ్మకోసం నాన్న చొక్కా లాగినంత
నిర్మలంగా
మాటలకోసం
మనిషి మనిషిని పట్టుకుని కుదిపేస్తాం
మనిషిని కలిసిన ప్రతిసారి మాటలు పచ్చిగా వుంటాయి
కొత్తగా నిర్మించే భవనంలోంచొచ్చేంత పురాతన పరిమళం
మాటలపుడపుడు బరువవుతాయి
సముద్రాన్ని మోస్తున్న గవ్వలంత తేలిగ్గా
మాటల్ని అవలీలగా భుజానేసుకుని నడిచెళ్ళిపోగలగాలి
మాటలు ఎట్లాపడితే అట్లా పూర్వజీవికలోంచి మనిషి గొంతులోకి
దౌర్జన్యంగా దూరిపోయి ప్రదర్శించబడతాయి
గొంతే వేదికయి ముఖమే తెరలా అందరికీ ఆహ్వానం అందుతుంది
మాటలు అతి నిరాడంబరంగా భాసిల్లగలవు
మాటల్లో ఉత్కృష్టమైన సౌకుమార్యం వుంటుంది
మాటల్లో విధ్వంసకర యుద్ధం దాగుంటుంది
మాటల్లోంచి సంతోషాన్ని సులభంగా వెలికితీయొచ్చు
ఎదురొచ్చే మనిషి మనిషికీ నేలపై పంటచేలు పూసే పరిమళమంత
మృదువుగా మాటల్ని ఒలికించి సాగిపోవచ్చు
ఒకప్పుడు మాటలు తేలిగ్గానూ సౌందర్యవంతంగానూ వుండేవి
వాగు వీపుమీద సేదతీరే గడ్డిపువ్వులా
సునాయాసంగా మాటలొచ్చేవి
ఇపుడు మాటలన్నీ ఇంటి గుమ్మం బయటున్న
కసువులా దుమ్ముకొట్టుకుపోయాయి
మాటలకు పూర్వవైభవంకోసం మనిషి సిద్ధమవ్వాలి
వానచినుకు తగిలిన మట్టిలాగా మాటొచ్చిన మనిషి పరిమళిస్తాడు
మాట మనిషి మాటలంటే మనిషే
మాటలంటే మనిషికున్న రెక్కలే
మాటలంటే మనిషివ్యక్తిత్వానికి ప్రాణవాయువే
మాటల్ని చంటిబిడ్డలా చంకలో ఎత్తుకుని తిరగడం
నిరంతరాయంగా జరిగే ప్రయాణం
ప్రాణంలోంచి ప్రాణంలోకి ప్రయాణించే నిర్జీవమైన ప్రాణమే మాట
మనిషికి మనిషికి మధ్య వంతెన మాటలే
మనిషి మనిషిని నిద్రలేపే వేకువస్పర్శ మాటలే
మాటలు మేల్కోల్పుతాయి
మాటలు మంటపుట్టిస్తాయి
మాటలు గొంతులో దాక్కున్న అగ్నిపర్వతాలు
మాటలు మట్టిలో దాపెట్టిన విత్తనాలు
మాటలను మనిషిలో పూడ్చాలి
అపుడే మనిషి పుడతాడు మాటలను ఎత్తుకుంటాడు
మాటలు మాత్రం మనిషిని మోసుకుని అలా అడవిలోకి సంఘంలోకి విడిదికెళ్తాయి

0 comments:

Post a Comment

 
సత్యగోపి Blog Design by Ipietoon