వొకరోజుని...!

ఖచ్చితంతా ఎవరోవొకరు 
వొకరోజుని ఆ పాడుబడిన ఇంటిలోపల కూర్చొని
ఖాళీ కాగితాలపై నిర్మించాల్సిన సంధర్భం ఎదురవచ్చు
రాదనో రాలేకపోతుందనో లాంటి జీవంలేని పదాలను వల్లెవేయడం
చేతనవునో కాదోననే శక్తిహీన భావాలను ముఖాన
తగిలించుకోవడం చేశారంటే
ఇక్కడ వుండడానిక్కూడా అర్హతలేని వారవుతారు
పొయ్యి అంచున పొరపాటున కాలుతున్న గుడ్డముక్కలా
జీవితం ముంగిట మీ ప్రాణం అంటుకుపోయి
చచ్చిన దేహం మట్టిని అంటుకోవడం ఎంతమాత్రమూ విలువైనది కాదు
మీ ఎదురుగా అద్దాన్ని వుంచుకొని చూడగలిగితే
వెనకవైపు ప్రపంచమొక ఖాళీ కాగితమై రెపరెపలాడుతుంది
ఆ కాగితంపై మీరొక అక్షరమై
పున్నమి రాత్రి నదిలో ఈతకొడుతున్న చంద్రుడిలా వెలుగుతారని గుర్తించండి
బతికేయడం పెద్ద కష్టమైనదేమీ కాదనుకోండి
బతుకుని గుర్తుచేసుకుంటూ ఒక్కరై చావడం ఇపుడు అత్యంత ప్రయోజకమైంది
బీడుపడ్డ జీవితంలోని ఏ వొక్కరోజునైనా
నదికిరువైపులావున్న వొడ్డులాంటి మీ చేతుల్తో
ఇసుక గూడులా నిర్మించండి
జీవించడం సుధీర్ఘమైనదవ్వాల్సినదే అనికాదు
కొన్ని క్షణాల్లో మరణించే గూడులా
వొక్క అలనురగ పరిమళాన్నైనా శ్వాసించగలగాలి
దేహాన్నుంచి వేరయ్యే ఆత్మకు
వొక్క మనిషి చెమట సువాసననైనా తడిమి వొంటికి పూసుకోనివ్వాలి
అలాంటి వొకరోజుని
బాధ్యతగా రాసుంచుకోండి
అలాంటి వొకరోజుని బతుకులోంచి దొంగలించండి
అలాంటి వొకరోజు చేతుల్లో వుండగా మరణించడం ఘనమైనది

0 comments:

Post a Comment

 
సత్యగోపి Blog Design by Ipietoon