కాగితంపై పడి

ఆలోచనను నిద్రపోనివ్వాలి
చీకట్లో చేత్తో తడిమినా దొరకని వస్తువులా
ఆలోచన వో మూలన పడుండాలి
ఎవరికీవారం మిణుగురు పురుగులమై ఉత్సుకతనిండిన
ఖాళీ మెదడ్లతో ఎగురుతూ
ఆలోచనకోసం పరితపించాలి
పొద్దున్నే ఇంట్లోంచి వేళ్లేముందు రాత్రి పడుకున్న దిండుకిందనో
ఉదయాన్నే ఓ సారి తిరగేసిన పుస్తకం కాగితాల్లోనో
సగం తాగేశాక మిగిలిన కాఫీలోనో
ఎక్కడో వొకచోట ఆలోచన జారిపోయుండాలి
లేదంటే వాటిలోనే దాచిపెట్టేసైనా వెళ్లుండాలి
పక్కనింకో మనిషే లేనపుడు ఆలోచనను మాత్రం ఎందుకు వెంటబెట్టుకెళ్లాలి
సాయంత్రం ఎండవేడికి వొంగిపోయిన చామంతి మొక్కలా 
ఇంట్లోకొస్తావు.. 
ఈపాటికి మర్చిపోయుంటావు ఆలోచన ఎక్కడ దాచిపెట్టావో
నిద్రనుంచి మేల్కున్న పిల్లాడిలా ఆలోచనను పిలుస్తావు
ఉలకదు పలకదు
కనీసం నీ వొంట్లో దొంగచాటుగా నడిచిన గుర్తులైనా కనిపించవు
వొకమాటైనా చెప్పకుండా ఎక్కడికెళ్లిందోననే 
భయం గడ్డాములో పాకుతున్న పాములా నీపై పాకుతుంది
ఎండకాలం పూట తడిమిగిలిన పచ్చగడ్డి
వేర్లంచుల్లో దాక్కొనుందో ఏమో..!
ఏ చీకటి కిటికీ ఊచలను పట్టుకుని వేలాడుతోందో
పుస్తకాల వెనకేమైనా దాక్కునుందానీ ఆబగా పుస్తకాలన్నిటినీ సర్దుతావు
అలుపుండదిక, మెల్లగా లేచి 
కాఫీ కప్పుని, కాగితాన్ని 
వేల్లమధ్య ఆయుధమై తలెత్తి నిలబడే కలాన్ని ముందేసుకుని 
ఊర్లల్లో అరుగుమీద కూర్చొని బియ్యం చెరిగే 
అమ్మల్లా  కూర్చుంటావు
అదిగో అప్పుడే పసిదానిలా గెంతుతూ వచ్చి
నీ వొళ్లో వాలిపోతుంది 
ఆ భయం పరుచుకున్నప్పటినుంచే ఆలోచన నీ వెనకే నిలబడి
దాగుడుమూతలాడిందని గుర్తుచేసుకుని
దొడ్లో పూచిన చెండుపూలలా నువ్వుకూడా నవ్వేస్తావు
పెరట్లో కాచిన మామిడిపండులా ఆలోచన నీ పెదాల మీదనుంచి 
అదాటున కాగితంపై పడి నీకోసం ప్రాణాలర్పిస్తుంది

0 comments:

Post a Comment

 
సత్యగోపి Blog Design by Ipietoon